ETV Bharat / bharat

Punjab Polls 2022: ఎన్నికలకు ముందు కేజ్రీవాల్​ హామీల జల్లు

author img

By

Published : Jan 12, 2022, 2:46 PM IST

Kejriwal
Kejriwal

Punjab Polls 2022: మరికొద్ది రోజుల్లో పంజాబ్​ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు.. వరాల జల్లు కురిపించారు ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. రాష్ట్ర​ అభివృద్ధి కోసం 10 అంశాలతో 'పంజాబ్​ మోడల్​'ను ఆవిష్కరించినట్లు తెలిపారు. మరోవైపు తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది వచ్చే వారం ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

Punjab Polls 2022: మరికొన్ని రోజుల్లో పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీఎం పీఠం దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్​ సహా మిగిలిన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) అదే పంథాలో నడుస్తోంది. 10 సూత్రాలతో 'పంజాబ్​ మోడల్​' పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజల ముందుకొచ్చారు ఆప్​ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.

"ఆప్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు 10 సూత్రాలతో 'పంజాబ్ మోడల్'ను సిద్ధం చేశాం. సంపన్నమైన పంజాబ్‌గా తీర్చిదిద్దుతాం. ఫలితంగా ఉపాధి కోసం కెనడా వెళ్లిన యువత తిరిగి ఇక్కడకే వచ్చి ఉద్యోగం చేసుకునేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం."

- దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

పంజాబ్​ ప్రజలకు కేజ్రీవాల్​ హామీల జల్లు..

  • భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
  • 300 యూనిట్లు వరకు 24/7 ఉచితంగా విద్యుత్​ అందిస్తాం.
  • మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రిస్తాం.
  • రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొల్పుతాం.
  • మతవిద్వేషాల కేసుల్లో బాధితులకు న్యాయం.. నిందితులను కఠినంగా శిక్షించడం.
  • అవినీతి రహిత రాష్ట్రం తీర్చిదిద్దుతాం.
  • 16,000 మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసి.. ఉచితంగా వైద్యం అందిస్తాం.
  • విద్య, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడం.
  • 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలనెలా రూ.1000 ఇస్తాం.
  • రైతుల సమస్యలను పరిష్కరిస్తాం.

'మార్పు కోసం గెలిపించండి'

కొన్నేళ్లుగా కాంగ్రెస్‌, బాదల్​ కుటుంబం మధ్య పొత్తు కొనసాగుతోందని.. వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని దిల్లీ సీఎం ఆరోపించారు. దీనికి ముగింపు పలకడానికి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చేందుకు ఎన్నికల ప్రకటనతో ప్రజలకు అవకాశం వచ్చిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చరణ్​జిత్​ సింగ్​ చన్నీ నేతృత్వంలోని పంజాబ్​ సర్కారుపై కేజ్రీవాల్​ విమర్శలు గుప్పించారు​. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆరోపించారు.

సీఎం అభ్యర్థి ప్రకటన ఎప్పుడంటే..

తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది వచ్చే వారం ప్రకటించనున్నట్లు ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ వెల్లడించారు. సిక్కు వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 14న రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగున్నాయి. ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: యువత బలంతో ఉన్నత శిఖరాలకు భారత్​: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.