ETV Bharat / bharat

'బోస్ బతికుంటే భారత్- పాక్ విడిపోయేవి కాదు.. జిన్నా సైతం ఆయనకే జై కొట్టారు'

author img

By

Published : Jun 17, 2023, 9:23 PM IST

Ajit Doval speech on Netaji Subhas Chandra Bose Memorial Lecture in delhi ajit-doval-netaji
నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక ఉపన్యాసం

​Ajit Doval Netaji : దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో.. నేతాజీ​ సుభాష్ చంద్రబోస్ బతికి ఉంటే భారత్​ విడిపోయేది కాదన్నారు జాతీయ భద్రత సలహాదారు అజిత్​ ఢోబాల్. ఆయన బ్రిటీష్​ వారిని ధైర్యంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. దేశానికి బోస్ చేసిన సేవలను కొనియాడారు. శనివారం దిల్లీలో అసోచామ్ ఏర్పాటు చేసిన బోస్ స్మారక కార్యక్రమంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు.

​Ajit Doval Netaji : భారత సాతంత్ర్య సమరయోధుడు.. నేతాజీ సుభాష్​ చంద్రబోస్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జాతీయ భద్రత సలహాదారు అజిత్​ ఢోబాల్​. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో నేతాజీ​ బతికి ఉంటే.. భారత్​ విడిపోయేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్​ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా కూడా.. తాను చంద్రబోస్​ నాయకత్వాన్ని మాత్రమే ఆమోదిస్తానని ప్రకటించిన విషయాన్ని ఢోబాల్ గుర్తుచేశారు.

బ్రిటీష్​ వారిని నిర్భయంగా ఎదిరించే ధైర్యసాహసాలు సుభాష్​ చంద్రబోస్​కు ఉండేవని ఢోబాల్ పేర్కొన్నారు. బోస్​ కేవలం దేశ స్వాతంత్ర్యాన్ని మాత్రమే కోరుకోలేదని.. దేశ ప్రజల రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరమైన ఆలోచన విధానాలను మార్చాలనుకున్నారని ఢోబాల్ వెల్లడించారు. వారు స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతున్న పక్షుల వంటి అనుభూతిని పొందాలని బోస్ భావించారని ఆయన వివరించారు.

"దేశ స్వాతంత్యం కోసం ఎవ్వరిని వేడుకోనని.. కేవలం పోరాటమే చేస్తానని సుభాష్​ చంద్రబోస్ అన్నారు. అది తన హక్కు అని ఆయన నొక్కిచెప్పారు. ఆయన నాయకత్వం భిన్నమైన శైలిలో ఉండేది" అని ఢోబాల్ అన్నారు. భారత్​ వాస్తవికతో ఉండేదని, ఇప్పుడు కూడా ఉందని, భవిష్యత్​లోనూ ఉంటుందని అప్పట్లో బోస్​ అన్న మాటలను ఢోబాల్ గుర్తు చేశారు. చరిత్ర.. బోస్ పట్ల దయతో ఉండేది కాదని.. దానికి పునరుజ్జీవం పోసేందుకు ఎంతో ఆసక్తి ఉన్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని.. అందుకు తాను సంతోషిస్తున్నానని ఢోబాల్ తెలిపారు.

బోస్​కు మహాత్మా గాంధీనే ఎదిరించే ధైర్య సాహసాలు ఉన్నాయన్నారు అజిత్ ఢోబాల్​. అదే సమయంలో మహాత్మ గాంధీని ఆయన ఎంతో గౌరవించేవారని తెలిపారు. భారత్‌కు బోస్ అందించిన సహకారం ఆదర్శనీయమని ఆయన కొనియాడారు. "బోస్ నాయకత్వం అసాధారణమైనది. ఆయన కుల, మత జాతి విభజనలకు అతీతంగా వాస్తవికతను గుర్తించారు. ఇదే ధోరణి అన్ని వర్గాల ప్రజల్లో ప్రతిధ్వనించింది. దేశం కోసం ఆయన చేసిన పోరాటం నుంచే నేను స్ఫూర్తి పొందాను. బోస్ పూర్తిగా మతపరమైన వ్యక్తి అయినప్పటికీ.. ఆయన​ సెక్యులర్ భావాలను కలిగి ఉండేవారు" అని ఢోబాల్ తెలిపారు.

"బోస్​ కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసి.. కొత్తగా ఉద్యమాన్ని ప్రారభించారు. దీంతో ఆయన జైలు పాలయ్యారు. అప్పుడు నిర్భందంలో ఉన్న బోస్​.. అఫ్గాన్ వ్యక్తి వేషధారణలో జైలు నుంచి పారిపోయారు. ఒక బెంగాలీ.. అఫ్గాన్ జాతీయుడిలా వేషం వేయడం చాలా కష్టం. అక్కడి నుంచి ఆయన కాబుల్ వెళ్లారు. ఆ తరువాత రష్యా, జర్మనీ, జపాన్, సింగపూర్​ వెళ్లారు. అనంతరం ఇండియన్ నేషనల్​ ఆర్మీని ఏర్పాటు చేశారు. బోస్​కు జపాన్ తప్ప ఎవరు సాయం అందించలేదు" అని ఢోబాల్ వివరించారు.

కేవలం సుభాష్​ చంద్రబోస్​ వల్ల బ్రిటిష్​ వారు భారత్​కు​ స్వాతంత్ర్యం ఇచ్చినట్లు ఢోబాల్ అభిప్రాయపడ్డారు. శనివారం దిల్లీలో అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్​ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక కార్యక్రమంలో ప్రసంగించిన ఢోబాల్ ఈ వాఖ్యలు చేశారు. నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను తయారు చేయడంపై వ్యాపారవేత్తలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అది దేశ శ్రామిక శక్తి ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా.. సాంకేతిక ఆవిష్కరణలను తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.