ETV Bharat / bharat

ఆసక్తి రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు.. యూపీపైనే అందరి కళ్లు

author img

By

Published : Jan 9, 2022, 8:16 AM IST

5 states election in 2022
ఐదు రాష్ట్రాల ఎన్నికలు

5 States Election In 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు శంఖారావం మోగింది. ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ విడుదలైంది. అయితే ప్రధానంగా ఉత్తర్​ప్రదేశ్​ తీర్పుపైనే అందరి కళ్లు ఉన్నాయి. సాగుచట్టాలను కేంద్ర సర్కారు ఉపసంహరించుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

5 States Election In 2022: ఐదు రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికలు.. తదుపరి సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌ కానున్నాయి. దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అతిపెద్ద రాష్ట్రం.. ఉత్తర్‌ప్రదేశ్‌ ఈ జాబితాలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 18.34 కోట్లమంది ఓటర్లు ఉన్నప్పటికీ అందులో 82శాతం మంది యూపీవారే. ఎన్నికలకు వెళ్లే 690 అసెంబ్లీ స్థానాల్లో 58శాతం ఆ రాష్ట్రానివే.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఫలితం భవిష్యత్తు భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు. త్వరలో రాజ్యసభలో 74 స్థానాలకు జరగబోయే ఎన్నికలపైనా వీటి ఫలితాలు ప్రభావం చూపిస్తాయి. దానిద్వారా ఎగువసభలో ఎన్డీయేకి సంఖ్యాబలం తగినంత వస్తుందా రాదా అనేది తేలుతుంది.

నూతన రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టొరల్‌ కాలేజ్‌లో ఓట్ల సంఖ్యను ఈ ఎన్నికలు కొంతమేర నిర్ణయిస్తాయి. ఇలాంటి కారణాల వల్లనే ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. సాగుచట్టాలను కేంద్ర సర్కారు ఉపసంహరించుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ప్రస్తుతం ఈ ఐదింటిలో నాలుగుచోట్ల భాజపా అధికారంలో ఉంది.

యూపీ: భాజపా X సమాజ్‌వాదీ

up Assembly Elections
యూపీ

యూపీలో పోటీ భాజపా, సమాజ్‌వాదీ పార్టీ మధ్యే కనిపిస్తోంది. బరిలో బీఎస్పీ, కాంగ్రెస్‌, ఆప్‌ లాంటి పార్టీలు కనిపిస్తున్నా రాజకీయ, సామాజిక వర్గాల బలాబలాలను అనుసరించి పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యే నెలకొంది. 2012 ఎన్నికల వరకు అక్కడ ఎస్పీ, బీఎస్పీ తలపడుతూ వచ్చినా 2014లో మోదీ రాకతో పరిస్థితులు మారిపోయాయి. పెద్దనోట్ల రద్దు, మెరుపుదాడులు వంటి నిర్ణయాలు 2017 ఎన్నికల్లో యూపీలో భాజపాను 312 స్థానాల్లో ఎవ్వరికీ అందనంత ఎత్తున కూర్చోబెట్టాయి. ఐదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు ప్రచారాన్ని ఉద్ధృతం చేసి ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తమ పార్టీలోని వర్గాలను, చిన్నాచితకా పార్టీలను మచ్చిక చేసుకొని గోదాలోకి దిగారు. మునుపటి స్థాయిలో కాకపోయినా పైచేయి కాషాయ దళానిదేనని ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతుండటంతో ఆ వర్గం ఉత్సాహంతో ఉంది.

చిన్నపార్టీలు దన్నుగా..

అఖిలేశ్‌ తన వ్యక్తిగత ప్రతిష్ఠ పెట్టుబడిగా ఒంటరి యాత్ర చేస్తున్నారు. సంస్థాగత బలం లేని కాంగ్రెస్‌లాంటి పెద్ద పార్టీ కంటే సామాజిక బలం ఉన్న చిన్నపార్టీలతో కలిసి వెళ్లడం మేలన్న ఉద్దేశంతో ఆయన జాట్‌లలో ప్రాబల్యం ఉన్న ఆర్‌ఎల్‌డీ, సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ వంటివాటిని కలుపుకొనిపోయేందుకు సిద్ధమయ్యారు. ప్రియాంకాగాంధీ యూపీలో రాజకీయ ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఆ పార్టీ పరిస్థితి మెరుగ్గా కనిపించడంలేదు. ఆమె జాతీయస్థాయి నేతగా గానీ, రాష్ట్ర నేతగా గానీ ప్రజల్లో ముద్ర వేయలేకపోవడం ఆ పార్టీకి లోటు. బీఎస్పీకి అండగా ఉంటున్న దళిత వర్గం ఇప్పుడు భాజపాకు అదనపు బలంగా మారుతోంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌.. యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నా స్థానిక నాయకత్వ లేమి ఆ పార్టీకి గుదిబండగా మారింది. మోదీ ప్రతిష్ఠ, యోగి పాలన, అయోధ్య రామమందిర నిర్మాణం లాంటి అభివృద్ధి పనులను భాజపా నమ్ముకొంది.

