ETV Bharat / bharat

జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఆప్​!

author img

By

Published : Mar 11, 2022, 3:46 AM IST

AAP Punjab News
ఆమ్‌ ఆద్మీ

AAP Punjab News: అవినీతికి వ్యతిరేకంగా ఏర్పాటైన ఆమ్‌ ఆద్మీ.. క్రమంగా రాజకీయ పార్టీగా మారింది. ప్రాంతీయ పార్టీగా ఒక రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని పదేళ్లలోనే మరో రాష్ట్రంలోనూ పాగా వేసింది. కాంగ్రెస్‌, భాజపా, కమ్యూనిస్టు పార్టీలకు తప్ప ఏ పార్టీకీ సాధ్యం కాని ఘనతను ఆప్‌ దక్కించుకుంది. అయితే జాతీయ పార్టీగా ఎదగాలని కలలు కంటున్న ఆప్‌ కల సాకారం అవుతుందా? ఒకవేళ జాతీయపార్టీగా మారితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం?

AAP Punjab News: దిల్లీలో వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ క్రమంగా దేశంలో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పంజాబ్‌లో అఖండ విజయంతో జాతీయ పార్టీగా ఎదిగేందుకు బాటలు పరుచుకుంది. ఈగెలుపు అనంతరం మాట్లాడిన ఆప్‌ కన్వీనర్‌ దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్‌ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని ఆప్‌ రూపంలో ప్రత్యామ్నాయం దొరికిందని వ్యాఖ్యానించారు. ఆప్‌ జోరులో మహానేతలంతా కొట్టుకుపోయారని ఆప్‌ను దేశమంతా విస్తరిస్తామని తెలిపారు. ఇవి గెలుపు ఉత్సాహంతో చేసిన వాఖ్యలు అని భావించకుండా నిశితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ప్రాంతీయ పార్టీగా ప్రారంభమై కేవలం పదేళ్ల వ్యవధిలోనే రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం సాధారణ విషయం కాదు.

అన్నా హజారే లోక్‌పాల్‌ డిమాండ్‌తో పుట్టిన ఆప్‌.. ఏర్పాటైన ఏడాదికే 2013లో దిల్లీలో పోటీ చేసి భాజపా తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్‌ రాజీనామా చేశారు. రాష్ట్రపతి పాలన అనంతరం రెండేళ్లకు జరిగిన ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించింది. అంతకుముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ పంజాబ్‌లో 4 స్థానాలు దక్కించుకుంది. 2015 దిల్లీలో గెలిచిన ఊపుతో పార్టీ విస్తరించాలని అప్పుడే ఆప్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 2017లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం ఒక్క శాతం ఓటింగ్‌ కూడా తెచ్చుకోలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 35 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క స్థానం గెలిచింది. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కాకుండా ఎన్నికలకు వెళితే చేదుగుళికలే మిగులుతాయని అర్థం చేసుకుంది.

CM of Punjab 2022: జాతీయపార్టీగా గుర్తింపు సాధించాలంటే కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6శాతం సాధించాలి లేదా ఏవైనా 4 రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటితే ఆప్‌ జాతీయ లక్ష్యాలు నెరవేరినట్లే. అయితే భారీ ప్రచార ఖర్చు, కేజ్రీవాల్‌ నియంతగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దిల్లీలో విద్య, వైద్యం, పార్కుల అభివృద్ధి., ఉచిత విద్యుత్‌ వంటి ప్రజాకర్షక పథకాలు మిగిలిన పార్టీల కన్నా ఆప్‌ భిన్నమని నిరూపించాయి. ఇదే మోడల్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామంటూ ఆప్‌ తన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది.

AAP Punjab Leader: ఇక జాతీయరాజకీయాల్లోకి ఆప్ అడుగుపెడితే మొదట నష్టపోయేది కాంగ్రెస్సే. మరోవైపు భాజపాయేతర, కాంగ్రేసేతర విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలని పశ్చిమ బంగాల్‌ సీఎం మమత బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఆప్‌ కూడా ప్రత్యామ్నాయ వేదికగా అవతరిస్తే, హస్తం పార్టీకి గట్టి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భాజపాను ఓడించాలంటే కాంగ్రెస్‌ సాయం లేకుండా ప్రత్నామ్నాయం ఏర్పాటు సాధ్యం కాదనేది మరికొంతమంది మాట. అలాంటి ప్రయత్నం జరిగినా అది భాజపాకే లబ్ధి చేకూరుస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఈ ఏడాది చివర్లో జరగబోయే రెండు రాష్ట్రాల్లో ఆప్‌ సత్తా చాటితే జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ కీలకంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇదీ చదవండి:

నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన భాజపా.. పంజాబ్​లో ఊడ్చేసిన ఆప్​

'జాతీయవాదం, సుపరిపాలనకే జైకొట్టిన జనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.