నరసాపురంలో టీడీపీ, జనసేన పార్టీల ఫ్లెక్సీలు తొలగింపు - ఆందోళన
Removal of TDP Janasena Party Flexis in Narasapuram : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ-జనసేన పార్టీనేతల ఫ్లెక్సీల తొలగింపుపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు తొలగించకుండా.. విపక్షాల బ్యానర్లు తొలగించిన మున్సిపల్ అధికార్లు తీరుపై టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అధికారులు తీరును నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఆందోళన చేపట్టారు. అఖిలపక్షం కమిటీ ఏర్పాటు చేసి చర్చించిన తర్వాతే ఫ్లెక్సీలు తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
వ్యాపార సంస్థలకు చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సామాన్యుల వద్ద ముక్కుపిండి పన్ను వసూలు చేసే అధికారులు.. అధికార పార్టీ నేతలకు చెందిన ఫ్లెక్సీలను మాత్రం చూసీ..చూడనట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయం పోతున్నా.. అధికారులు ఏందుకు పట్టించుకోరని ప్రజలు నిలదీస్తున్నారు. ఇవే ఫ్లెక్సీలను ప్రతిపక్షాలు ఏర్పాటుచేస్తే అనుమతుల్లేవంటూ సిబ్బంది ఆగమేఘాలపై తొలగిస్తున్నారని ప్రతి పక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే వైసీపీ నాయకులు రూపాయి చెల్లించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా.. అధికారులు మాత్రం వాటి జోలికి వెళ్లడం లేదు. ఏందుకంటే వాటిని తొలగిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు కన్నెర్ర చేస్తారనే సిబ్బంది భయమే అందుకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.