ETV Bharat / bharat

అందాల రాశి.. అరివీర పోరు.. బ్రిటిష్​ తుపాకులకు ఎదురొడ్డి వీరత్యాగం..

author img

By

Published : Aug 8, 2022, 4:59 PM IST

Updated : Nov 28, 2022, 11:49 AM IST

Azadi Ka Amrith Mahotsav The forgotten women of 1857 Azizun Begam
Azadi Ka Amrith Mahotsav The forgotten women of 1857 Azizun Begam

1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో రాజులు, రాణులు, సంస్థానాధీశులు, స్వదేశీ సైనికాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరిలో చాలామంది తమ రాజ్యాలను, సంస్థానాలను కాపాడుకోవాలని, అధికారాన్ని చేజారనివ్వరాదన్న కోరికతో బ్రిటిష్‌ పాలకుల మీద తిరుగుబాటు చేశారు. ఈ రకమైన కాంక్షలేవీ లేకుండా కేవలం మాతృభూమి మీద గల ప్రేమాభిమానాలతో, నిస్వార్థంగా తిరుగుబాటులో పాల్గొని ప్రాణాలను బలిచ్చిన సామాన్యులూ ఉన్నారు. అటువంటి సాధారణ మహిళలలో ఒకరు బేగం అజీజున్‌!

బ్రిటిష్‌ తుపాకులకు ఎదురొడ్డి నిలచిన వీర వనిత బేగం అజీజున్‌. మహిళా సైనిక దళాన్ని స్థాపించిన ప్రప్రథమ మహిళ కూడా. ఆంగ్లేయుల తుపాకీ గుళ్లు తన శరీరాన్ని ఛేదించుకుని పోతుంటే.. నానా సాహెబ్‌ జిందాబాద్‌ అంటూ నినదించిన ధీశాలి ఆమె.
1832లో బితూర్​లో (ఇప్పటి ఉత్తరప్రదేశ్‌) పుట్టిన బేగం అజీజున్‌ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. రూపసి, అందాలరాశి అయిన అజీజున్‌ ఆనాటి ప్రసిద్ధ నర్తకి ఉమ్రావ్‌జాన్‌ బృందంలో చేరారు. మంచి నర్తకిగా ఖ్యాతిగాంచారు. బ్రిటిష్‌ సైన్యంలో సుబేదారుగా పనిచేస్తున్న షంషుద్దీన్‌ ఆమెను ప్రేమించాడు. కానీ ఆంగ్లేయులంటే ఆమెకు విపరీతమైన ద్వేషం. బ్రిటిష్‌ సైన్యం నుంచి తొలిగి.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నానా సాహెబ్‌ వెంట నడిచే వరకు అతని ప్రేమను అజీజున్‌ అంగీకరించలేదు. ఆమె హృదయం షంషుద్దీన్‌ కోసం ఎంతగా తపించేదో, భారత స్వాతంత్య్రం కోసం కూడా అంతగానే తపించేది. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన నానా సాహెబ్‌ పీష్వా అంటే అజీజున్‌కు అమిత భక్తిగౌరవాలు. పరదేశీయులు సాగిస్తున్న అధర్మాన్ని, అన్యాయాన్ని ఎదుర్కోవాలని ఆమె ప్రగాఢంగా వాంఛించారు.

