పంజాబ్​ను ఏకతాటిపైకి తెచ్చిన సద్గురు.. సొంత కోర్టులు, పోస్టాఫీసులు తెరిచి..

author img

By

Published : Jul 13, 2022, 7:28 AM IST

పంజాబ్​
పంజాబ్​ ()

స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీజీ నడిపిన విదేశీ వస్త్రాలు, వస్తువుల బహిష్కరణ ఉద్యమం బ్రిటిష్‌ వారిని వణికించింది. ప్రజలను ఏకం చేసింది. అంతకు చాలాముందే.. అంటే 1850లలోనే ఓ సిక్కు ఆధ్యాత్మిక గురువు ఒకవైపు సామాజిక సంస్కరణలకు పాటుపడుతూనే.. మరోవైపు తెల్లదొరలను పారదోలేందుకు స్వదేశీ ఉద్యమాన్ని నడిపారు. పంజాబ్‌ను ఏకతాటిపైకి తెచ్చి ఈస్టిండియా కంపెనీని అల్లాడించారు. సొంత కోర్టులను, పోస్టాఫీసులను తెరిచారు. ఆయనే సద్గురు రాంసింగ్‌ కుకా!

పంజాబ్‌ రాష్ట్రం లూథియానాలోని భైని గ్రామంలో 1816 వైశాఖ పూర్ణిమ రోజున జస్సాసింగ్‌, సదన్‌కౌర్‌ దంపతులకు రాంసింగ్‌ జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు చిన్నప్పటి నుంచే వీర యోధుల కథలను వినిపిస్తుండేవారు. రాంసింగ్‌ 22 ఏళ్ల వయసులో లాహోర్‌లో మహారాజా రంజిత్‌సింగ్‌ సైన్యంలో చేరారు. అప్పట్లో పురుషులు విచ్చలవిడిగా మద్యం తాగేవారు. ఇష్టం వచ్చినన్ని పెళ్లిళ్లు చేసుకునేవారు. మహిళల విక్రయాలు, శిశువుల హత్యలు సాధారణ విషయాలుగా ఉండేవి. బురదలో కమలంలా రాంసింగ్‌ మాత్రం నిష్ఠగా జీవించేవారు. ప్రతిరోజూ ప్రార్థన చేస్తూ మనసును పరిశుద్ధంగా ఉంచుకునేవారు. దాంతో అందరూ ఆయన్ని పెద్దన్నగా, ఆయన ఉండే సైనిక ప్లటూన్‌ను ‘రుషి దళం’గా పిలిచేవారు. మహారాజా రంజిత్‌సింగ్‌ 1839లో మృతి చెందాక... రాంసింగ్‌ సొంతూరుకు వచ్చేసి, వ్యవసాయంలోకి దిగిపోయారు.

సంస్కరణలకు ప్రాధాన్యం
రాంసింగ్‌ దైవభక్తికి, గోసంరక్షణకు ప్రాధాన్యమిచ్చారు. నిత్యాన్నదానంతోపాటు ఆపన్నులను ఆదుకుంటుండటంతో ఆయనకు అనుచరులు భారీగా పెరిగారు. వారిది కుకా/నాందారీ వర్గంగా పేరొందింది. తాగుబోతులకు, అబద్ధాలకోరులకు, దొంగలకు ఈ వర్గంలో చోటుండేదికాదు. ఆడపిల్లల విక్రయాలు, బాల్యవివాహాలు, అర్థరహిత ఆచారాలను బహిష్కరించారు. 1863లోనే సామూహిక, కులాంతర, వితంతు వివాహాలను జరిపించారు. క్రమంగా రాంసింగ్‌... సద్గురు రాంసింగ్‌గా మారారు.

