ETV Bharat / bharat

మరో రేప్ కేసులో దోషిగా ఆశారాం బాపూ.. శిక్ష ఖరారు చేయనున్న కోర్టు

author img

By

Published : Jan 30, 2023, 10:20 PM IST

Updated : Jan 30, 2023, 10:28 PM IST

ASARAM BAPU RAPE
ASARAM BAPU RAPE

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ.. మరో అత్యాచార కేసులో దోషిగా తేలారు. ఈ మేరకు గుజరాత్​లోని గాంధీ నగర్ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది. న్యాయస్థానం మంగళవారం ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది.

గుజరాత్‌ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూను అత్యాచార కేసులో గాంధీనగర్‌ కోర్టు దోషిగా తేల్చింది. కేసులో నిందితులుగా ఉన్న ఆశారాం భార్యతో సహా మిగిలిన ఐదుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో న్యాయస్థానం మంగళవారం శిక్ష ఖరారు చేయనుంది. ఆశారాం.. తనపై అత్యాచారానికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన ఓ మహిళ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2001 నుంచి 2006 వరకు ఆశ్రమంలో ఉన్న తనపై బాపూ అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఈ కేసులో ఆశారాం బాపూతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగానే అందులో ఒకరు మరణించారు.

81 ఏళ్ల ఆశారాం బాపూ మరో అత్యాచార కేసులో ప్రస్తుతం జోధ్​పుర్‌ కారాగారంలో ఉన్నారు. రాజస్థాన్​లోని తన ఆశ్రమంలో మైనర్​పై అత్యాచారం చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆశారాం బాపూ.. 2013లో బాలికపై అత్యాచారం చేసినట్లు జోధ్​పుర్ కోర్టు 2018లో నిర్ధరించింది. ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఆ ఏడాది ఏప్రిల్ 25న తీర్పు చెప్పింది. ఇదే కేసులో ఆశారాం సహచరులు ఇద్దరికి 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. కాగా, తనకు బెయిల్ ఇప్పించాలంటూ ఆశారాం బాపూ.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను 2021 డిసెంబర్​లో న్యాయస్థానం కొట్టేసింది. ఈ తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

Last Updated :Jan 30, 2023, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.