ETV Bharat / bharat

నేతాజీకోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వీరుడు

author img

By

Published : May 16, 2022, 5:09 AM IST

Azadi Ka Amrit Mahotsav: ఆయన రక్తం ఇవ్వమని అడిగారు. ప్రతిగా స్వాతంత్య్రం ఇస్తామన్నారు. ఇంకేం ఇనుప కండలు... ఉక్కు నరాలు కలిగిన వేల మంది యువకులు పొలోమంటూ ఆయన్ని చేరుకున్నారు. వారితో ఒక సైన్యమే తయారైంది. తన మాతృభూమిని ఆంగ్లేయ సంకెళ్ల నుంచి విముక్తం చేస్తానన్న యుగపురుషుడిని ఆ సైన్యంలోని ఒక సైనికుడు అమితంగా ఆరాధించాడు. ఆయన చుట్టూ ఒక కోటలా నిలిచాడు. ఒకరోజు తన శరీరాన్నే గోడలా మలచుకుని తన ఆరాధ్య దైవాన్ని తుపాకీ తూటాల నుంచి రక్షించాడు. ఆ యువకుడు నిజాముద్దీన్‌. అతను కాపాడిన మహామనిషి నేతాజీ.

subhash chandra bose
subhash chandra bose

Azadi Ka Amrit Mahotsav: ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌ జిల్లాలోని ధక్వా గ్రామంలో 1901లో సైఫుద్దీన్‌ జన్మించారు. తండ్రి బర్మాలోని రంగూన్‌లో ఓ హోటల్‌ నడిపేవారు. ఆయన తన తల్లి సంరక్షణలో స్వగ్రామంలోనే పెరిగారు. సైన్యంలో చేరతానంటే తల్లి వారించడం వల్ల 20 ఏళ్ల వయసు దాటాక సైఫుద్దీన్‌ ఇంటి నుంచి పారిపోయారు. ఓడలో కోల్‌కతా మీదుగా రంగూన్‌ చేరుకున్నారు. అక్కడ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటిష్‌ ఇండియా ఆర్మీలో చేరారు. అప్పట్లో పర్వత ప్రాంతాల్లోని సైన్యానికి సరకులు సరఫరా చేయడానికి గాడిదలను వాడేవారు. భారతీయ సిపాయిలు ఉన్న ప్రాంతాలకంటే బ్రిటిష్‌ సైనికులు ఉండే ప్రాంతాలకు సరకులను ఠంచనుగా తీసుకెళ్లేవారు. ఈ నేపథ్యంలో ఒకరోజు ఆంగ్లేయ సైనికాధికారి తన తెల్ల సైనికులకు 'అవసరమైతే భారతీయ సిపాయిలు చనిపోయినా పర్వాలేదు. గాడిదలు మాత్రం చావడానికి వీల్లేదు' అని చెబుతుండటం విన్నారు. అత్యంత అవమానకరమైన ఈ మాటలను విన్న తర్వాత ఆగ్రహోదగ్రుడైన సైఫుద్దీన్‌... సైనికాధికారిని అక్కడికక్కడే తుపాకీతో కాల్చి చంపేశారు. సైన్యానికి దొరకకుండా తప్పించుకుని సింగపూర్‌ వెళ్లిపోయారు.