దారిచూపిన గురు రాందాస్‌
సిక్కు ఆధ్యాత్మిక గురువు రాందాస్‌ బోధనలతో సద్గురు రాంసింగ్‌ రాజకీ యంగానూ పనిచేయడం ప్రారంభించారు. తెల్లవారి అధికారాన్ని ప్రశ్నించారు. విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇవ్వడంతో ప్రజలు స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యమిచ్చారు. రైళ్ల వాడకం బాగా తగ్గించారు. బ్రిటిషర్ల కోర్టులకూ వెళ్లడం మానేశారు. తగాదాలను కుకాలే పరిష్కరించేవారు. స్వదేశీ పోస్టాఫీసులను ప్రారంభించారు. 1871 వచ్చేసరికి కుకావర్గం సభ్యులు 4.3 లక్షలకు చేరారు. మొత్తం వ్యవస్థను నడిపించడానికి రాంసింగ్‌ 22 మంది సుబాలను నియమించారు. అవసరమైనప్పుడు తమకు సహకరించాలని కోరుతూ కశ్మీర్‌, నేపాల్‌తోపాటు ఏకంగా రష్యాకూ దూతలను పంపించారు.

భయపడి.. కుట్రకు తెరలేపి..
కుకాల ప్రాబల్యం పెరిగి, తమ రాబడి దారుణంగా పడిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన బ్రిటిషర్లు... కుట్రకు తెరలేపారు. తొలుత హిందువుల మనోభావాలు దెబ్బతినేలా గురుద్వారాలు, ఆలయాల సమీపంలో గొడ్డు మాంసం విక్రయాలను ప్రోత్సహించారు. తర్వాత పండగల సమయంలోనూ మాంసం దుకాణాలను తెరిచేలా చూశారు. దాంతో అమృత్‌సర్‌లో 1871 జూన్‌ 15న కొందరు కుకాలు మాంసం దుకాణదారులపై దాడిచేసి, నలుగురిని చంపేశారు. వెంటనే పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేశారు. రాంసింగ్‌ ఆదేశంతో అసలైన నిందితులు లొంగిపోగా నలుగురిని ఉరితీశారు.

అసమాన త్యాగధనులు
మాఘయాత్రలో భాగంగా కొందరు కుకాలు సద్గురు పుట్టినూరు వస్తుండగా బ్రిటిషర్లు దాడిచేసి, దారుణంగా హింసించారు. ఇది తట్టుకోలేని హీరాసింగ్‌ అనే అనుచరుడు.. 140 మంది అనుచరులతో కోట్లాలోని బ్రిటిష్‌ స్థావరంపై 1872 జనవరి 15న దాడికి దిగారు. అక్కడ పోలీసుల కాల్పుల్లో 72 మంది అమరులయ్యారు. మిగిలిన 68 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత గ్రామంలో కలెక్టర్‌ కొవాన్‌ దంపతుల సమక్షంలో 50 మంది కుకా యోధులకు బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని, ఫిరంగి గొట్టానికి వీపు ఆనించి నిల్చోవాలని వారికి కలెక్టర్‌ సూచించగా.. గంతలు వద్దని, చావడానికి భయపడటం లేదంటూ గొట్టానికే ఛాతిని ఆనిస్తామన్నారు. సైనికులు ఫిరంగి పేలుస్తుంటే.. 'సద్గురు రాంసింగ్‌ జిందాబాద్‌' అని నినదిస్తూ ఒకరి తర్వాత ఒకరు 50 మంది తమ ప్రాణాలను అర్పించారు. వారిలో 12 ఏళ్ల బాలుడు కూడా ఉండటం గమనార్హం. చివరికి 1872 జనవరి 19న సద్గురును అరెస్టు చేసి, రంగూన్‌ జైలుకు తరలించారు. అక్కడే సుదీర్ఘ కాలం కారాగార వాసం అనుభవించాక ఆయన అమరుడయ్యారు.

ఇదీ చూడండి: 30 సెకన్లలో 10 చెంప దెబ్బలు.. హోంవర్క్ చేయని చిన్నారిపై టీచర్ కర్కశత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.