ETV Bharat / bharat

ఆ వర్గాలకు ఎస్టీ హోదా.. త్వరలోనే రిజర్వేషన్.. అమిత్ షా గుడ్​న్యూస్

author img

By

Published : Oct 4, 2022, 4:33 PM IST

జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రిజర్వేషన్లపై కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్‌లతో పాటు పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పించి త్వరలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి మార్గం సుగమం అయిందని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

amit shah jk tour
అమిత్ షా

జమ్ముకశ్మీర్‌ పర్యటనలో ఉన్న కేంద్ర హోమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్‌లతో పాటు పహారీ సామాజిక వర్గానికీ ఎస్టీ హోదా కల్పించి.. త్వరలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్ముకశ్మీర్‌లో అడుగుపెట్టిన అమిత్‌ షాకు.. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వాగతం పలికారు. నవరాత్రుల సందర్భంగా రియాసి జిల్లాలోని త్రికూట కొండలపై ఉన్న ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన అమిత్‌ షా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రాజౌరిలో బహిరంగ సభలో పాల్గొన్న అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు.

మూడు సామాజిక వర్గాల ప్రయోజనాలు పరిశీలించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఏర్పాటు చేసిన జస్టిస్‌ శర్మ కమిషన్‌ సిఫారసుల మేరకు ఈ కోటా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఎస్టీ కోటాలో గుజ్జర్లు, బకర్వాల్‌లు, పహారీలకు ఎలాంటి తగ్గుదల ఉండదన్న ఆయన.. ప్రతి ఒక్కరూ తమ వాటాను పొందుతారని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్‌లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అందించేందుకు మార్గం సుగమమైందని అమిత్‌ షా అన్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి కాగానే ఆయా వర్గాల ప్రజలు రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందిస్తామన్నారు.

"ఆర్టికల్‌ 370 ఉపసంహరణతో గిరిజన తెగలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమమైంది. రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ శర్మ కమిషన్‌ తన సిఫారసులను మాకు అందజేసింది. పహారీ, బకర్వాల్‌, గుజ్జర్లకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేశారు. ప్రధాని మోదీది చాలా పెద్ద మనసు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి కాగానే పహారీ, బకర్వాల్‌, గుజ్జర్ల ప్రజలు రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందుతారని చెప్పేందుకే నేను వచ్చాను."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు అమిత్ షా. కేవలం మూడు రాజకీయ కుటుంబాలు రాష్ట్రాన్ని పాలించేవని.. ఇప్పుడు ఆ విధానం మారిందన్నారు. పారదర్శక ఎన్నికల ద్వారా పంచాయతీలు, జిల్లా కౌన్సిల్‌లకు ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి ప్రధాని మోదీ ప్రాధాన్యతని.. అభివృద్ధి, సంక్షేమం కోసం మోదీని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులపై మోదీ ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యల కారణంగా జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఫలితంగా ప్రతి ఏటా 1,200 మంది భద్రతా బలగాలు ఉగ్రవాదంపై పోరులో ప్రాణాలు కోల్పోతుండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 136 తగ్గిందన్నారు.

జమ్ముకశ్మీర్‌లో పహారీలకు ఎస్టీ హోదా మంజూరైతే ఒక భాష మాట్లాడే సమూహానికి దేశంలో రిజర్వేషన్లు కల్పించడం ఇదే తొలిసారి కానుంది. ఇది కార్యరూపం దాల్చాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇటు అమిత్‌ షా పర్యటన వేళ జమ్ముకశ్మీర్‌ జైళ్ల డీజీ హత్య జరగడం వల్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ, పోలీసు, పారా మిలటరీ బలగాల సంయుక్త బృందాలతో పహారాను పెంచారు.

ఇవీ చదవండి: ఉచిత హామీలపై ఈసీ ఆందోళన.. రాజకీయ పార్టీలకు లేఖ.. ఆ వివరాలు చెప్పాలని ఆదేశం!

వృద్ధుడి కడుపులో గ్లాస్.. నాలుగు నెలలు నరకం.. చివరకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.