పేరు మార్చుకుని...: ఆంగ్లేయ గూఢచారులకు దొరక్కుండా... సింగపూర్‌లో నిజాముద్దీన్‌గా పేరు మార్చుకున్న సైఫుద్దీన్‌ 1943లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ సమక్షంలో ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఐఎన్‌ఏ-ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌)లో చేరారు. భారీ తుపాకులను ఉపయోగించడంలో నైపుణ్యం ప్రదర్శించే నిజాముద్దీన్‌ అతి త్వరలోనే... నేతాజీ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరిగా మారారు. సుభాష్‌ బోస్‌కు అప్పట్లో మలేసియా రాజు బహూకరించిన కారుకు డ్రైవర్‌గా పనిచేశారు. బ్రిటిష్‌ సైన్యానికి వ్యతిరేకంగా బర్మాలో 1943లో జరిగిన యుద్ధంలో నేతాజీతో కలిసి పాల్గొన్నారు. ఒకరోజు అడవిలో నేతాజీని లక్ష్యంగా చేసుకుని, తుప్పల్లో నుంచి గురిపెట్టిన ఒక తుపాకీ గొట్టాన్ని గమనించిన నిజాముద్దీన్‌ దానికి ఎదురుగా వెళ్లారు. వెన్వెంటనే మూడు గుళ్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లాయి. యుద్ధభూమిలో కుప్పకూలిన నిజాముద్దీన్‌కు కెప్టెన్‌ లక్ష్మీసెహగల్‌ వైద్యం చేసి, బుల్లెట్లను తొలగించారు. ఆయనకు స్పృహ వచ్చే వరకు నేతాజీ అక్కడే ఉన్నారు. అనితరసాధ్యమైన త్యాగ నిరతికి చలించిపోయిన నేతాజీ ఆయనకు 'కర్నల్‌' హోదా ఇచ్చారు. తనకు అత్యంత ఆప్తుడిగా భావించారు. నాటి నుంచి నాలుగేళ్లపాటు నేతాజీని నిజాముద్దీన్‌ అంటిపెట్టుకుని ఉన్నారు. జపాన్‌, వియత్నాం, థాయ్‌లాండ్‌, కాంబోడియా, మలేసియా, సింగపూర్‌లాంటి ఏ దేశానికి వెళ్లినా డ్రైవర్‌గా, అంగరక్షకుడిగా వ్యవహరించారు. 1945 ఆగస్టులో రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఓడిపోయి, మిత్రదేశాలకు లొంగిపోయాక నేతాజీ ఐఎన్‌ఏను రద్దు చేశారు. బర్మాలో పట్టుబడిన పది వేల మంది ఐఎన్‌ఏ సైనికులను బ్రిటిష్‌ సైన్యం బందీలుగా దిల్లీకి తీసుకెళ్లింది. మిగిలిన సైనికులు తమ సొంతిళ్లకు వెనుదిరిగారు. నిజాముద్దీన్‌ సైతం రంగూన్‌లో అజ్బన్‌ అనే యువతిని వివాహమాడారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు జన్మించారు.

ఇంటి పేరు హింద్‌ భవన్‌: ఐఎన్‌ఏ రద్దయినా... నిజాముద్దీన్‌ మాత్రం అక్కడి క్రమశిక్షణను, దేశభక్తిని జీవితాంతం కొనసాగించారు. రంగూన్‌ నుంచి తన కుటుంబంతో 1969లో భారత్‌లోని సొంతూరు ధక్వా గ్రామానికి తిరిగి వచ్చారు. తమ ఇంటికి 'హింద్‌ భవన్‌' అని నామకరణం చేసుకున్నారు. ఇంటిపై మూడు రంగుల జెండాను ఎగురవేశారు. అది ఎల్లప్పుడూ ఎగురుతూనే ఉండేది. ఎదురొచ్చిన ప్రతి ఒక్కరినీ 'జైహింద్‌' అనే పలకరించేవారు. నిజాముద్దీన్‌ తన 117వ ఏట 2017లో కన్నుమూశారు.

అప్పుడు ఆయన వెంటే ఉన్నాను...: సింగపూర్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ అకాల మరణం పొందారనే వార్తతో నిజాముద్దీన్‌ ఏనాడూ ఏకీభవించలేదు. అప్పుడు తాను నేతాజీతోనే ఉన్నానని, మూణ్నాలుగు నెలల అనంతరం బర్మా-థాయిలాండ్‌ సరిహద్దుకు ఆయన్ని స్వయంగా తీసుకెళ్లి వదిలి వచ్చానని చెప్పేవారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అమూల్య క్షణాలను నేతాజీ ఆస్వాదించారని తెలిపేవారు.

ఇదీ చదవండి: బ్రిటిష్​ సర్కారును ముప్పుతిప్పలు పెట్టిన ధీశాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.