1857 జూన్‌లో కాన్పురులో తిరుగుబాటు ఆరంభమైంది. నానాసాహెబ్‌ బ్రిటిషర్ల మీద సమర శంఖం పూరించారు. మతాలకు అతీతంగా.. ధర్మాన్ని, దేశాన్ని రక్షించుకునేందుకు కాన్పురు ప్రజలంతా ఆయుధాలు చేపట్టాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. వెంటనే సుకుమారి అజీజున్‌ సుఖమయ జీవితాన్ని వదిలేసి.. యుద్ధం చేసేందుకు నానాసాహెబ్‌ పక్షంలో చేరారు. సహచరుడు షంషుద్దీన్‌ సహకారంతో అజీజున్‌ అప్పటికే ఆయుధాలు ఉపయోగించటంతోపాటు గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. సైనిక దుస్తులు ధరించి రణరంగానికి సిద్ధమయ్యారు. మాతృదేశ భక్తి భావనలున్న యువతులను సమీకరించి, ప్రత్యేక మహిళా సైనిక దళం ఏర్పాటు చేశారు. అజీజున్‌ స్వయంగా నగరంలోని ఇల్లిల్లూ తిరిగారు. యువకులను తట్టిలేపారు. 'మీలో రక్తం చల్లబడిపోయిందా? పౌరుషం చచ్చిపోయిందా? మన మోచేతి నీళ్ళు తాగే కుక్కలు మనపై పెత్తనం చలాయిస్తుంటే.. మన వీరత్వం, శౌర్య పరాక్రమాలు ఏమైపోయాయి?' అంటూ యువకుల్లో రోషాగ్నిని ప్రజ్వరిల్లజేశారు. తిరుగుబాటులో భాగంగా ఆంగ్లేయులపై జరిగిన దాడుల్లో ఆమె ప్రమేయం అధికంగా ఉందంటారు. నానాసాహెబ్‌ సేనలు కాన్పుర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా.. అజీజున్‌ మహిళా సైనిక బలగాలతో కాన్పురు పురవీధుల్లో కవాతు చేసి ప్రజలను ఉత్సాహపరిచేవారు. బజార్లలో ప్రజలు బారులు తీరి నిలబడి ఆమె రాకకోసం ఎదురు చూసేవారు. నానా సాహెబ్‌ జిందాబాద్‌ .. బేగం అజీజున్‌ జిందాబాద్‌... అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసేవారు.

జాబితాలో ఆమె పేరే మొదలు..
కొద్దినెలల్లోనే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఆంగ్లేయ సైన్యం అణచివేసింది. తిరుగుబాటులో పాల్గొన్న రాజులు, సంస్థానాధీశులు, సైనికాధికారులు, ప్రజల మీద భయంకరంగా విరుచుకుపడింది. ఆ సమయంలో ఆంగ్లేయాధికారి కర్నల్‌ విలియమ్‌ తయారు చేసిన కాన్పురు తిరుగుబాటుదారుల జాబితాలో అజీజున్‌దే మొదటి పేరు! విచారణలో భాగంగా అమెను ఆంగ్లేయ ఉన్నత సైనికాధికారి జనరల్‌ హవలాక్‌ ఎదుట హాజరు పర్చారు. ఆమె రూపురేఖలు, అందం చూసి హవలాక్‌ ఆశ్చర్యపోయాడు. ఇంత అందగత్తె యుద్ధ రంగంలో నిలిచిందంటే నమ్మలేక పోయాడు. తన అపరాధాన్ని అంగీకరించి క్షమాపణ వేడుకుంటే ఆరోపణలన్నీ రద్దు చేస్తానని, క్షమించి వదిలేస్తానని హామీ ఇచ్చాడు. కానీ అందుకు బేగం అజీజున్‌ ససేమిరా అన్నారు. ప్రాణ భయం లేని ఆమె ప్రవర్తన చూసి విస్తుపోయిన ఆ సైనికాధికారి.. మరి నీకేం కావాలి? అని ప్రశ్నించాడు. ''నాకు బ్రిటిష్‌ పాలన అంతం చూడాలనుంది'' అంటూ ఆమె నిర్భయంగా సమాధానమిచ్చారు. ఆగ్రహించిన జనరల్‌ హవలాక్‌... ఆమెను కాల్చివేయాల్సిందిగా సైనికుల్ని ఆదేశించాడు. బ్రిటిష్‌ సైనికుల తుపాకులు ఒక్కసారిగా గర్జించాయి. ఆ తుపాకీ గుళ్లు తన సుకుమార శరీరాన్ని ఛేదించుకుని దూసుకుపోతుంటే.. నానా సాహెబ్‌ జిందాబాద్‌.. అంటూ ఆ అసమాన పోరాట యోధురాలు నేలకొరిగారు.

ఇవీ చూడండి: జెండా మోసి దేశభక్తిని చాటిన వీరనారి.. జైల్లోనే ప్రసవం

తెల్లవారిని తెల్లబోయేలా చేసిన 'పైకాలు'.. 1817లోనే సైనిక తిరుగుబాటు!

Last Updated :Nov 28, 2022, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.