ETV Bharat / bharat

'ఏ మహిళా.. తన భర్తను మరొకరితో పంచుకోవడానికి ఇష్టపడదు'

author img

By

Published : May 4, 2022, 7:27 AM IST

Allahabad High court
అలహాబాద్‌ హైకోర్టు

Allahabad High court: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ భారతీయ మహిళ తన భర్తను మరొకరితో పంచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడదని వ్యాఖ్యానించింది. అలాంటి సందర్భం ఎదురైనప్పుడు మహిళా నిశ్చింతగా ఉండలేదని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది.

Allahabad High court: ఏ భారతీయ మహిళా తన భర్తను మరొకరితో పంచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడదని.. అలాంటి సందర్భం ఎదురైనప్పుడు నిశ్చింతగా ఉండలేదని అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. వారణాసికి చెందిన సుశీల్‌కుమార్‌ అనే వ్యక్తి.. తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే.. ఆమెతో వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, అతడు మూడో వివాహం కూడా చేసుకోబోతున్నాడన్న విషయం తెలిసి రెండో భార్య హతాశురాలైంది. 10-12 ఏళ్లుగా తనను భర్త, అత్తింటివారు చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ 2018, సెప్టెంబరు 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మరుసటిరోజే ఆమె ఆత్మహత్య చేసుకొంది. ఈ కేసు నుంచి తనను తప్పించాలంటూ అతడు డిశ్ఛార్జి పిటిషన్‌ దాఖలు చేయగా, అదనపు సెషన్స్‌ జడ్జి తిరస్కరించారు. సుశీల్‌కుమార్‌ దీన్ని సవాలుచేస్తూ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాడు.

విచారణ చేపట్టిన జస్టిస్‌ రాహుల్‌ చతుర్వేది.. నిందితుడి అభ్యర్థనను తోసిపుచ్చుతూ మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. "తన భర్త మరొక స్త్రీతో ఉండటాన్ని, లేదా వివాహం చేసుకోవడాన్ని ఏ మహిళా భవించలేదు. సుశీల్‌కుమార్‌ మరో వివాహం చేసుకోనున్న విషయం ఆత్మహత్యకు సరైన కారణం కాకపోవచ్చు. కానీ, భర్త సహా అత్తింటివారు తనను దశాబ్దకాలానికి పైగా వేధిస్తున్నారని చనిపోవడానికి ముందు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాబట్టి, ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను విడిచిపెట్టడం కుదరదు. వారిని విచారించాల్సిన అవసరముంది" అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: శాస్త్రీయంగానే పిల్లల వ్యాక్సినేషన్‌: సుప్రీం కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.