Budameru Canal: దశాబ్దాలుగా దుర్వాసనతో జీవనం.. ఇంకెప్పుడు బాగుపడతాయి సార్ వాళ్ల జీవితాలు..?
Published: May 24, 2023, 10:08 AM


Budameru Canal: దశాబ్దాలుగా దుర్వాసనతో జీవనం.. ఇంకెప్పుడు బాగుపడతాయి సార్ వాళ్ల జీవితాలు..?
Published: May 24, 2023, 10:08 AM
Modernization of Budameru Canal: బుడమేరు కాలువ ఆధునికీకరణ విజయవాడ ప్రజలకు చిరకాల కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కాలువ ఆధునికీకరణ పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. విజయవాడ నగర పరిధిలో 11 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ కాలువ మురికి కూపంగా ఉంది. కాలువ పక్కనే నివాసం ఉంటున్న ప్రజలు దోమలు, దుర్వాసనతో నరకం అనుభవిస్తున్నారు.
Modernization of Budameru Canal: విజయవాడలో వ్యర్థ జలాల ప్రవాహంతో పాటు.. వరదల సమయంలో పైనుంచి వచ్చే నీటిని దిగువకు పంపేందుకు బుడమేరు కాలువ రూపుదిద్దుకుంది. నీటిపారుదల శాఖలో ప్రత్యేక విభాగం కింద ఉన్న ఈ కాలువ నీటితో గతంలో సమీపంలోని పొలాల్లో కొంత భాగం సాగయ్యేవి. కానీ ప్రస్తుతం కాలువ పరివాహక ప్రదేశంలో ముక్కు మూసుకోకుండా నడవలేని పరిస్థితి నెలకొంది. బుడమేరు కాలువ విజయవాడ పరిధిలో 11 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది.
ఎక్కువ భాగం సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో సుమారు 7 కిలోమీటర్ల మేర ఉంది. నగరంలోని చనుమోలు వెంకట్రావు పైవంతెన కింద నుంచి.. జక్కంపూడి కాలనీ, వైవీ రావు ఎస్టేట్ వద్ద నుంచి.. గుణదల శివారు వరకు విస్తరించి ఉన్న ఈ కాలువ ప్రస్తుతం వ్యర్థజలాలతో నిండిపోయింది. మాంసపు వ్యర్థాలనూ కాలువలోనే పారవేస్తుండటంతో.. క్యాట్ ఫిష్‌లు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. కాలువలో నాలుగేళ్లుగా పూడిక తీయకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి.. దోమలు స్త్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బుడమేరు కాలువ ఆధునికీకరణ, శుభ్రం చేసేందుకు.. ప్రతిపాదనలు రెండు దశాబ్దాలుగా పెండింగులోనే ఉన్నాయి. కాలువ గురించి పట్టించుకునేవారు లేకపోవడంతో.. పరివాహక ప్రాంతం ఆక్రమణకు గురవుతోంది. ఈ తరుణంలో.. ఇటీవల కాలువకు ఇరువైపులా రివిట్‌మెంట్ వాల్ నిర్మించి.. శుభ్రం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు.. నగరపాలక సంస్థ అధికారుల నుంచి ప్రతిపాదనలు వెళ్లినా.. అవి ఆచరణకు ఆమడదూరంలోనే నిలిచాయి.
కాలువలో మురుగునీరు నిలిచిపోవడం వల్ల.. రామకృష్ణాపురం, దేవీనగర్, బుడమేరు మధ్యకట్ట, అజిత్‌సింగ్‌నగర్, గుణదల, మధురానగర్ వంటి ప్రాంతాల్లో దోమల బెడద దీర్ఘకాలిక సమస్యగా మారింది. కాలువలో పేరుకుపోయిన పూడిక, గుర్రపుడెక్క, వ్యర్థాలను తొలగించి.. శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు అనేకసార్లు వచ్చివెళ్తున్నా.. పరిష్కారం మాత్రం చూపడం లేదని చెబుతున్నారు. ప్రజలు కాలువలోనే చెత్త వేయడానికి అలవాటు పడటమే సమస్యకు ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు.
"దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వాసన ఎక్కువగా వస్తుంది. మున్సిపాలిటీ వాళ్లు చెత్త మొత్తం తీసుకొనివచ్చి ఇక్కడే పోస్తున్నారు. ఇక్కడ ఏదో గోడ కడతామన్నారు.. కానీ ఇప్పటి వరకూ ఏం కట్టలేదు". - స్థానికురాలు
"చెత్త బండి అయితే వస్తుంది.. కానీ ఎవరూ ఆ బండికి చెత్తని ఇవ్వడం లేదు. అందరూ కాల్వలోకి వేస్తున్నారు. గతంలో పూడికలు తీసే వాళ్లు కానీ ప్రస్తుతం ఎవరూ తీయడం లేదు. దోమలు విపరీతంగా ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా మా పరిస్థితి ఇలాగే ఉంది". - స్థానికుడు
ఇవీ చదవండి:
