ETV Bharat / bharat

అక్కడ టీ​ తాగితే.. కప్పు తినాల్సిందే.!

author img

By

Published : Mar 9, 2021, 10:36 AM IST

AFTER DRINKING THE TEA WILL EAT THE CUP
అక్కడ చాయ్​ తాగితే కప్పు తినాల్సిందే.!

మహారాష్ట్రలోని కొల్హాపుర్​లో ఓ టీకొట్టుకు జనాలు విపరీతంగా వెళ్తున్నారు. అక్కడి హోటల్​లో చాయ్​ కంటే కప్​నే అధికంగా ఇష్టపడతారు. ఎందుకంటే.. టీ తాగగానే కప్​నూ తినేయొచ్చట. అదేంటి కప్​ను పారేయాలి కదా.. తినడమేంటని ఆశ్చర్యంగా ఉందా! అయితే.. ఈ కథనం చదవాల్సిందే..

అక్కడ చాయ్​ తాగితే కప్పు తినాల్సిందే.!

ఏ టీకొట్టు వద్దనైనా సాయంత్రానికల్లా వాడిపారేసిన ప్లాస్టిక్, పేపర్ కప్పులు కుప్పలా పేరుకుపోతాయి. కొల్హాపుర్‌కు చెందిన ముగ్గురు మిత్రులు ఆ కుప్పను తగ్గించేందుకు ఓ ఆవిష్కరణతో ముందుకొచ్చారు. బిస్కట్ కప్స్ పేరుతో తినగలిగే కప్పులను తయారు చేస్తున్నారు. ఆ ముగ్గురే దిగ్విజయ్ గైక్వాడ్, ఆదేశ్ కరండే, రాజేశ్ ఖంకార్.

"ప్లాస్టిక్, పేపర్ కప్పుల వినియోగం వల్ల చెత్త భారీగా ఉత్పత్తవుతుంది. మన దేశంలో రోజుకు లక్ష టన్నుల ప్లాస్టిక్ వినియోగం జరుగుతోంది. అందుకే లాక్‌డౌన్‌లో బిస్కట్ కప్పుల తయారీపై పరిశోధన చేసి, ఉత్పత్తి ప్రారంభించాను. వ్యర్థాల ఉత్పత్తిని నియంత్రించేందుకు ఈ కప్పుల వినియోగం దోహదం చేస్తుంది. మైదా, మొక్కజొన్న పిండి, పంచదార ఉపయోగించి, వీటిని తయారుచేశాం. 15 నుంచి 20 నిమిషాల వరకు కప్పులో టీ ఉండగలుగుతుంది."

- దిగ్విజయ్ గైక్వాడ్, ఆంత్రప్రెన్యూర్

రుచికరంగా..

మాగ్నెట్ ఎడిబుల్ కట్లరీ పేరుతో ఓ సంస్థను స్థాపించారు ఈ ముగ్గురు మిత్రులు. పిండితో బిస్కట్ కప్పుల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ కప్పులు తినేందుకు రుచికరంగానూ ఉంటాయి. చాయ్ తాగిన తర్వాత, కప్పునూ తినేయొచ్చన్నమాట.

"8, 10 నిమిషాల తర్వాత టీ క్రమంగా చల్లారుతుంది. ఈ కప్పుల్లో చాయ్‌ను నిల్వ ఉంచే ప్రయోగం చేశాం. రెండు రోజుల పాటు కప్పు పాడవకుండా ఉండగలిగింది. లీకేజ్ లేదు, డ్యామేజ్ లేదు."

- రాజేశ్ ఖంకార్, ఆంత్రప్రెన్యూర్

"ఒక్కో కప్పు ధర రూ.3. చాయ్ అమ్మకందారులు, ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఈ వ్యాపారం చేయాలనుకునే వారికి సహకారం అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో తినగలిగే పళ్లాలను కూడా తయారుచేయాలనుకుంటున్నాం."

- దిగ్విజయ్ గైక్వాడ్, ఆంత్రప్రెన్యూర్

పారేసినా జంతువులకు ఆహారంగా..

జీరో వేస్ట్ సూత్రాన్ని పాటిస్తూ ఈ కప్పులు తయారుచేస్తున్నారు. ఎవరికైనా కప్పు తినడం ఇష్టం లేక పారేసినా.. జంతువులు తినేస్తాయని చెప్తున్నారు బిస్కట్ కప్పు తయారీదారులు.

"తినే కప్పుల వల్ల కలిగే ప్రయోజనాలను చాయ్‌వాలాలకు వివరించి, వాటిని వాడేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. ప్లాస్టిక్ కప్పుతో పోలిస్తే దీని ధర ఎక్కువే. కానీ పర్యావరణానికి మంచిది. వ్యర్థాలను నియంత్రించేందుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ కప్పు తినకుండా పడేసినా.. జంతువులు తినేస్తాయి. చెత్తగా మారుతుందన్న భయం లేదు."

- ఆదేశ్ కరండే, ఆంత్రప్రెన్యూర్

"చాయ్ పోస్తే కప్పు మరింత రుచికరంగా మారుతుంది. పర్యావరణ పరిరక్షణకు ఇదెంతో దోహదం చేస్తుంది. జీవితంలో మొదటిసారి టీ తాగి, కప్పను తినేశాం."

- సునీల్ సంక్‌పాల్, స్థానికుడు

తినే కప్పుల ఉత్పత్తిలో 50 శాతం వ్యర్థాలు వస్తున్నాయి. ఈ శాతాన్ని తగ్గించేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.

"ఒకసారి 36 కప్పులు తయారుచేస్తాం. ప్రస్తుతానికైతే తయారీలో 50 శాతం వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. దాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాం. కప్పులో ఏదైనా లీకేజీ కనిపిస్తే దాన్ని పక్కన పెట్టేస్తాం. ఇప్పటికి కొల్హాపుర్‌లో టీకొట్టు యజమానులకు చేరువ కావడంపై దృష్టి పెట్టాం."

- రాజేశ్ ఖంకార్, ఆంత్రప్రెన్యూర్

స్థానిక అధికారుల నుంచి ఈ ముగ్గురు మిత్రులకు ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారు. ప్లాస్టిక్ చెత్తను నివారించేందుకు ఇదెంతో దోహదపడుతుంది. తినగలిగే కప్పులు, చెంచాల్లాంటి వస్తువులు ప్రజలకు ఎంత తొందరగా చేరువైతే అంత మంచిది.

ఇదీ చదవండి: మహిళా దినోత్సవం వేళ మోదీ కొన్న వస్తువులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.