దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

author img

By

Published : Nov 24, 2022, 7:18 AM IST

how to get healthy and strong teeth

సాధారణంగా చాలా మంది తమ నోటి ఆరోగ్యం మీద అంతగా దృష్టి పెట్టరు. పంటి నొప్పి వంటివి తలెత్తితే గానీ వాటి ప్రాధాన్యమేంటో ఎవరికీ అర్థం కాదు. అందుకే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దంతాలను శుభ్రంగా ఉండాలంటే పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఓ సారి తెలుసుకుందాం.

నోటి ఆరోగ్యం మీద మనం అంతగా దృష్టి పెట్టం. పంటి నొప్పి వంటివి తలెత్తితే గానీ దీని ప్రాధాన్యమేంటో అర్థం కాదు. ఉదయం నిద్ర లేచాక పళ్లు తోముకోవటంతోనే చాలామంది సరిపుచ్చుతుంటారు. నిజానికి రాత్రి పడుకోబోయే ముందూ బ్రష్‌తో పళ్లు తోముకోవటం తప్పనిసరి. ఆహార అలవాట్ల పరంగానూ జాగ్రత్తగా ఉండాలి.

అంటుకుపోయే పదార్థాలకు దూరం
ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే పళ్లకు అంటుకుపోయే పదార్థాలు ఒక పట్టాన పోవు. దీంతో అక్కడ హానికర బ్యాక్టీరియా పెరుగుతుంది. ఒకవేళ చాక్లెట్ల వంటివి తిన్నప్పుడు అవి అంటుకుపోతే పళ్లను పూర్తిగా శుభ్రం చేసుకోవాలని మరవద్దు.

పుక్కిలించటం
భోజనం చేసిన ప్రతీసారీ నీటితో బాగా పుక్కిలించాలి. దీంతో పళ్ల మధ్యలో చిక్కుకున్న పదార్థాలు తొలగిపోతాయి. లేకపోతే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదముంది.

పుల్లటి పదార్థాలు మితంగా
నిమ్మ, ద్రాక్ష, పైనాపిల్‌, దానిమ్మ వంటి పుల్లటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిలోని ఆమ్లంతో పళ్ల మీది ఎనామిల్‌ దెబ్బతినే ప్రమాదముంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరం. ఇలాంటి పుల్లటి పదార్థాలను తిన్నప్పుడు నీటితో పుక్కిలించాలి. దీంతో ఆమ్లం గాఢత తగ్గుతుంది. అలాగే వెంటనే పళ్లను తోముకోకూడదు. అరగంటయ్యాకే తోముకోవాలి. ఆలోపు ఎనామిల్‌ కుదుటపడుతుంది.

నీరు ఎక్కువగా
మనకు నీరే అమృతం. తగినంత నీరు తాగితే ఆరోగ్యం అన్నిందాలా బాగుంటుంది. ఇది నోరు తడారకుండా చూస్తూ పళ్లకూ మేలు చేస్తుంది.

గమ్‌
చూయింగ్‌ గమ్‌ను నమిలితే ముఖ కండరాలకు వ్యాయామం కలుగుతుంది. రక్త ప్రసరణా పుంజుకుంటుంది. ఒత్తిడినీ తగ్గిస్తుంది. అయితే గమ్‌లోని చక్కెర పళ్లను దెబ్బతీస్తుంది. కాబట్టి చక్కెరలేని గమ్‌ను నమలటం మంచిది. దీంతో నోట్లో లాలాజలం బాగా ఊరుతుంది. ఇది పళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.