గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముఠా అరెస్టు - 140 కిలోలు స్వాధీనం
Police Seized Illegal Ganja in Alluri District : అల్లూరి జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాని నర్సీపట్నం గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నం ఏఎస్పీ అధిరాజ్ సింగ్ రానా తెలిపిన వివరాలు ప్రకారం.. కేరళకు చెందిన అరుణ్, రెంజు, ఆనంద్ లు వాహనాన్ని కిరాయికి తీసుకుని కేరళ నుంచి విశాఖపట్నం వచ్చారు. ధారకొండలో ఉన్న కోర అర్జున్ అనే వ్యక్తి నుంచి కిలో రూ. 2000 చొప్పున 140 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. ఈ గంజాయిని కేరళకు తీసుకు వెళ్లేందుకు నర్సీపట్నం మీదుగా కారులో వెళ్లారు.
అదే సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు నర్సీపట్నం సమీపంలోని నెల్లిమెట్ట వద్ద కాపు కాశారు. పోలీసులను చూసిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కాని, పోలీసులు వారిని వెంబడించి పట్టుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఏ1గా అరుణ్, ఏ2 రెంజు, ఏ3 ఆనంద్, ఏ4 కోర అర్జున్ని చేర్చారు. వీరిని రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.