ETV Bharat / bharat

యుద్ధాల్లో పాల్గొన్నా.. సైన్యంపై ఆంగ్లేయుల వివక్షే.. ఎంత చేసినా సుబేదారే!

author img

By

Published : Aug 8, 2022, 5:28 PM IST

Updated : Aug 9, 2022, 10:51 AM IST

Azadi Ka Amrit Mahotsav Britishers Kings Commission Indian Soldiers
Azadi Ka Amrit Mahotsav Britishers Kings Commission Indian Soldiers

ఆంగ్లేయుల పాలనలోకి వచ్చాక భారతీయ సైనికులు రెండు ప్రపంచ యుద్ధాలే కాదు.. ప్రపంచంలో బ్రిటన్‌ పాల్గొన్న ప్రతి యుద్ధంలోనూ ఆ దేశం తరఫున పోరాడారు. వీరి దన్నుతో బ్రిటన్‌ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుని, నిలబెట్టుకుంది. ఇంత చేసినా భారతీయ సైనికులకు కనీసం గుర్తింపు, హోదా ఇవ్వటానికి నిరాకరించింది. సరైన శిక్షణ ఇవ్వటానికి సైతం అంగీకరించలేదు.

బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో సంఖ్యాపరంగా భారతీయులే అధికులైనా.. అధికారులంతా ఆంగ్లేయులే! కింగ్స్‌ కమిషన్‌లోకి భారతీయులను తీసుకునేవారు కాదు. 40 ఏళ్ల అనుభవమున్న భారతీయ సిపాయి కంటే ఆరోజే చేరిన ఆంగ్లేయ సైనికుడు పైనుండేవాడు. ఆర్మీ కేంద్ర కార్యాలయంలోనూ భారతీయులెవరినీ ఉండనిచ్చేవారు కాదు. సైన్యంలో భారతీయులకిచ్చే అత్యున్నత హోదా సుబేదార్‌! అదీ.. 50-60 ఏళ్ల వయసు వచ్చాకే! భారతీయులను కూడా సైన్యంలో కమిషన్‌ గ్రేడ్‌కు పరిగణించాలని, మిలిటరీ శిక్షణ కళాశాలలోకి అనుమతించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కానీ.. అప్పటి సైన్యాధిపతి జనరల్‌ ఫ్రెడెరిక్‌ రాబర్ట్స్‌ దీన్ని తోసిపుచ్చాడు. 'భారతీయులకు ఏ ర్యాంకు/హోదా కట్టబెట్టినా వారు ఆంగ్లేయులతో ఎన్నటికీ సమం కారు.. కాలేరు' అని అవహేళన చేశాడు. అలాగని భారతీయులు చేతగానివారనలేదు. ''సిక్కులు, రాజ్‌పూత్‌లు, డోగ్రాలు, జాట్లు, గోర్ఖాలతో కూడిన బృందాన్నిస్తే.. ఐరోపాలో ఏ శత్రువునైనా ఓడిస్తా'' అంటూ అదే రాబర్ట్స్‌ ప్రకటించాడు.

