ETV Bharat / sukhibhava

మేల్కోవాల్సిందే: కరోనా మరణాలు పురుషుల్లోనే ఎక్కువ!

author img

By

Published : Apr 12, 2020, 7:08 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

ఏదైనా ఆపద ముంచుకొచ్చినపుడు- 'అది నన్నేం చేయలేదు' అంటూ అతివిశ్వాసాన్ని ప్రదర్శించే వారిలో మగవాళ్లు ముందుంటారు. ఇప్పుడు కరోనా విషయంలోనూ ఇలాంటి అతివిశ్వాసాన్నే ప్రదర్శిస్తూ బీరాలు పోయేవారు, విచ్చలవిడిగా బయట తిరిగేవారు కోకొల్లలు. అయితే... కరోనా కాఠిన్యం పురుషులనే ఎక్కువగా బలిగొంటోందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది.

Corona mortality is higher among men
కరోనా మరణాలు పురుషుల్లోనే ఎక్కువ!

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నమోదవుతున్న కేసులు, మరణాల గణాంకాలను పరిశీలిస్తే మగవారే ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నట్లు ఇప్పటిదాకా సాగిన 32 అధ్యయనాల్లో తేలింది. ఈ పరిణామానికి కొన్ని శాస్త్రీయ అంశాలు దోహదంచేస్తే, నిర్లక్ష్య ధోరణి మరో కారణంగా నిలుస్తోంది. ఈ సమయంలో వైరస్‌ సోకకుండా నివారణ చర్యలను పాటించడమే తక్షణ కర్తవ్యమని వైద్య నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం... కరోనా కారణంగా మహిళల కంటే 50 నుంచి 80 శాతం ఎక్కువ మరణాలు పురుషుల్లో సంభవిస్తున్నాయి. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలోనూ మహిళల కంటే పురుషులే ఎక్కువ చనిపోతున్నారు. కరోనా కారణంగా సగటున ప్రతి పదివేల మందిలో 43 మంది పురుషులు, 23 మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు.

‘ఆమె’ జన్యుపరంగా ధన్యురాలు

వ్యాధులపై మహిళల రోగ నిరోధక వ్యవస్థ భీకర పోరు సాగించడానికి కారణం వారి శరీరాల్లోని జన్యువులని ఓ పరిశోధన తేల్చింది. దీనిపై ఇంకా అధ్యయనాలు సాగుతున్నాయి. మెదడు, రోగ నిరోధక వ్యవస్థలకు ‘ఎక్స్‌’ క్రోమోజోములు చక్కని సహాయకారులు. స్త్రీలల్లో రెండు చొప్పున ‘ఎక్స్‌’ క్రోమోజోములుంటే... పురుషుల్లో ఒక ‘ఎక్స్‌’, ఒక ‘వై’ క్రోమోజోము ఉంటాయి. అన్ని రకాల సాంక్రమిక వ్యాధులను అడ్డుకునేందుకు త్వరితగతిన స్పందించే దృఢమైన రోగ నిరోధక వ్యవస్థ మహిళల సొంతం. పురుషుల రోగ నిరోధక వ్యవస్థ ఇందుకు భిన్నం. హెపటైటిస్‌ బి, సి లాంటి వైరస్‌లూ స్త్రీలకు తక్కువగా సోకుతుంటాయి.

ఆ కిటుకులు తెలీక...

వ్యాధుల నివారణ, మందులు కనుగొనే క్రమంలో ప్రాథమికంగా పురుషుల శరీరాలు, పురుషుల కణజాలాలు, పురుషుల అవయవాలపైనే శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తున్నారు. మహిళలపై ఇవి చాలా పరిమితం. అందుకే మహిళలపై వ్యాధుల ప్రభావం ఎలా ఉంటోంది?... వ్యాధుల్ని వారి శరీరాలు ఎలా ఎదుర్కొంటున్నాయో స్పష్టంగా తెలుసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోలేని పరిస్థితి తలెత్తింది.

సార్స్‌కూ బలయ్యారు

2003లో సార్స్‌ వైరస్‌ విజృంభించినప్పుడు మరణించిన వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ. ఇందుకు మగవారిలోని ధూమపానం అలవాటు ముఖ్య కారణమైందని ఓ వాదన ఉంది. అప్పట్లో సార్స్‌ సోకి మగ ఎలుకలు సైతం పెద్ద సంఖ్యలో ప్రాణాలు వదలడం గమనార్హం. అదే సమయంలో ఆడ ఎలుకల్లోని ఈస్ట్రోజన్‌ హార్మోన్‌... సార్స్‌ను విజయంతంగా తిప్పికొట్టిందని అమెరికాకు చెందిన లోవా యూనివర్సిటీ 2016లో నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్రస్తుతం అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ కూడా సార్స్‌ కుటుంబానికి చెందిందే కాబట్టి పురుషుల్నే ఎక్కువగా బలిగొంటోందని కొందరు నిపుణులు సూత్రీకరిస్తున్నారు.

అలాగైతే అంతే సంగతులు

కరోనాతో తీవ్రమైన ముప్పు పొంచి ఉందని తెలిసినా కొందరు పురుషులు దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. జాగ్రత్తల్ని పట్టించుకోని వారి ధోరణి ప్రమాదాన్ని కొనితెస్తోంది. కరోనా సోకిన 3 వేల మంది పురుషులపై ఇటీవల ఓ అధ్యయనాన్ని నిర్వహించగా... వారిలో సగం మందికి పైగా మరుగుదొడ్డికి వెళ్లొచ్చాక సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోలేదని తేలింది. గుండె జబ్బులు, క్యాన్సర్లు, శ్వాసపరమైన సమస్యలు పురుషుల్లోనే ఎక్కువ. అందుకే కరోనా తీవ్ర ప్రభావం చూపుతూ మరిన్ని మరణాలకు కారణమవుతోంది.

పొగబారుతున్న ప్రాణాలు

పురుషుల్లో ధూమపానంతో శ్వాసపరమైన సమస్యలు ఎదుర్కొనే వారు ఎందరో. పొగతాగే వారి ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉంటుందని ఇలాంటి వారికి కరోనాతో ప్రాణహాని ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. చైనాలో కరోనా కారణంగా మహిళల కంటే ఎక్కువగా పురుషులు మరణించినట్లు మరో అధ్యయనంలో తేలింది. ఓ అంచనా ప్రకారం చైనాలో 52% మంది పురుషులు పొగరాయుళ్లు అయితే మహిళల్లో ధూమపానం చేసేది 3% మందే. దక్షిణ కొరియాలోనూ ఇదే పరిస్థితి ఉందని ‘ద గార్డియన్‌’ పత్రిక విశ్లేషించింది. అతిగా మద్యం తీసుకునే కొందరు మగవారిలో చికిత్సల సమయంలో ఇచ్చే మందులు పెద్దగా ప్రభావం చూపడం లేదని వైద్యులు చెబుతున్నారు.

Last Updated :May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.