ETV Bharat / bharat

ఆ ఔషధాలు కనిపెట్టి.. మనిషి ఆయువు పెంచిన ఎల్లాప్రగడ

author img

By

Published : Aug 12, 2022, 2:01 PM IST

yellapragada subbarao
ఆ ఔషధాలు కనిపెట్టి.. మనిషి ఆయువు పెంచిన యల్లాప్రగడ

చర్మ, కంటి, జననేంద్రియాలు, ఉదర, మూత్రకోశ వ్యాధులు.. నిమోనియా వంటి ఎన్నో జబ్బులను మానవాళి సమర్థంగా తట్టుకుంటోందంటే.. మనిషి ఆయుః ప్రమాణం పెరిగిందంటే.. కేవలం ఒక్క మహానుభావుడి పుణ్యమే! ఆయనే ఎల్లాప్రగడ సుబ్బారావు. అలాంటి గొప్ప వ్యక్తిని కూడా.. ఖద్దరు కట్టాడని కక్షగట్టి.. వైద్య పట్టా ఇవ్వకుండా వేధించింది భారత్‌ను ఏలిన బ్రిటిష్‌ సర్కారు!

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 1895 జనవరి 12న జన్మించారు ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆయనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు. సోదరులిద్దరికీ అనారోగ్యమే. ఇబ్బందుల కారణంగా రెండుసార్లు మెట్రిక్యులేషన్‌ తప్పారు. అన్నయ్య పురుషోత్తం వద్ద ఉండి రాజమండ్రిలో చదువుకునే సమయంలో.. సుబ్బారావును జాతీయోద్యమం ఆకర్షించింది. తల్లి వెంకమ్మ నగలు అమ్మగా వచ్చిన సొమ్ము, స్నేహితుల సాయంతో.. మద్రాసు వెళ్లి హిందూ హైస్కూల్‌లో చదివిన సుబ్బారావు.. మూడో దఫాలో మెట్రిక్యులేషన్‌ పాసయ్యారు. ఇంటర్‌ గణితంలో డిస్టింక్షన్‌ సాధించారు. ఆ సబ్జెక్ట్‌లోనే ఆనర్స్‌ చేయాలని అంతా ఒత్తిడి తెచ్చారు. సుబ్బారావు మాత్రం రామకృష్ణ మఠంలో సన్యాసిగా మారాలనుకున్నారు. తల్లి, మఠం నిర్వాహకులు నచ్చజెప్పి ఆయనను వైద్య విద్య వైపు మళ్లించారు. అలా మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో చేరారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆగిపోయే పరిస్థితి తలెత్తడంతో అప్పు కోసం ప్రయత్నించారు. ఈ దశలో 'నిన్ను మేమే చదివిస్తాం. మా అమ్మాయిని పెళ్లి చేసుకో' అని కస్తూరి సూర్యనారాయణ కోరగా.. ఆయన కుమార్తె శేషగిరిని పెళ్లి చేసుకున్నారు.

