వయసు 55.. కంటి చూపు లోపం.. చేసేది కూలీపని.. అయినా గ్రూప్-2లో టాప్!

author img

By

Published : Nov 22, 2022, 5:41 PM IST

visually impaired person cleared Group II exams
visually impaired person cleared Group II exams ()

ప్రభుత్వ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అంటే కత్తిమీద సామే.. నెలలు, సంవత్సరాలు పుస్తకాలతో కుస్తీ పట్టినా పరీక్షలో పాస్ అవుతామన్న నమ్మకం చాలా మందికి ఉండదు. అలాంటిది.. దృష్టిలోపం ఉన్న 55 ఏళ్ల వ్యక్తి.. కూలీ పనిచేస్తూ గ్రూప్2 పరీక్ష పాసయ్యారు. ఆయన కథేంటంటే?

దృష్టిలోపాన్ని లెక్కచేయకుండా.. ఐదు పదుల వయసులో గ్రూప్2 పరీక్షలో ఉత్తీర్ణుడై అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ అనే వ్యక్తి. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్2 ప్రాథమిక పరీక్షలో పాసై.. ప్రశంసలు అందుకుంటున్నారు.

రవిచంద్రన్​ది తంజావూరు జిల్లాలోని అళివైకల్ గ్రామం. 1990లో బీఎస్సీ మ్యాథ్స్​లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. మహాత్మా​ గాంధీ వంద రోజుల పని పథకంలో భాగంగా కూలీ పనితో పాటు.. ఇతర చిన్నాచితకా పనులు చేస్తూ పొట్ట నింపుకుంటున్నారు.

visually impaired person cleared Group II exams
రవిచంద్రన్

"ప్రభుత్వ అధికారిగా మారి, ప్రజలకు సేవ చేయాలని ఉండేది. దీంతో టీఎన్​పీఎస్సీ నిర్వహించే గ్రూప్2 పరీక్ష కోసం సన్నద్ధమయ్యా. కోచింగ్ సెంటర్​కు వెళ్లే స్తోమత నాకు లేదు. దీంతో.. పుస్తకాలు తెచ్చుకొని ఖాళీ సమయాల్లో ఇంట్లోనే పరీక్షకు సిద్ధమయ్యా."
-రవిచంద్రన్

తనతో పాటు కూలీ పనిచేసే పద్మావతి(65) అనే మహిళ సైతం పరీక్ష కోసం సన్నద్ధమమయ్యారు. పుస్తకాల్లోని సమాచారాన్ని బయటకు వినిపించేలా పద్మావతి చదివేవారు. వీటిని వింటూ రవిచంద్రన్.. పరీక్షకు సిద్ధమయ్యేవారు. అయితే, ఒక్కసారి వినగానే రవిచంద్రన్ అన్నీ గుర్తుంచుకునేవారని పద్మావతి చెబుతున్నారు. మే 21న గ్రూప్2 పరీక్ష జరగ్గా.. ఓ సహాయకుడితో వెళ్లి విజయవంతంగా ఎగ్జామ్ రాశారు రవిచంద్రన్. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. ఇందులో ఆయన ఉత్తీర్ణత సాధించారు. రవిచంద్రన్​తో పాటు గ్రామస్థులు సైతం దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితంతో ప్రధాన పరీక్షకు సన్నద్ధమవుతున్నారు రవిచంద్రన్.

visually impaired person cleared Group II exams
పద్మావతితో కలిసి చదువుకుంటున్న రవిచంద్రన్
visually impaired person cleared Group II exams
రవిచంద్రన్ కూలీపని
visually impaired person cleared Group II exams
తోటి కూలీలతో రవిచంద్రన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.