ETV Bharat / bharat

ఆపరేషన్​ హస్తం: కర్ణాటకలో ఏం జరుగుతోంది?

author img

By

Published : May 29, 2020, 4:40 PM IST

కర్ణాటకలో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. సీఎం యడియూరప్పకు వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇందుకు సంబంధించి వచ్చిన కథనాలను యడియూరప్ప సహా పలువురు ఎమ్మెల్యేలు ఖండించారు. అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Cold war Began in BJP
కర్ణాటక

కర్ణాటకలో అధికార పక్షంలో అసంతృప్తిపై వస్తోన్న వార్తలపై ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు. ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహించారన్న వార్తలను ఖండించారు.

"నేను కొంతమంది ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ అయినట్లు కొన్ని ఛానళ్లు వార్తలను ప్రసారం చేశాయి. ఇది వాస్తవ దూరం. ఎలాంటి భేటీ నిర్వహించలేదని స్పష్టం చేస్తున్నా."

- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి

అధికార భాజపాలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బెలగావిలో మాజీ ఎంపీ రమేశ్ కత్తి నివాసంలో ఉత్తర కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈ భేటీ జరిగినట్లు సమాచారం.

జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూల్చివేత తర్వాత కొంతమందికి మంత్రి పదవులు దక్కలేదు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం కూడా కొంత మంది ఎమ్మెల్యేలతో భేటీ అయినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

భేటీ కాదు.. విందు..

ఎమ్మెల్యేల భేటీపై రమేశ్​ కూడా వివరణ ఇచ్చారు. చాలా రోజులు అవుతోందని విందు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాజ్యసభ సీటుకు సంబంధించి తన సోదరుడు ఉమేశ్​ కత్తికి ఇప్పటికే యడియూరప్ప వాగ్దానం చేసినట్లు తెలిపారు.

"కొన్ని రోజుల కింద ముఖ్యమంత్రిని నా సోదరుడు కలిశారు. ఆయనతో రాజ్యసభ సీటు గురించి గుర్తు చేశారు ఉమేశ్. యడియూరప్ప కూడా నా సోదరుడి అభ్యర్థనను అంగీకరించి హామీ ఇచ్చారు."

-రమేశ్ కత్తి

అదేం లేదు..

పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదని మంత్రి గోపాలయ్య, ఎమ్మెల్యే మురుగేశ్ నిరాణీ ఈటీవీ భారత్​కు స్పష్టం చేశారు. తాము ఎలాంటి సమావేశాలకు హాజరు కాలేదని తెలిపారు. పార్టీకి సంబంధించి అంతర్గత వ్యవహారాలు యడియూరప్పే చూసుకుంటారని వారు అన్నారు. తమకు తెలిసి ఎలాంటి రహస్య సమావేశాలు జరగలేదని చెప్పారు.

కాంగ్రెస్​ ఆశలు..

భాజపాలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్​ కమలం తరహాలో అధికార ఎమ్మెల్యేలకు వల వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్రంలో పార్టీ అప్రమత్తమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

'ఆపరేషన్ హస్తం'

ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, కేపీసీసీ డీకే శివకుమార్​ భాజపా ఎమ్మెల్యేలపై దృష్టి సారించిట్లు తెలుస్తోంది. 'ఆపరేషన్​ కమలం' తరహాలోనే 'ఆపరేషన్​ హస్త' ప్రణాళికల్లో డీకే ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ మేరకు కొంతమంది అధికార ఎమ్మెల్యేల మద్దతు కోరినట్లు చెబుతున్నారు.

ఇదీ చూడండి: యడ్డీపై సీనియర్ల అసమ్మతి.. సీఎం మార్పునకు పట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.