ETV Bharat / bharat

తెలుగు చరిత్రను వెలుగులోకి తెచ్చిన ఆంగ్లేయుడు.. మెకంజీ

author img

By

Published : Jul 16, 2022, 6:53 AM IST

Updated : Jul 16, 2022, 8:05 AM IST

ఆంగ్లేయుల పాలనలో మన సంపదను కొల్లగొట్టినవారితో పాటు.. మనకు మేలు చేసిన వారూ ఉన్నారు. అలాంటి కొద్దిమందిలో ఒకరు కర్నల్‌ కొలిన్‌ మెకంజీ! కనుమరుగైన మన చారిత్రక సంపదను ముఖ్యంగా.. తెలుగు చరిత్రను వెలుగులోకి తేవడానికి పరితపించి.. మరుగున పడ్డ దేశ సాంస్కృతిక వారసత్వానికి జవసత్వాలు కల్పించారాయన.

కొలిన్‌ మెకంజీ
Colin Mackenzie

స్కాట్లాండ్‌లో 1754లో జన్మించిన కర్నల్‌ కొలిన్‌ మెకంజీ 1782లో మద్రాసులో ఈస్టిండియా కంపెనీ ఇంజినీరింగ్‌ శాఖలో ఉద్యోగిగా చేరారు. 1784-90 మధ్య రాయలసీమ ప్రాంతంలో పర్యటించి నెల్లూరు నుంచి తూర్పు కనుమల ద్వారా రాయలసీమ ప్రాంతానికి రహదారి నమూనాలతో మొట్టమొదటిసారిగా నైసర్గిక పటాలు తయారు చేశారు. 1790లో గుంటూరు సీమ సర్వే అధికారిగా నియమితులయ్యాక.. వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ భారతదేశ గ్రామాలు, ఆలయాల చరిత్ర, వాటి మాన్యాలపై అవగాహన పెంచుకున్నారు. ఆ సమయంలోనే ఏలూరుకు చెందిన కావలి వెంకటనారాయణప్ప, వెంకటబొర్రయ్య, వెంకటరామస్వామి, వెంకటలక్ష్మయ్య, వెంకటసీతయ్య సోదరులతో పరిచయం ఏర్పడింది. వారిలో వెంకట బొర్రయ్య, వెంకట లక్ష్మయ్యల సహకారంతో మెకంజీ తెలుగు నేలతోపాటు దక్షిణ భారతదేశం నుంచి ఎన్నో చారిత్రక ఆధారాలు, తాళపత్రాలు, శాసనాలు, పురాతన శిల్పాలు సేకరించారు.

ఈ క్రమంలోనే శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న మొట్టమొదటి విదేశీ వ్యక్తి మెకంజీ అని చరిత్రకారులు పేర్కొంటారు. అప్పట్లో ఆలయంలోకి విదేశీయులు ప్రవేశించడానికి అనుమతి ఉండేది కాదు. దీంతో కావలి బొర్రయ్య.. మల్లికార్జునస్వామి ప్రతిమ కనపడేలా ఆలయం వెలుపల రెండు అద్దాలు ఏర్పాటు చేశారు. అలా ఆలయం బయటి నుంచే ఆ అద్దాల ద్వారా మెకంజీ.. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. అరుదైన పాలరాతి ఫలకలను కాపాడటానికి అప్పటి అమరావతి జమీందారు వెంకటాద్రినాయుడిని ఒప్పించారు. వాటిపై ఉన్న శిల్పకళ ఆధారంగా మహాచైతన్య రూపాన్ని చిత్రించారు. అప్పటి దీపాలదిన్నెను తవ్వించి.. బౌద్ధ మహాస్తూపాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజేశారు. ఆ విధంగా 1797లో మెకంజీ కృషివల్లే ఇప్పుడు మనం అమరావతి బౌద్ధ స్తూప ఆకారాన్ని చూడగలుగుతున్నాం.

