ETV Bharat / bharat

'వాయుసేనలో కొత్త విభాగం.. వచ్చే ఏడాది నుంచి మహిళా అగ్నివీరులు'

author img

By

Published : Oct 8, 2022, 11:13 AM IST

Updated : Oct 8, 2022, 1:52 PM IST

భారత వాయుసేనలో నూతన విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు. అదునాతన సాంకేతికతపై ఇది దృష్టిసారిస్తుందని వెల్లడించారు. వాయుసేన 90వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగించిన ఆయన.. అగ్నివీర్ నియామకాలపైనా కీలక ప్రకటన చేశారు.

air-force-day-2022
air-force-day-2022

వాయుసేన వార్షికోత్సవ పరేడ్

Air Force day 2022: భారత వాయుసేన 90వ వార్షికోత్సవం చండీగఢ్​లో ఘనంగా ప్రారంభమైంది. తొలిసారి దిల్లీ-ఎన్​సీఆర్ పరిధి అవతల నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్​ను ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎయిర్​ఫోర్స్​లో నూతనంగా ఆయుధ వ్యవస్థ బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆపరేషన్ బ్రాంచ్ వల్ల వాయుసేనకు రూ.3,400 కోట్ల వరకు వ్యయం తగ్గుతుందని చెప్పారు. శతాబ్ది ఉత్సవాల నాటికి వాయుసేనను మరింత పటిష్ఠంగా మార్చే బాధ్యత తమపై ఉందని అన్నారు. అంతకుముందు, సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులు జాతీయ యుద్ధస్మారకాన్ని సందర్శించారు.

air-force-day-2022
జాతీయ యుద్ధ స్మారకం వద్ద సైనికాధికారులు

"స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి వాయుసేనలో ఆపరేషన్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎయిర్​ఫోర్స్​లో ఆయుధ వ్యవస్థ బ్రాంచ్​ ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా వాయుసేనలోకి యోధులను చేర్చుకోవడం సవాళ్లతో కూడుకున్న అంశం. అయితే, దేశసేవ కోసం యువత సామర్థ్యాన్ని వినియోగించుకొనేందుకు మనకు లభించిన అవకాశం ఇది. అగ్నివీరులకు సరైన నైపుణ్యం, నాలెడ్జ్ అందించే విధంగా మా ఆపరేషనల్ ట్రైనింగ్ పద్ధతిలో మార్పు చేశాం. ఈ ఏడాది డిసెంబర్​లో 3వేల మందిని చేర్చుకొని ప్రాథమిక శిక్షణ ప్రారంభిస్తాం. వచ్చే కొన్నేళ్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. వచ్చే ఏడాది మహిళా అగ్నివీరులను సైతం చేర్చుకుంటాం. ఇందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల ఏర్పాట్లు జరుగుతున్నాయి."
-ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, వాయుసేన చీఫ్

అధునాతన సాంకేతికతపై దృష్టిసారించడం, నూతన ఆయుధ వ్యవస్థల కోసం ప్రత్యేక కేడర్ అధికారులను నియమించుకోవడంపై నూతన బ్రాంచ్ దృష్టిసారిస్తుందని వాయుసేన తెలిపింది. ఫ్లైయింగ్, రిమోట్, ఇంటెలిజెన్స్, సర్ఫేస్ అనే నాలుగు విభాగాలు ఇందులో ఉంటాయని వివరించింది.

air-force-day-2022
జాతీయ యుద్ధస్మారకం వద్ద సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులు

మోదీ ట్వీట్..
కాగా, ఎయిర్​ఫోర్స్ డే సందర్భంగా.. వాయుసేన పోరాట యోధులందరికీ శుభాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా ఎయిర్​ఫోర్స్ అసాధారణ నైపుణ్యాలు ప్రదర్శించిందని కొనియాడారు. దేశాన్ని ఎల్లప్పుడూ కాపాడటమే కాకుండా.. విపత్తులు సంభవించినప్పుడు మానవతా దృక్పథాన్ని ప్రదర్శించిందని చెప్పారు.

Last Updated : Oct 8, 2022, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.