ETV Bharat / state

Rayalaseema Canals Ruins: పంట కాలువలపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం

author img

By

Published : Jul 13, 2023, 9:35 AM IST

Rayalaseema Canals Present Situation: రాయలసీమ ఆయనకు చాలా ఇచ్చింది. పురిటిగడ్డ పులివెందుల మొదలుకుని చిత్తూరు వరకూ మెజార్టీ సీట్లు కట్టబెట్టింది. వైఎస్సార్సీపీకి విజయ హారతి పట్టిన అధికార దండం అప్పగించింది. కానీ ఆయన సీమకు తిరిగి ఏమిచ్చారు.? కనీసం పంట కాల్వలూ బాగు చేసి ఇవ్వలేకపోయారు! లక్షల మంది రైతుల ఆశలు మోసుకెళ్లే తుంగభద్ర కాలువ దగ్గర నుంచి కేసీ కెనాల్ వరకూ పంట కాల్వలు శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాలువల నిండా గుర్రపు డెక్క, పిచ్చిమొక్కలే! ధ్వంసమైన లైనింగ్​లకు కాస్త కాంక్రీట్ వేసే గతిలేదు. నాలుగేళ్లలో కనీస మరమ్మతులు చేయించే దిక్కులేదు. కాల్వల వైపు చూస్తే కన్నీళ్లు తప్ప.. నీరుపారేలా లేదని రైతులు ఘోషిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

పంట కాలువలపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం

No Developmental Works In Rayalaseema Canals : పేరుకుపోయిన పాలిథీన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ సీసాలు, చెత్తచెదారం మురుగు కాలువలో ఇవన్నీ సహజమేకదా అనుకుంటున్నారా? అలా అనుకుంటే కాలువలే కాలేసినట్లే! ఇది మురుగు కాల్వకానే కాదు! లక్షలాది ఎకరాలను తడపాల్సిన సాగునీటి కాలువ! సీఎం జగన్ ఇలాకా కడపను ఆనుకుని ప్రవహించే దీన్ని కేసీ కెనాల్‌ అంటారు. కడప నగర పరిధి వరకూ ఇదో డంపింగ్‌ యార్డులా తయారైంది.

కడప నగరం దాటాక కూడా ఇది పంటకాల్వని నమ్మడం కష్టమే. అంతలా పిచ్చిచెట్లు కమ్మేశాయి. నాచు పట్టేసింది. ఇంకాస్త ముందుకెళ్తే ఇది పంట కాల్వేనని నమ్మకం కుదిరినా ఇందులో నీళ్లెలా పారతాయనే సందేహం వస్తుంది. రాజుపాలెం, మైదుకూరు, ఖాజీపేట, చెన్నూరు, కడప పరిధిలోఉన్నకేసీ కెనాల్‌ను నమ్ముకుని రైతులు ఏటా 35 వేల హెక్టార్లలో పంటలు వేస్తారు.కాల్వ నిర్వహణ లేక దాదాపు 10 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందని పరిస్థితి. కాల్వ కనుచూపుమేరలో గుర్రపుడెక్క మయమైంది. పూడిక తీయక మట్టిదిబ్బలు పేరుకుపోయాయి. కాల్వ లైనింగ్‌లు దెబ్బతిన్నా నాలుగేళ్లలో మరమ్మతులకు దిక్కులేదు.

సీఎం సొంత జిల్లాలోని ఇతర పంటకాల్వల పరిస్థితీ అధ్వానంగానే ఉంది. ఇది జమ్మలమడుగు పట్టణం నుంచి ప్రవహించే ఉత్తర ప్రధాన కాలువ. మైలవరం, జమ్మలమడుగు, పెద్దముడియం మండలాలకు జీవనాడి. 34 కిలోమీటర్ల పొడవైన ఉత్తరకాలువను జమ్ము కమ్మేసింది. ఏపుగా పెరిగినా తొలగించడం చేత కాలేదు. ఇక సీఎం సొంత నియోజకవర్గం పులివెదులలోని లింగాల కుడి కాలువ, సీబీసీ కాలువల నిర్వహణా అస్థవ్యస్తమే. వైఎస్సార్ జిల్లాలో 1250 కిలోమీటర్లమేర పంట కాల్వలు ఉంటే నిర్వహణ, మరమ్మతులకు 1200 కోట్లు కావాలని అధికారులు లెక్కగట్టారు. కానీ సొంత జిల్లాకు జగన్‌ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 140 కోట్లే. ఫలితంగా 350 కిలోమీటర్ల మేర కాలువలు మరమ్మతులకు నోచుకోక దెబ్బతిని ఉన్నాయి.

