ETV Bharat / bharat

కరోనా విజృంభణతో 'భారత్​ బంద్​' తరహా పరిస్థితి!

author img

By

Published : Mar 13, 2020, 4:56 PM IST

Updated : Mar 13, 2020, 8:18 PM IST

కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. సినిమా థియేటర్లు, దుకాణాలు, విద్యాసంస్థలను మూసివేస్తున్నాయి. దిల్లీ జేఎన్​యూ తరగతులు, పరీక్షలను రద్దు చేయగా.. కరోనా ప్రభావిత దేశాలకు విమానాలను నిలిపివేసింది ఎయిర్​ ఇండియా. నెల రోజుల పాటు నియామక ర్యాలీలను వాయిదా వేసింది భారత సైన్యం.

Coronavirus
కరోనా విజృంభణతో 'భారత్​ బంద్​' తరహా పరిస్థితి!

కరోనా విజృంభణతో 'భారత్​ బంద్​' తరహా పరిస్థితి!

దేశంలో కరోనా వైరస్​ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నివారణ చర్యలు చేపట్టాయి. జన సంచారం అధికంగా ఉండే సినిమా హాళ్లు, దుకాణ సముదాయాలు, విద్యాసంస్థలను మూసివేసేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే పలు క్రీడలు, వేడుకలను రద్దు చేశాయి.

తొలి మరణంతో

దేశంలో కరోనా కారణంగా మరణించిన తొలి వ్యక్తి కర్ణాటక కలబురిగి వాసి. ఈ నేపథ్యంలో పలు ఆంక్షలు విధించింది యడియూరప్ప ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాల్స్​, సినిమా థియేటర్లు, పబ్బులు, నైట్​క్లబ్స్​, విశ్వవిద్యాలయాలను వారం రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది.

వాటితో పాటు అన్ని రకాల ప్రదర్శనలు, సమ్మర్​ క్యాంపులు, సమావేశాలు, పెళ్లి, జన్మదిన వేడకలను వారం పాటు అనుమతించబోమని స్పష్టం చేసింది.

యూపీలో విద్యాసంస్థలు బంద్​..

కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టింది ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలను ఈనెల 22 వరకు మూసివేయాలని ఆదేశించింది. పరీక్షల షెడ్యూల్​ లేని అన్ని రకాల విద్యాసంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. అయితే పరీక్షలు ఉన్న విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

యూపీలో ఇప్పటి వరకు 11 కేసులు నమోదయ్యాయి.

విద్యార్థుల ఖాతాల్లోకి...

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈనెల 31 వరకు అన్ని సినిమా థియేటర్లు, ఉద్యానవనాలు, పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ కేంద్రాలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది బిహార్​ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయనున్నట్లు తెలిపింది.

ఛత్తీస్​గఢ్​​లో..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలు, జిమ్ములు, స్విమ్మింగ్​ పూల్స్​, వాటర్​ పార్కులు, అంగన్​ వాడీ కేంద్రాలను ఈనెల 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం.

జేఎన్​యూలో తరగతులు రద్దు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిల్లీ జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్​యూ) తరగతులు, పరీక్షలను ఈనెల 31 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. అయితే.. పరిపాలనా వ్యవహారాలు కొనసాగుతాయని, అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది హాజరుకావాలని స్పష్టం చేసింది.

ఆ దేశాలకు విమానాలు నిలిపివేత..

కరోనా ప్రభావిత దేశాలైన ఇటలీ, ఫ్రాన్స్​, జర్మనీ, స్పెయిన్​, దక్షిణ కొరియా, శ్రీలంకకు ఈనెల 30 వరకు విమానాలను రద్దు చేసింది దేశీయ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా.

నియామక ర్యాలీలు వాయిదా

కరోనా కారణంగా అన్ని రకాల నియామక ర్యాలీలను నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది భారత సైన్యం. అత్యవసర విధులకు హాజరయ్యే వారు మినహా మిగతా అధికారుల ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ఎక్కువ శాతం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారానే పనులు పూర్తి చేయాలని కోరింది.

ఇదీ చూడండి: భారత్​లో 75కు చేరిన కరోనా కేసులు

Last Updated : Mar 13, 2020, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.