ETV Bharat / bharat

రాణి పారుకుట్టి.. ఎత్తుగడలతో ఆంగ్లేయుల ఆటకట్టి..

author img

By

Published : Jun 21, 2022, 7:30 AM IST

parukutty cochin amma news
parukutty cochin amma news

స్వాతంత్య్రానికి ముందున్న వందల సంస్థానాల్లో దాదాపు అన్నీ ఆంగ్లేయులకు అణిగిమణిగి ఉన్నవే. భయపడో, వారిచ్చే బిరుదులకు ఆశపడో తెల్లవారికి తలవంచినవే! కానీ ఒక సంస్థానం మాత్రం తమ రాణి ఎత్తుగడలతో బ్రిటిష్‌వారికి కంట్లో నలుసులా మారింది. అదే కొచ్చిన్‌. ఆ రాణి పారుకుట్టి నెత్యార్‌ అమ్మ! భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతు ప్రకటించి.. ఏకంగా రాజప్రాసాదాన్నే ఖద్దరు కేంద్రంగా మార్చి.. గాంధీజీని స్వయంగా ఆహ్వానించి.. ఏం చేస్తావో చేసుకో అన్నట్లు తెల్లవారికి సవాలు విసిరారు.. తన ఎత్తుగడలతో ఆంగ్లేయుల్ని నిస్సహాయుల్ని చేశారు రాణి పారుకుట్టి!

కొచ్చిన్‌ రాజు రామవర్మ-15 అధికారం పట్ల విముఖుడవటం వల్ల రామవర్మ-16కు అనుకోకుండా సింహాసనం దక్కింది. అప్పటికే ఆయనకు 14 సంవత్సరాల పారుకుట్టి నెత్యార్‌తో పెళ్లయింది. రాజుకు ఎంతసేపూ చదువు, వైద్యవిద్య, ఖగోళ, జ్యోతిష శాస్త్రాల్లో ఆసక్తి. రాజరికం, పాలనపై అంతగా శ్రద్ధ చూపేవారు కాదు. కొచ్చిన్‌ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిణామాలను ఆంగ్లేయులు ఆసక్తిగా గమనిస్తున్న వేళ.. మహారాణి పారుకుట్టి నెత్యార్‌ యుక్త వయసులోనే కొచ్చిన్‌ పాలన బాధ్యతలు తీసుకుంది. వయసు చిన్నదే అయినా చురుకైన నిర్ణయాలతో రాజ్యాన్ని గాడిలో పెట్టడం మొదలెట్టారామె. బాలికల విద్యకు పెద్దపీటవేస్తూ.. వైద్య సదుపాయాలను అందరికీ ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు పారుకుట్టి. అప్పటిదాకా కేవలం నాయర్‌ వర్గానికి మాత్రమే పాలనలో అవకాశం ఉండగా.. ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పి ప్రతిభావంతులందరినీ తీసుకోవటం ఆరంభించారు. పనికిరాని శాఖలు, ప్రాజెక్టులను రద్దు చేశారు. రోడ్లు, పోర్టు అభివృద్ధితో కొచ్చిన్‌ రూపురేఖలు మారిపోవటం ఆరంభమైంది. పారుకుట్టి నిర్ణయాల వల్ల.. కొచ్చిన్‌ సంస్థానం ఆర్థికంగా బలోపేతమైంది. ఆదాయం నాలుగింతలు పెరిగింది. ఇవన్నీ చూసిన బ్రిటిష్‌ సర్కారు 1919లో ఆమెకు ఆ కాలంలోని అత్యున్నత పౌర పురస్కారం కైజర్‌ ఎ హింద్‌ను (గాంధీజీకి కూడా ఇచ్చారిదే) ప్రకటించటమేగాకుండా.. కొచ్చిన్‌కు 17 గన్‌ల శాల్యూట్‌ హోదా ఇచ్చింది.

parukutty cochin amma news
పారుకుట్టి నెత్యార్​

ఆ క్షణానికి అవార్డులు, రివార్డులిస్తున్నా.. తెల్లవారిని రాణి పారుకుట్టి నమ్మలేదు. అనేక సందర్భాల్లో ఆంగ్లేయుల కపటత్వాన్ని చూసిన ఆమె ఆర్థికంగా నిలదొక్కుకున్న కొచ్చిన్‌ను తమ తర్వాత కొల్లగొట్టడానికి ఆంగ్లేయులు ప్రయత్నిస్తారని ఊహించారు. అందుకే.. ఆంగ్లేయులకు ఆ అవకాశం ఇవ్వకుండా.. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించి.. వారి ముందరికాళ్లకు బంధం వేశారు. కొచ్చిన్‌ను స్వాధీనం చేసుకోవటానికి ఆంగ్లేయులెలాంటి ప్రయత్నం చేసినా దేశవ్యాప్తంగా జాతీయోద్యమకారులు తిరగబడి.. రాజు, ప్రజల పక్షాన నిలబడతారనే భావనతో ఆమె ఈ ఎత్తుగడ వేశారు. బ్రిటిష్‌వారికిది ఎటూ పాలుపోని పరిస్థితి! అలాగని ఏదో వ్యూహాత్మకంగా మాత్రమే జాతీయోద్యమానికి ఆమె మద్దతిచ్చారనుకోవటానికి లేదు. మనస్ఫూర్తిగానే ఆమె ఆ దిశగా కదిలారు. రాచరికపు ఆడంబరాలు, ఆభరణాలు అన్నీ వదిలి.. ఖద్దరు చీర కట్టుకోవటం ఆరంభించారు. అంతేగాకుండా తన రాజప్రాసాదంలోనే ఖద్దరు తయారీ కేంద్రం ఆరంభించి.. అక్కడున్న అందరి వస్త్రధారణనూ మార్పించారు. కొచ్చిన్‌ రాజప్రాసాదం.. జాతీయోద్యమ కార్యక్రమాలకు కేంద్రమైందంటూ.. బ్రిటిష్‌ నిఘా వర్గాలు వైస్రాయ్‌కి సందేశాలు పంపించసాగాయి. రాజుకు మతిస్థిమితం సరిగ్గా లేదంటూ.. పక్కకు తప్పించటానికి యోచించినా.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ఆగిపోయారు.

ఆంగ్లేయుల కుటిలత్వాన్ని గుర్తించిన రాణి పారుకుట్టి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. గాంధీజీకి స్నేహ హస్తం చాచారు. తన కుమార్తె వి.కె.వైశాలిని అమ్మతో ఆయనకు లేఖ రాయించారు. 1925లో అంటరానితనం నిర్మూలన కోసం కేరళ వచ్చిన గాంధీజీ.. బహిరంగ సభల్లో కొచ్చిన్‌ రాజకుటుంబం ఖాదీ ప్రయోగాన్ని మెచ్చుకున్నారు. 1927 అక్టోబరులో మళ్లీ రాష్ట్రానికి వచ్చిన ఆయన్ను రాణి పారుకుట్టి వెళ్లి స్వయంగా కలిశారు. ఖాదీ దుస్తుల్లో.. ఆయనకు పాదాభివందనం చేశారు. జాతీయోద్యమానికి భూరి విరాళం అందజేశారు. తన కుమారుడు అరవిందాక్షను గాంధీజీకి తోడుగా పంపించారు. జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించారు. తద్వారా ఆంగ్లేయులు ఆమె ఉండగా.. తర్వాతా కొచ్చిన్‌ వైపు కన్నెత్తి చూడకుండా చేశారు రాణి పారుకుట్టి!

ఇదీ చదవండి: ఆరావళి ఆదివాసీలపై ఆంగ్లేయుల ఊచకోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.