ETV Bharat / bharat

'గల్వాన్​పై చైనా పాట కొత్తేం కాదు- జోరు పెంచింది అంతే'

author img

By

Published : Jul 11, 2020, 6:47 PM IST

గల్వాన్​ లోయపై చైనా వాదనలు కొత్తేం కావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎప్పటినుంచో ఆ భూభాగాన్ని చైనా తమదిగా వాదిస్తోందని... ప్రస్తుతం ఆ ప్రాంతంలో కార్యకలాపాలను మరింత పెంచినట్లు తెలిపారు. సరిహద్దులో యథాతథ స్థితి నెలకొల్పడం దాదాపు అసాధ్యమని తేల్చిచెప్పారు.

Chinese Claims On Galwan Not New- MIT Professor
'గల్వాన్​ లోయపై చైనా వాదన కొత్తేం కాదు'

గల్వాన్​ భూభాగంపై ప్రాదేశిక హక్కులు తమవేనంటూ చైనా చేస్తున్న వాదనలు కొత్తేం కావని ప్రముఖ వ్యూహ నిపుణులు ప్రొఫెసర్ ఎం టేలర్ ఫ్రావెల్ పేర్కొన్నారు. చైనా ప్రభుత్వం నుంచి సేకరించిన భౌగోళిక పటాల ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లు తెలిపారు. తూర్పు వైపు లేదా నది మలుపు వరకు భూభాగం తమదేనని బీజింగ్ వాదిస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుత సైనిక సంక్షోభ సమయంలోనూ ఇదే వాదన ముందుకు తీసుకొచ్చిందని అన్నారు. అయితే గతంతో పోలిస్తే ఈ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు పెరిగినట్లు వెల్లడించారు.

'ఈటీవీ భారత్'​ ముఖాముఖిలో పాల్గొన్న ఆయన వాస్తవాధీన రేఖ వద్ద భారత్​- చైనా ఉద్రిక్తతలపై పలు కీలక విషయాలు వెల్లడించారు. సరిహద్దులో యథాతథ స్థితిని తిరిగి నెలకొల్పడం దాదాపు అసాధ్యమని అభిప్రాయపడ్డారు. యథాతథ స్థితికి రావాలంటే ముందుగా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారనే విషయంపై ఏకాభిప్రాయానికి రావాలన్నారు. ఇది చాలా కష్టతరమైన విషయమని తెలిపారు.

ఈటీవీ భారత్​తో ప్రొఫెసర్ టేలర్ ముఖాముఖి

అమెరికా-రష్యా సాయం చేస్తాయా!

చైనా దూకుడు నేపథ్యంలో అమెరికా సైన్యాన్ని ఆసియా దేశాల్లో మోహరిస్తామన్న ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వ్యాఖ్యలపై స్పందించారు టేలర్. భారత్​కు మద్దతుగా అమెరికా ఏ మేరకు సహాయం చేస్తుందనేది కచ్చితంగా చెప్పలేమన్నారు. ఒకవేళ అమెరికా సాయం భారత్​ కోరుకుంటే.. అగ్రరాజ్యంతో మరింత సన్నిహితంగా మెలగాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

భారత్​, చైనాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి రష్యా సైతం తటస్థ వైఖరి అవలంబించే అవకాశం ఉందన్నారు టేలర్. రెండు అతిపెద్ద దేశాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు రష్యా తటస్థంగానే ఉంటూ వచ్చిందని గుర్తు చేశారు.

వెనక్కి తగ్గింది, కానీ

అమెరికాతో సంబంధాలు మరింత దారుణంగా మారడం వల్ల భారత్​ విషయంలో చైనా కాస్త వెనక్కి తగ్గిందని టేలర్ పేర్కొన్నారు. భారత్​తోనూ సంబంధాలు దిగజారడం ఇష్టం లేక రాజీ పడుతోందని చెప్పారు. అయితే సరిహద్దులో ఉన్న నేపాల్, భూటాన్ వంటి దేశాలను ఉపయోగించుకొని భారత్​ను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత్​ మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఇదీ చదవండి- రొయ్యల ద్వారా కరోనా.. దిగుమతులను నిలిపివేసిన చైనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.