స్వాతంత్య్ర సాధనలో సైన్యం
భారతీయీకరణ కూడా ప్రధానమైందని గుర్తించిన సమరయోధులు ఆ దిశగా ఒత్తిడి పెంచారు. విషయాన్ని పసిగట్టిన బ్రిటిష్‌ సర్కారు పూర్తిగా కాదనకుండా... అలాగని ఆమోదించకుండా దాగుడు మూతలాడింది. 1900లో లార్డ్‌ కర్జన్‌... భారతీయుల కోసం అంటూ 20-30 మందితో ఇంపీరియల్‌ కాడెట్‌ కార్ప్స్‌ విభాగం ఏర్పాటు చేశాడు. తీరా ఇందులో తీసుకున్నది సంస్థానాధీశుల వారసులు, కుటుంబాల పిల్లలనే. వీరికి శిక్షణ ఇచ్చి మళ్లీ భారతీయ సిపాయిలపైనే పెత్తనం చేయించారు. బ్రిటిష్‌ భారత సైన్యంలో భారతీయులకు ప్రాధాన్యం పెరగాలన్న డిమాండ్‌ మొదటి ప్రపంచయుద్ధం తర్వాత పెరిగింది. కారణం.. మనవారు లక్షల మంది వెళ్లి, వేలల్లో ప్రాణాలు కోల్పోయి, గాయాలపాలై బ్రిటన్‌ను గెలిపించటమే! దీంతో భారతీయుల సేవలను మెచ్చుకుంటూ... ఆంగ్లేయ సర్కారు అయిష్టంగానే ఎంగిలిచేత్తో నజరానా విదిలించింది. బ్రిటన్‌లోని రాయల్‌ మిలిటరీ కాలేజీలో ఏటా పది సీట్లను భారతీయులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ శిక్షణ తీసుకొని వచ్చే పదిమందికి సైన్యంలో కమిషన్డ్‌ అధికారి హోదా అవకాశం లభిస్తుంది. 1921లో సమావేశమైన లెజిస్లేటివ్‌ అసెంబ్లీ.. మూడు డిమాండ్లను ప్రభుత్వానికి సమర్పించింది. వీటిని సర్‌ తేజ్‌బహదూర్‌ సప్రూ సిఫార్సులుగా పిలుస్తారు. అవి 1.ఇంగ్లాండ్‌ మిలిటరీ కాలేజీలో 25% సీట్లను భారతీయులకు కేటాయించాలి. 2. అందులో ప్రవేశానికి భారతీయులకు తగిన సౌకర్యాలు కల్పించాలి. 3. అలాంటి కాలేజీని భారత్‌లోనే ఏర్పాటు చేయాలి. ఈ సిఫార్సులకు అప్పటి బ్రిటిష్‌ కమాండర్‌ అంగీకరించారు. 14 సంవత్సరాల్లో సైన్యాన్ని భారతీయీకరించాలని సూత్రీకరించారు. కానీ.. లండన్‌లో భారత వ్యవహారాల మంత్రి దీనికి అడ్డుపుల్ల వేశారు. ''వాళ్ల డిమాండ్‌ను మీరు అంగీకరించటం చూస్తుంటే మనమేదో భారత్‌ను వీడటానికి సిద్ధపడుతున్నట్లుంది. అలాంటి భావన మనకే సవాళ్లను విసురుతుంది. కాబట్టి సైన్యాన్ని భారతీయీకరించే మీ సిఫార్సులను అంగీకరించే ప్రశ్నే లేదు'' అంటూ తేల్చిచెప్పాడు. అయితే.. ఇంగ్లాండ్‌ మిలిటరీ కాలేజీలో సీట్లను 10 నుంచి 20కి పెంచడానికి మాత్రం అంగీకరించారు. ఇదంతా చూసిన మోతీలాల్‌ నెహ్రూ.. ''అసలు సైన్యాన్ని భారతీయీకరించాలని అడగటమే తప్పు. అక్కడ ఉన్నదే మన భారతీయ సైన్యం. యూరోపియన్‌/ఆంగ్లేయుల పెత్తనం మన సైన్యంపై తొలగాలని మనం డిమాండ్‌ చేయాలి'' అని వాదించారు.

1928లో వచ్చిన సైమన్‌ కమిషన్‌... భారత్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వకపోవటానికి సమర్థమైన సొంత సైన్యం లేదనే సాకు చూపింది. అందుకే సమర్థ సైన్యాన్ని తయారు చేసే కాలేజీ స్థాపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో.. అప్పటి సైన్యాధిపతి ఫిలిప్‌ సారథ్యంలోని కమిటీ సిఫార్సుల మేరకు.. దేెహ్రాదూన్‌లో 1932 అక్టోబరు 1న ఇండియన్‌ మిలిటరీ అకాడమీ పేరుతో కాలేజీని ఆరంభించారు. శామ్‌ మానెక్‌షా తొలి బ్యాచ్‌లో చేరారు. వీరి సీనియర్‌ కరియప్ప అప్పటికే లండన్‌లో శిక్షణ పొందివచ్చారు. స్వాతంత్య్రం వచ్చినా తొలినాళ్లలో బ్రిటిష్‌ వారే.. భారత సైన్యానికి సారథ్యం వహించారు. చివరకు 1949 జనవరి 15న జనరల్‌ కరియప్ప భారత సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో భారత సైన్యంపై ఆంగ్లేయుల ఆధిపత్యం తొలగిపోయింది. ఆ రోజునే.. మన దేశంలో ఏటా సైనిక దినోత్సవం నిర్వహిస్తారు.

ఇవీ చూడండి: 'వాళ్లు పోరాటానికి పనికిరారు'.. సైన్యానికి జాతుల ముద్ర

ఆంగ్లేయులను తరిమికొట్టిన గోండు వీరుడు.. ఆదివాసీలే సైన్యంగా

Last Updated :Aug 9, 2022, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.