పంజాబ్‌: పొత్తుల ఎత్తులు

punjab Assembly Elections
పంజాబ్

ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో సీట్ల పరంగా యూపీ తర్వాత పంజాబ్‌ నిలుస్తుంది. అక్కడ కాంగ్రెస్‌పార్టీ అంతర్గత కలహాల కారణంగా అమరీందర్‌ సింగ్‌ నాయకత్వాన్ని పోగొట్టుకొని నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ, సీఎం చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీలపై ఆధారపడింది. కురువృద్ధుడు ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ నేతృత్వంలోని అకాలీదళ్‌- బీఎస్పీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌, భాజపా, కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌, సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీ (సంయుక్త్‌)లు కలిసి పోటీచేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఏళ్లతరబడి ఎన్డీయే భాగస్వామిగా ఉన్న అకాలీదళ్‌.. ఇటీవల సాగుచట్టాల కారణంగా భాజపా నుంచి బయటికొచ్చి బీఎస్పీతో పొత్తుపెట్టుకొంది. ఆమ్‌ఆద్మీకి స్థానికంగా చెప్పుకోదగ్గ నాయకుడు లేరు. కాంగ్రెస్‌లో నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.

ఉత్తరాఖండ్‌: ఆనవాయితీపైనే నమ్మకం

Assembly Elections
ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌, భాజపాల మధ్యే పోటీ కనిపిస్తున్నప్పటికీ ఆప్‌ సయితం ఉనికిని చాటుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీగా వస్తోంది. దానిపైనే ప్రతిపక్షాలు నమ్మకం పెట్టుకొన్నాయి. అయిదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చాల్సి రావడం భాజపాకు ఇబ్బందికరంగా మారింది. ప్రధాని మోదీపై ఆశలు పెట్టుకుని కమలనాథులు ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్‌ మాత్రం మాజీ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ను నమ్ముకొంది.

మణిపుర్‌: ఎన్టీయే అభివృద్ధి మంత్రం

manipur
మణిపుర్

మణిపుర్‌లో గత ఎన్నికల్లో యూపీయే 28, ఎన్డీయే 21 సీట్లు గెలుచుకున్నప్పటికీ భాజపా నాయకత్వం చాకచక్యంగా వ్యవహరించి మిత్రపక్షాలను, స్వతంత్ర అభ్యర్థుల్ని కలుపుకొని అధికారాన్ని చేజిక్కించుకొని అయిదేళ్లు సుస్థిర ప్రభుత్వాన్ని సాగించింది. ఇప్పుడు అదే ఆ పార్టీ బలం.

గోవా: తృణమూల్‌ ప్రత్యేక దృష్టి

Assembly Elections
గోవా

గోవాలో రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి. గతసారి 17 స్థానాలతో అతిపెద్ద కూటమిగా యూపీయే నిలిచినప్పటికీ 13 సీట్లున్న ఎన్డీయే కూటమి అధికారాన్ని ఎగరేసుకుపోయింది. నాయకత్వ లోపంతో కాంగ్రెస్‌ సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎవ్వరూ ఊహించని రీతిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అక్కడ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది. కాంగ్రెస్‌ నేతలను తనవైపు లాక్కొని నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌కు ప్రతి నియోజకవర్గంలో భాజపాతో తలపడే అభ్యర్థులున్నారు. తృణమూల్‌ మాత్రం ఇతర పార్టీల నుంచి తన గూటికి లాక్కున్నవారిపై ఆధారపడి పోరాడాలని చూస్తోంది.

ఇదీ చూడండి: ఈసీ ఎన్నికల షెడ్యూల్​పై ఏ పార్టీలు ఏమన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.