ETV Bharat / bharat

'మోదీజీ.. ఈ ఎన్నికలు మీ గురించి కాదు.. కర్ణాటకకు ఏం చేశారో చెప్పండి'

author img

By

Published : May 1, 2023, 4:54 PM IST

Updated : May 1, 2023, 5:09 PM IST

Karnataka Elections 2023 Rahul Gandhi
ఈ ఎన్నికలు మీ ఒక్కరికే సంబంధించినవి కావు: మోదీపై రాహుల్​ ఫైర్​

Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ మాజీ ఎంపీ రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికలు మీకు (మోదీకి) మాత్రమే సంబంధించినవి కావని ఎద్దేవా చేశారు.

Karnataka Elections 2023 : కర్ణాటక శాసనసభ ఎన్నికలు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి జరుగుతున్నవి కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ విషయం ప్రధాని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. తనను కాంగ్రెస్ నేతలు​ 91 సార్లు దుర్భాషలాడారన్న ప్రధాని ఆరోపణల నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక తుమకూరు జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. మోదీ తన గురించి మాట్లాడుకునే బదులు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టబోయే భవిష్యత్​ కార్యక్రమాల గురించి చెప్పాలని కాంగ్రెస్​ అగ్రనేత ప్రధానికి సూచించారు.

"ఈ ఎన్నికలు మీ గురించి కాదు. మీరు(మోదీ) కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కానీ కర్ణాటక గురించి మాట్లాడరు. మీ గురించి మీరే మాట్లాడుకుంటారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఏం చేసిందో మీరే చెప్పాలి. మీ ప్రసంగాల్లో వీటి ప్రస్తావన కూడా ఉండాలి. రాబోయే ఐదేళ్లలో విద్య, ఆరోగ్యం, యువతకు ఉపాధి సహా అవినీతి నిర్మూలనకు మీరు ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలి."
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

అప్పుడప్పుడు వారి పేర్లు కూడా చెప్పండి..: రాహుల్​
'నేను కర్ణాటకకు వచ్చి ప్రసంగాలు చేసినప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ వంటి సీనియర్​ నాయకులు సహా పార్టీలోని ఇతర నేతల పనితీరు గురించి కూడా మాట్లాడతాను. కానీ, మీరు మాత్రం మీ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి (బసవరాజు బొమ్మై), మాజీ సీఎం యడియూరప్ప వంటి ముఖ్యమైన నేతల గురించి ఎందుకు ప్రజలకు చెప్పరు? పైగా మీ గురించి మీరే చెప్పుకుంటారు ఎందుకు?' అని రాహుల్​ ప్రశ్నించారు. తమ పార్టీలో పనిచేసే నాయకుల పనితీరును కూడా అప్పుడప్పుడు ప్రజల వద్ద ప్రస్తావించాలని.. అప్పుడు వారు కూడా సంతోషంగా ఉంటారని రాహుల్​ మోదీకి సూచించారు.

Karnataka Elections 2023 Rahul Gandhi
ప్రజలకు అభివాదం చేస్తున్న కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ
Karnataka Elections 2023 Rahul Gandhi
బహిరంగ సభలో ప్రసంగిస్తున్న రాహుల్​ గాంధీ

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌కు 'సూపర్ బూస్టర్ డోస్'
భారత్ జోడో యాత్ర ద్వారా పార్టీకి పునర్వైభవం వచ్చిందని.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు తమ పార్టీకి 'సూపర్ బూస్టర్ డోస్' వంటిదని ఆ పార్టీ సీనియర్​ నేత, ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.

"2024 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. కర్ణాటకలో వచ్చే ఫలితాలు.. ఈ ఏడాది చివర్లో జరిగే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్​, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం వంటి రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైన కచ్చితంగా ప్రభావం చూపనున్నాయి."
-జైరాం రమేశ్, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

Last Updated :May 1, 2023, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.