కర్నూలు జిల్లా పరిధిలోని కేసీ కాలువ. కేసీ కెనాల్‌ మొత్తం 306 కిలోమీటర్లుంటే అందులో 234 కిలోమీటర్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉంది. నాలుగేళ్లలో నిర్వహణ గురించి ఆలోచించినపాపాన పోలేదు. చాలా వరకూ కట్టలు బాగా దెబ్బతిన్నాయి. మల్యాల నుంచి ముచ్చుమర్రి వరకూ పలు చోట్ల చెట్లు పెరిగి లైనింగ్ పగుళ్లిచ్చాయి. కొన్నిచోట్ల ఏకంగా కుంగింది. దాదాపు 60 కిలోమీటర్ల మేర కేసీ కెనాల్‌ దెబ్బతిందని అధికారులే చెప్తున్నారు. కానీ మరమ్మతులకు గతిలేదు.

మల్యాల నుంచి ముచ్చుమర్రి వరకూ కేసీ కాలువ వెంట వెళ్తుంటే చాలా చోట్ల పెద్ద పగుళ్లు దర్శనమిచ్చాయి. లైనింగ్‌కొట్టుకుపోయి కరకట్ట అడుగునున్న మట్టి సైతం కనిపిస్తోంది. లైనింగ్ పగుళ్ల మధ్య నుంచి తుమ్మచెట్లు, ఇతర పిచ్చిమొక్కలు మొలిశాయి. అవి పెద్దవై వాటి వేర్లు లైనింగ్‌ను పెకిలిస్తున్నా తొలగించాలనే స్పృహ ప్రభుత్వానికి లేదు. సుంకేసుల నుంచి 3వేల 850 క్యూసెక్కుల.. నీరు వదలాల్సిన అధికారులు కాలువ లైనింగ్ దెబ్బతిన్న కారణంగా 3వేల క్యూసెక్కులే విడుదల చేస్తున్నారు. అంతకుమించితే కరకట్టకు గండ్లుపడి పరివాహక గ్రామాల్ని ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. అలాగని తక్కువ నీరు వదిలితేచివరి ఆయకట్టుకు చుక్కనీరందడంలేదు.

ఇదీ నంద్యాల జిల్లా పాణ్యం మండలానికి సాగునీరు అందించే.. ఎస్ఆర్​బీసీ పంట కాలువల శిథిలావస్థ. గోరుకల్లు జలాశయం నుంచి నీరందించే ఈ కాలువలో కంపచెట్లు, జమ్ము పెరిగి పూడిపోతున్నాయి. మరమ్మతులు చేయకపోవడం వల్ల నీరు వదలినప్పుడు లీకవుతోంది. పక్కనున్న పొలాల్ని ముంచెత్తుతోందని రైతులు వాపోతున్నారు. అధికారులకు మొరపెట్టుకుంటే మరమ్మతులకు డబ్బులెక్కడవని ఎదురు ప్రశ్నించే పరిస్థితి.

ఇది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో 50 కిలోమీటర్ల మేర ఉన్న తెలుగు గంగ పంట కాలువ దుస్థితి. నీటి ప్రవాహం ఉన్నా కాలువలు సరిగాలేక రైతులు సక్రమంగా వినియోగించుకోలేని దుస్థితి. చాలాచోట్ల కల్వర్టులు శిథిలం అయ్యాయి. కాల్వలలో రాళ్లు పడి నీళ్లు ముందుకెళ్లేలాలేదు. పక్కనున్న రోడ్డు లెవల్‌కు కాలువ పూడిపోయింది. 21 బ్లాక్ నుంచి 37వ బ్లాక్ వరకూ ప్రస్తుతం 18 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఈ నిధులు మరమ్మత్తులకు చాలవని చెప్తున్నారు. నంద్యాల జిల్లా పరిధిలో తెలుగుగంగ కాలువ ద్వారా లక్షా 14 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ ఉప కాలువలకు గండ్లు పడితే ఇదిగో ఇలా ఇసుక బస్తాలు అడ్డేయడం మినహా నాలుగేళ్లలో శాశ్వత మరమ్మతులే చేయించలేదు.

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతలో లక్షన్నర ఎకరాలకు నీరిచ్చే తుంగభద్ర దిగువ కాలువ స్వరూపమే కోల్పోతోంది. కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని ఎస్ఎల్​సీ పంట కాలవలు దయనీయంగా ఉన్నాయి. కాలువ దడులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ నిర్లక్యంతో శ్రీశైలం కుడిగట్టు కాలువ లైనింగ్‌ కూడా ముళ్లపొదలు పెరిగి శిథిలం అవుతోంది. కర్నులు జిల్లా జిల్లాలో కాలువ నిర్వహణకు 177 కోట్లు కావాల్సి ఉంటే ప్రభుత్వం 123 కోట్లు ఇచ్చింది. మరమ్మతు పనులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. అవెప్పటికి పూర్తి చేస్తారో, చివరి ఆయకట్టు రైతులకు ఎప్పుడి నీరిస్తారో తెలియడం లేదు.

