ETV Bharat / bharat

'మతహింస లావాలాంటిది.. నేనూ అల్లర్ల బాధితుడినే'

author img

By

Published : Nov 11, 2021, 7:24 AM IST

Kapil Sibal
కపిల్‌ సిబల్‌

మత కల్లోలాలు వ్యవస్థీకృతమైన హింస వంటివని పేర్కొన్నారు సీనియర్‌ న్యాయవాది, కాంగ్రెస్​ నేత కపిల్‌ సిబల్‌. మత హింసను లావాతో పోల్చారు. లావా నేలపై పారినప్పుడు అది మంటతో పాటు, మరకను మిగుల్చుతుందన్నారు. భవిష్యత్తులో ప్రతీకారాలు తీర్చుకోవడానికి సారవంతమైన భూమిగా మారుతుందని.. తానూ బాధితుడినేనని సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు సిబల్‌.

మత హింస అగ్ని పర్వతం నుంచి వెలువడే లావా లాంటిదని సీనియర్‌ న్యాయవాది, కాంగ్రెస్​ నేత కపిల్‌ సిబల్‌ అన్నారు. 2002నాటి గుజరాత్‌ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోదీ సహా 64 మందికి 'సిట్‌' క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం తరఫున బుధవారం ఆయన వాదనలు వినిపిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ వాదనలు వింటోంది.

"మత కల్లోలాలు వ్యవస్థీకృతమైన హింస లాంటివి. మత హింస అనే లావా నేలపై పారినప్పుడు అది మంటతో పాటు, మరకను మిగుల్చుతుంది. భవిష్యత్తులో ప్రతీకారాలు తీర్చుకోవడానికి సారవంతమైన భూమిగా మారుతుంది. ఈ హింస కారణంగానే నేను మా అమ్మమ్మ, తాతలను పాకిస్థాన్‌లో కోల్పోయాను. నేనూ బాధితుడినే. దీనిపై నేను ఎవరో ఒకరిపై ఆరోపణలు చేయడం లేదు. మత హింస ఆమోద యోగ్యం కాదు.. సహించేది లేదన్న సందేశం మాత్రం ప్రపంచానికి అందాల్సి ఉంది. చట్టబద్ధమైన పాలన ఉండాలా, ఉన్మాదుల ఇష్టారాజ్యం కావాలా అని తేల్చుకోవాల్సిన చరిత్రాత్మక సమయం ఆసన్నమయింది" అని అన్నారు. అమ్మమ్మ, తాతలను ప్రస్తావించిన సమయంలో ఆయన ఉద్వేగానికి గురయ్యారు. ఇది స్పష్టంగా ఆయన ముఖంలో కనిపించింది.

గుజరాత్‌కు చెందిన దివంగత కాంగ్రెస్‌ నాయకుడు ఇషాన్‌ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గోద్రాలో రైలు దుర్ఘటన జరిగిన మరుసటి రోజున అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న అల్లర్లలో జాఫ్రీ సహా 68 మంది మరణించారు. దీనిపై విచారణకు ఏర్పాటయిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) మోదీ సహా 64 మందికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. నివేదికను మెజిస్టీరియల్‌ కోర్టు ఆమోదించింది. దీనిని సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. దాంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దీన్ని కోర్టులు గమనించడం లేదని, అందుకే జకియా జాఫ్రీ ఫిర్యాదు చేశారని సిబల్‌ తెలిపారు. అధికారుల క్రియారాహిత్యం, నేరం చేసిన వారితో పోలీసులు కుమ్మక్కవడం, విద్వేషపూరిత ప్రసంగాలు, ఆకస్మికంగా హింస చోటుచేసుకోవడం వంటి అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయని వివరించారు.

ఇదీ చూడండి: అంతర్జాతీయ సౌరకూటమిలోకి అమెరికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.