ETV Bharat / bharat

దుస్తులు మార్చుకుని బైక్​పై పరారీ​.. బయటకొచ్చిన అమృత్​పాల్​ సీసీటీవీ దృశ్యాలు

author img

By

Published : Mar 21, 2023, 8:40 PM IST

Updated : Mar 21, 2023, 9:06 PM IST

amritpal singh cctv  Amritpal Singh Case
amritpal singh cctv Amritpal Singh Case

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ పరారీకి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. టోల్‌ప్లాజా వద్ద ముందు సీటులో అమృత్‌పాల్‌ కూర్చొని ఉన్నట్లు అందులో ఉంది. మరోవైపు అమృత్‌పాల్‌ విభిన్న రూపాల్లో ఉన్న ఫోటోలను విడుదల చేసిన పంజాబ్‌ పోలీసులు అతని అరెస్టు చేసేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరారయ్యే ముందు ఒక గురుద్వారాను సందర్శించి అక్కడే అమృత్‌పాల్‌ దుస్తులు మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అతడికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం రోజున అతడు కారులో వెళ్తున్నప్పటి సీసీటీవీ ఫుటేజ్‌ బయటకు వచ్చింది. అందులో అతడు టోల్ ప్లాజా వద్ద కారు ముందు సీటులో కూర్చొని ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. కాగా, అమృత్‌పాల్‌ విభిన్న రూపాల్లో ఉన్న ఫోటోలను విడుదల చేసిన పంజాబ్‌ పోలీసులు.. అతడిని అరెస్టు చేసేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అమృత్‌పాల్‌ కోసం శనివారం పోలీసులు పక్కా వ్యూహంతో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినప్పటికీ అతడు తప్పించుకున్నాడు. పోలీసులు వచ్చినట్లు సమాచారం అందగానే తాను ప్రయాణిస్తున్న మెర్సిడెస్‌ వాహనాన్ని అమృత్‌పాల్‌ అక్కడే వదిలేశాడు. తర్వాత బ్రెజా కారులోకి మారాడు. జలంధర్‌లోని టోల్‌ప్లాజా వద్ద అతడు బ్రెజా కారులోని కనిపించాడు.

amritpal singh cctv Amritpal Singh Case
టోల్‌ప్లాజా వద్ద కారులో ముందు సీటులో అమృత్‌పాల్‌

అమృత్‌పాల్‌ పారిపోయేందుకు సహకరించిన అతడి అనుచరుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అమృత్‌పాల్‌కు సంబంధించిన పలు చిత్రాలను పంజాబ్‌ పోలీసులు విడుదల చేశారు. ఈ ఫోటోల్లో టర్బన్​ ధరించి, టర్బన్​ లేకుండా.. వివిధ రూపాల్లో అమృత్‌పాల్‌ కనిపిస్తున్నాడు. ప్రజలు అమృత్‌పాల్‌ను గుర్తించి అతన్ని అరెస్టు చేయడానికి పోలీసులకు సమాచారం అందించడానికి వీలుగా ఈ చిత్రాలను విడుదల చేసినట్లు పంజాబ్‌ IGP సుఖ్‌చైన్‌ సింగ్‌ గిల్‌ వెల్లడించారు. అమృత్‌పాల్‌ను అరెస్టు చేయడానికి ప్రజలు సహకరించాలని కోరారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్‌పై కేసు నమోదు చేశామని మార్చి 18వ తేదీనే అతనిపై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ అయ్యిందని పంజాబ్‌ పోలీసులు వెల్లడించారు. అమృత్‌పాల్‌ పారిపోయిన బ్రెజా కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అందులో 315 బోర్​ రైఫిల్స్​, కొన్ని కత్తులు, వాకీ టాకీలు దొరికాయని వెల్లడించారు.

అమృత్‌పాల్‌ పారిపోయేందుకు సహకరించిన నలుగురిపై ఆయుధ చట్టాన్ని ప్రయోగించారు. పారిపోయిన తర్వాత అమృత్‌పాల్‌ సింగ్‌ జలంధర్‌ జిల్లాలోని నంగల్ అంబియన్ గ్రామంలోని ఓ గురుద్వారాను సందర్శించాడు. అక్కడ దుస్తులు మార్చుకుని మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి రెండు బైకులపై పారిపోయాడని వెల్లడించారు. ప్రస్తుతం పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు 154 మందిని అరెస్టు చేసినట్లు ఐజీ తెలిపారు.

అమృత్‌పాల్‌ అరెస్టు.. అలా మెదలుపెట్టిన పోలీసులు..
ఖలిస్థానీ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ను అరెస్టు చేయడానికి పంజాబ్‌-కేంద్ర ప్రభుత్వాలు చాలా రోజుల ముందే పక్కాగా ప్లాన్‌ చేశాయి. కానీ, అమృత్‌సర్‌లో జరుగుతున్న మూడు జీ-20 సమావేశాలు ప్రతిష్టాత్మకంగా మారడం వల్ల.. అవి ముగిసేవరకు వేచిచూశాయి. ఆ సమావేశాలు ముగిశాక.. గత శుక్రవారం మధ్యాహ్నం నుంచి పంజాబ్​లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర అదనపు చీఫ్‌ సెక్రటరీ అనురాగ్‌ వర్మ ఆదేశాలిచ్చారు. కొన్ని వర్గాలు హింసను ప్రేరేపించి ప్రజలను గాయపరిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు ఆయన దృష్టికి తీసుకొచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2జీ, 3జీ, 4జీ, 5జీ, సీడీఎంఏ, జీపీఆర్‌ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలను నిలిపివేశారు. బ్యాంకింగ్‌ సేవలకు మాత్రమే ఇంటర్నెట్‌ను సేవలను అనుమతించారు. డాంగిల్‌ ద్వారా అందించే ఇంటర్నెట్‌ సేవల్ని కూడా శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నాం వరకు నిలిపివేశారు. కాగా, ఈ స్థాయి మోహరింపులు ఉన్నా.. ప్రజలకు ఎలాంటి అనుమానాలు రాకుండా పోలీసులు జాగ్రత్త తీసుకొన్నారు. ఎందుకంటే అమృత్‌పాల్‌ సింగ్ శని, ఆదివారాల్లో రాంపూర్‌ఫూల్‌, ముక్తసర్లో ప్రాంతాల్లో ప్రసంగించాల్సి ఉంది.

Last Updated :Mar 21, 2023, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.