ఇక కరవుకు చిరునామాగా చెప్పుకునే అనంతపురం జిల్లా రైతుల పైనా ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. ఇది అనంత జిల్లాకు గుండెకాయలాంటి తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ. దీనికి బైపాస్‌ సర్జరీ చేయాల్సిన సమయం దాటిపోయినా కనీసం ప్రాథమిక చికిత్స చేసిన పరిస్థితి కూడాలేదు. తూముల గేట్లు తుప్పుట్టాయి. నాలుగేళ్లుగా గ్రీజు పెట్టే దిక్కులేకుండా పోయింది. ఉప కాలువలకు నీరు మళ్లించేచోట గేట్లు ఎప్పుడో విరిగిపోయాయి. ప్రధాన కాలువపై 4వంతెనలు కూలాయి, శిథిలాలు అడ్డదిడ్డంగా పడి నీరుపారడం లేదు.

అనంత జిల్లాలో లక్షా 45 వేల ఎకరాల సాగుకు ఈ కాలువే ఆధారం. తుంగభద్ర జలాశయం నుంచి ఈ కాలువ ద్వారా 32 టీఎంసీల నీరు తీసుకోవాలి. కానీ నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో అది జరగలేదు. కాలువ ప్రవాహ సామర్థ్యం 2వేల500 క్యూసెక్కులు కాగా గట్లు బలహీనపడడంతో 1800 క్యూసెక్కులకు మించడం లేదు. కాలువను ఆధునికరించి నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 4వేల500 క్యూసెక్కులకు పెంచేందుకు టీడీపీ ప్రభుత్వం రూ.480 కోట్లతో పనులు చేపట్టింది. 60 శాతానికి పైగా పనులు పూర్తి చేసింది. వైఎస్సార్​సీపీ వచ్చాక మిగతా పనులకు 600 కోట్లతో అంచనాలు రూపొందించినా. నాలుగేళ్లుగా టెండర్లు పిలవలేదు. హెచ్ఎల్సీలో ప్రధాన కాలువతోపాటు 15 డిస్ట్రిబ్యూటరీల నిర్వహణకు..ఏటా రూ. 15 కోట్లు అవసరం కాగా నాలుగేళ్లలో జగన్ సర్కారు పైసా కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కనీస మరమ్మతులైనా చేపట్టలేదు. చివరి ఆయకట్టు రైతులు గుండెలు బాదుకుంటున్నా అరణ్యరోదనే అవుతోంది. చేసేదేమీ లేక బోర్లు వేసుకుంటున్నారు.

సొంత జిల్లాలో పంట కాల్వలను ఇలా గాలి కొదిలేసిన జగన్‌ సర్కార్‌.. ప్రతిపక్ష నేత ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కాల్వలనైనా బాగుచేశారా అంటే..అదీ లేదు. చిత్తూరు జిల్లాలోని పశ్చిమ మండలాలను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం చేపట్టిన హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు వైకాపా అధికారంలోకి వచ్చాక పడకేశాయి. అప్పటి సీఎం చంద్రబాబు హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ నిర్మాణాలు చేపట్టారు. 2016లో పనులు ప్రారంభించి 90 శాతం పనులు పూర్తిచేయించారు.

పలమనేరు నియోజగవర్గం వరకూ కృష్ణా జలాలు తెప్పించారు. 123 కిలోమీటర్ల కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనుల్లో 121 కిలోమీటర్ల పనులు గత ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. మిగిలిన 2 కిలోమీటర్ల కాలువను వైకాపా ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో తవ్వించలేకపోయింది. గత ప్రభుత్వం తవ్వించిన కాలువ నిర్వహణ కూడా చేయించలేక అందులో మొలిచిన కలుపు మొక్కలను కళ్లప్పగించి చూస్తోంది. నెల రోజుల్లో హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పనులు పూర్తిచేసి సాగునీరు అందిస్తామని కుప్పం సభలో ఆర్భాటంగా ప్రకటించిన జగన్‌.. ఆర్నెళ్లు గడిచినా మాట నిలబెట్టుకోలేదు. వైనాట్ కుప్పం అని స్లోగన్‌లు కట్టిపెట్టి పనులు చేయించాలని స్థానిక రైతులు సూచిస్తున్నారు.

ఇదీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయలసీమలోని పంట కాల్వల దుస్థితి. కాల్వల మరమ్మతులు చేయించక సీమ జిల్లాల్లోనే దాదాపు ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందడంలేదు. రైతు ప్రభుత్వమని ఊదరగొట్టే జగన్‌.. సీమ రైతుల కన్నీళ్లు తుడవలేకపోతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.