ETV Bharat / bharat

'అవన్నీ అవాస్తవం.. నేను ఆ పార్టీలోనే ఉంటా'.. అజిత్​ పవార్ క్లారిటీ

author img

By

Published : Apr 18, 2023, 12:07 PM IST

Updated : Apr 18, 2023, 3:35 PM IST

నేషనలిస్ట్ కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకుడు అజిత్​ పవార్.. తాను బీజేపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని కొట్టి పారేశారు. తనపై కావాలనే ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

ajit pawar ncp Ajit Pawar supported MLAs meeting in Mumbai maharashtra
అజిత్ పవార్ ఎన్‌సీపీ

తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మహారాష్ట్ర ఎన్​సీపీ సీనియర్​ నేత అజిత్​ పవార్​ ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేరే ప్రసక్తే లేదని మంగళవారం తేల్చి చెప్పారు. తాను ప్రస్తుతం ఎన్​సీపీలోనే ఉన్నట్లు.. ఇకపై కూడా అదే పార్టీలో కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. తాను ఎన్​సీపీని వీడబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. మద్దతు కోసం 40 ఎమ్మెల్యేల వద్ద సంతకాలు సేకరించే అవకాశం లేదని తెలిపారు. కావాలనే తనపై అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని అజిత్​ పవార్​ మండిపడ్డారు.

ఇదే విషయంపై సోమవారం ట్విట్టర్ వేదికగానూ స్పందించారు అజిత్​ పవార్​. "మంగళవారం నేను ముంబయిలోనే ఉంటాను. నా రోజువారీ పనుల కోసం విధానసభకు వెళ్తా. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. నేను ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఎటువంటి మీటింగ్​ను ఏర్పాటు చేయడం లేదు" అని స్పష్టం చేశారు.

అంతకుముందు.. అజిత్​ పవార్.. బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన తన అనుచరులతో కలిసి మంగళవారం ముంబయిలో సమావేశం కానున్నట్లు.. అనంతరం వీరంతా సంతకాలు చేసిన ఓ లేఖను.. పవార్​ గవర్నర్​కు అందిస్తారని పలు కథనాలు వెలువడ్డాయి. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు అజిత్​ పవార్​ వెంట ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

అయితే, అజిత్​ పవార్ బీబేపీలోకి వెళ్తారు అని వార్తలు రావడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎన్​సీపీ పింప్రి ఎమ్మెల్యే అన్నా బన్సోడే.. అజిత్​ పవార్​కు తన మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. సిన్నార్ ఎమ్మెల్యే మాణిక్రావ్ కోకటే కూడా అజిత్​ పవార్​కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. మంగళవారం తాము అజిత్​ పవార్​తోనే ఉన్నట్లు వెల్లడించారు. దీంతో.. వీరిద్దరితో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు అజిత్​ పవార్​తో కలిసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.

ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధనంజయ్ ముండే సైతం ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన కూడా అజిత్ పవార్​ను కలిసేందుకు ముంబయి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఏక్​నాథ్​ శిందే ముఖ్యమంత్రి అయిన తరువాత.. దాదాపు 10 నుంచి 15 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు తరచుగా వస్తున్నాయి. ఈ కారణాలే అజిత్​ వరార్​ బీజేపీలోకి వెళ్తున్నారన్న వార్తలకు బలం చేకూర్చాయి.

అజిత్ తిరుగుబాటుపై శరద్ పవార్​ స్పందన..
అజిత్ పవార్ తిరుగుబాటు చేస్తారనే వార్తల నేపథ్యంలో ఎన్​సీపీ అధినేత శరద్ పవార్​ స్పందించారు. ప్రస్తుతం అజిత్ పవార్​ ఎన్నికల సంబంధిత పనుల్లో బిజీగా ఉన్నారన్నారు. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.

'మహా వికాస్​ అఘాడీని బలహీనపరిచే కుట్ర'
అజిత్ పవార్​పై వస్తున్న వార్తలను శివసేన(ఉద్ధవ్​ బాల్​ ఠాక్రే) నేత సంజయ్​ రౌత్​ ఖండించారు. అవన్నీ పూకార్లు అని చెప్పారు. తాను.. అజిత్​ పవార్​, మిగతా నేతలతో మాట్లాడినట్లు తెలిపారు.' ఇలాంటి పుకార్లతో మహా వికాస్​ అఘాడీని బలహీనపరచాలని అనుకుంటే.. మీరు పొరపడుతున్నట్టే' అని చెప్పారు.

Last Updated : Apr 18, 2023, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.