దక్షిణ భారత చారిత్రక ప్రాధాన్యాన్ని తెలియజేసే హంపి విజయనగర శిథిలాలను మొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చిందీ మెకంజీయే. 1799లో సర్వే పని మీద వెళ్లినప్పుడు అక్కడ రాళ్లతో చెక్కించిన, నిర్మించిన ఓ అద్భుత నగరం ఉందని గుర్తించి.. దాని చరిత్రను చాటి చెప్పారు. అనంతరం 1810లో మద్రాసు ప్రాంత సర్వేయర్‌ జనరల్‌గా, 1816లో భారతదేశ మొట్టమొదటి సర్వేయర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ఆయన దాదాపు 1,560 తాళపత్ర గ్రంథాలు, రాతప్రతులు, 2,070 స్థానిక చరిత్రలు, 8,076 శాసన పాఠాలు, 79 దేశపటాలు, 2,630 బొమ్మలు/డ్రాయింగులు, 6,218 నాణేలు, 106 శిల్పచిత్రాలు, 40 పురాతన వస్తువులు సేకరించారు. వీటిలో తెలుగుకు సంబంధించి 285 కావ్యాలు, 358 సీడెడ్‌ జిల్లాల చరిత్ర, 274 ఇతర గ్రామాల చరిత్ర ఉన్నట్లు చరిత్రకారుల అంచనా. మెకంజీ స్థానంలో వచ్చిన హెచ్‌.హెచ్‌.విల్సన్‌ వాటన్నింటి వివరాలతో "ది మెకంజీ కలెక్షన్‌- ఎ డిస్క్రిప్టివ్‌ కేటలాగ్‌ ఆఫ్‌ ద ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్ట్‌, అండ్‌ అదర్‌ ఆర్టికల్స్‌" పేరిట 1828లో పుస్తకాన్ని వెలువరించారు. మెకంజీ సేకరించిన వాటిని ఆయన మరణానంతరం అప్పటి బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ వారన్‌ హేస్టింగ్స్‌ 10 వేల డాలర్లకు కొన్నారు. ఆ తర్వాతి కాలంలో.. మరో మహనీయుడు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ ఎన్నో తెలుగు గ్రంథాలను అందించటానికి మెకంజీనే ప్రధాన ఆధారం! మెకంజీ సేకరించిన స్థానిక చారిత్రక ఆధారాల్లో చాలావాటికి శుద్ధ ప్రతులు రాయించి వాటిని గ్రంథాల రూపంలో మనకందించారు బ్రౌన్‌! నేటికీ దేశ చరిత్ర పరిశోధనలో మెకంజీ ప్రతులే కీలకమవుతున్నాయి. ఆయన మాదిరిగా మన చరిత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించిన వారు మరొకరు లేరనే చెప్పొచ్చు. బ్రిటిష్‌ ఉద్యోగిగా భారతదేశ చారిత్రక విశేషాలు, సాంస్కృతిక వారసత్వాలు, సాహిత్యపరమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చిన మెకంజీ 1821లో కలకత్తాలో కన్నుమూశారు.

కావలి సోదరుల అపూర్వ సహకారం: కావలి సోదరుల గురించి ప్రస్తావించకుండా మెకంజీ పరిశోధన ప్రస్థానాన్ని ముగించలేం. చారిత్రక ఆధారాలు, తాళపత్ర గ్రంథాలు, శాసనాలు తదితరాల సేకరణలో కావలి బొర్రయ్య, లక్ష్మయ్యలు మెకంజీకి వెన్నుదన్నుగా నిలిచారు. బొర్రయ్యకు తెలుగుతోపాటు కన్నడం, తమిళం, సంస్కృతం, మలయాళ భాషల్లో ప్రావీణ్యముంది. దీంతో బొర్రయ్యను ఉద్యోగిగా చేర్చుకున్న మెకంజీ.. వివిధ భాషల్లో ఉన్న శాసనాల గురించి ఆయన ద్వారా తెలుసుకుంటూ వాటి చరిత్ర రాయించారు. బొర్రయ్యను ఎంతగానో ఆదరించిన మెకంజీ.. తన ఆస్తిలోని కొంత భాగాన్ని కూడా ఆయనకు రాసిచ్చారు. బొర్రయ్య 27 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో చనిపోయారు. దీంతో మెకంజీ ఆయన స్థానంలో బొర్రయ్య సోదరుడు లక్ష్మయ్యను నియమించుకుని పరిశోధన సాగించారు.

ఇవీ చదవండి: 'నాకు జీతం ఇస్తోంది నీకు సెల్యూట్‌ చేయడానికి కాదు'.. ఆంగ్లేయులకు లొంగని కొత్వాల్

స్విట్జర్లాండ్ మహిళ.. భారత స్వాతంత్ర్యోద్యమంలో వీర వనిత!

Last Updated : Jul 16, 2022, 8:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.