అది సహాయ నిరాకరణ ఉద్యమం సాగుతున్న వేళ! గాంధీజీ పిలుపుతో విదేశీ వస్త్ర బహిష్కరణలో పాల్గొన్నారు సుబ్బారావు. ఇందులో భాగంగా ఖద్దరుకు కట్టుబడ్డారు. ఖద్దరుతో తయారైన సర్జికల్‌ ఏప్రాన్‌ ధరించి సుబ్బారావు మెడికల్‌ కాలేజీకి వెళ్లారు. అక్కడి సర్జరీ విభాగం ఆచార్యుడు ఎం.సి.బ్రాడ్‌ఫీల్డ్‌కు ఇది ఆగ్రహం కల్గించింది. 'గాంధీ వైస్రాయ్‌ అయ్యాక దీన్ని ధరించు' అంటూ ఎద్దేవా చేశాడు. సుబ్బారావు వెంటనే ఏమాత్రం జంకకుండా.. 'వైస్రాయ్‌ స్థాయికి గాంధీజీ ఎన్నడూ దిగజారడు' అని ఘాటుగా బదులిచ్చారు. దీంతో బ్రాడ్‌ఫీల్డ్‌.. సుబ్బారావుపై కక్షగట్టాడు. ఆయనకు డాక్టర్‌ పట్టా ఇవ్వకుండా అంతకన్నా తక్కువదైన ఎల్‌ఎంఎస్‌ సర్టిఫికెట్‌తో సరిపుచ్చారు. బ్రాడ్‌ఫీల్డ్‌ పుణ్యామా అని వైద్య వృత్తి పట్టా దక్కని సుబ్బారావు ఆయుర్వేదంపై దృష్టిసారించారు. దీనికి కారణం లేకపోలేదు. అంతకుముందు 'ఉష్ణమండల స్ప్రూ' వ్యాధి బారినపడ్డ తనను లక్ష్మీపతి అనే ఆయుర్వేద వైద్యుడు కాపాడారు. దీంతో మద్రాస్‌లో ఆ డాక్టర్‌కు చెందిన ఆయుర్వేద కళాశాలలో అనాటమీ లెక్చరర్‌గా చేరి ఆ రంగంలో పరిశోధనలూ సాగించారు. భారత్‌కు వచ్చిన అమెరికన్‌ వైద్యుడు జాన్‌ ఫాక్స్‌ కెండ్రిక్స్‌... సుబ్బారావులోని మేధస్సును గుర్తించారు. విదేశాలకు వెళ్లి పరిశోధనలు చేయాలని సూచించారు. అప్పట్లో పరిశోధనల కోసం ఎక్కువగా ఇంగ్లండ్‌కు వెళ్లేవారు. కానీ బ్రిటన్‌ అంటే విముఖతతో ఎల్లాప్రగడ అమెరికాలోని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌లో అడ్మిషన్‌కు దరఖాస్తు చేశారు. మెడిసిన్‌ డిప్లొమా కోర్సులో కెమిస్టుగా ప్రవేశం లభించింది. 1923 అక్టోబరులో సుబ్బారావు అమెరికాలో కాలుమోపారు. హార్వర్డ్‌లోనే పరిశోధనలపై దృష్టిసారించారు. పీహెచ్‌డీ సాధించారు. ఔషధ రంగంలో అద్భుత ఆవిష్కరణలు చేశారు.

  • రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఆయన చేసిన పరిశోధన తొలి టెట్రాసైక్లిన్‌ యాంటీ బయాటిక్‌- అరియోమైసిన్‌ ఆవిష్కారానికి దారితీసింది. ఫైలేరియా గురించి పరిశోధన చేసి, హెట్రజన్‌ ఔషధాన్ని సుబ్బారావు కనిపెట్టారు.
  • క్షయ కట్టడికి ఐసోనికోటినిక్‌ ఆసిడ్‌ హైడ్రాజైడ్‌ను రూపొందించారు. క్యాన్సర్‌కు వాడే కీమోథెరపీ ఔషధాల్లో తొలితరం డ్రగ్‌ మెథోట్రెస్సేట్‌ను సిడ్నీ ఫార్బర్‌ అనే శాస్త్రవేత్తతో కలిసి అభివృద్ధి చేశారు.

ఇన్ని అద్భుత ఆవిష్కరణలు చేసినప్పటికీ డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావుకు నోబెల్‌ బహుమతి దక్కలేదు. ఆయన కనిపెట్టిన అంశాలపై ముందుకెళ్లి పరిశోధనలు చేసిన శిష్యులకు ఆ పురస్కారాలు లభించడం గమనార్హం. 1948 ఆగస్టు 9న 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఎల్లాప్రగడ సుబ్బారావు అమెరికాలోనే కన్నుమూశారు.

అమెరికా రచయిత డోరోన్‌ ఆంట్రిమ్‌ మాటల్లో చెప్పాలంటే.. "బహుశా ఈ తరంలో చాలామంది ఎన్నడూ డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు విని ఉండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆయన జీవించి ఉండటం వల్లే నేడు మనమంతా ఆరోగ్యంగా, సజీవంగా ఉంటున్నాం. ఆయన కృషే మానవాళి దీర్ఘాయుష్షుకు బాటలు పరిచింది".

ఇవీ చదవండి: తెలుగు చరిత్రను వెలుగులోకి తెచ్చిన ఆంగ్లేయుడు.. మెకంజీ

'నాకు జీతం ఇస్తోంది నీకు సెల్యూట్‌ చేయడానికి కాదు'.. ఆంగ్లేయులకు లొంగని కొత్వాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.