చిన్న క్యూ.. పెద్ద​ కన్ఫ్యూజన్​.. రూ.2వేల నోట్ల మార్పిడికి బ్యాంక్​కు వెళ్లిన ప్రజల పరిస్థితిదీ!

author img

By

Published : May 23, 2023, 7:39 PM IST

2000 note exchange process started Small queues in banks confusion over rules at people

రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్​బీఐ ప్రకటించిన వేళ.. బ్యాంకుల్లో వాటి మార్పిడి ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. అయితే తొలిరోజు బ్యాంక్​ల వద్ద చిన్న క్యూలే దర్శనమిచ్చాయి. కానీ అనేక చోట్ల ప్రజలు ఇబ్బందలు పడ్డట్లు.. కొన్ని బ్యాంకుల్లో పాన్​, ఆధార్​ అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. మరికొన్నిచోట్ల నోట్ల మార్పిడికి అవకాశం లేదని.. ఖాతాలోనే డిపాజిట్ చేయాలని బ్యాంక్​ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

2000 Note Exchange Process : రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా రూ.2వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం వాటి మార్పిడి ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. సెప్టెంబరు 30 వరకు ఈ ప్రక్రియ సాగనుంది. అయితే బ్యాంకుల్లో మంగళవారం.. చిన్న చిన్న క్యూలే దర్శనమిచ్చాయి. కొన్ని చోట్ల బ్యాంకులో నోట్ల మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతున్నప్పటికీ.. మరికొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్​బీఐ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2000 Note Withdrawal : రూ.2వేల నోట్లను మార్పిడి లేదా డిపాజిట్​ చేసినప్పుడు ఎటువంటి ఫామ్​ నింపాల్సిన అవసరం లేదని, గుర్తింపు కార్టులను సమర్పించక్కర్లేదని ఆర్​బీఐ ఇదివరకే స్పష్టం చేసింది. కానీ అనేక చోట్ల.. బ్యాంక్​ అధికారులు గుర్తింపు కార్డులను సమర్పించాలని ప్రజలకు డిమాండ్​ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇంకొన్ని బ్యాంకుల్లో రిజిస్ట్రార్​లో పేర్లు, మొబైల్​ నంబర్​ను రాయమన్నారట. మరికొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ ఎంట్రీ ద్వారా బ్యాంక్​ అధికారుల నోట్లను మార్పిడి చేశారు.

2000 Note Deposit : కొన్ని బ్యాంకుల్లో రూ.2వేల నోట్లను తామ మార్పిడి చేయమని కోరగా.. అందుకు అధికారులు నిరాకరించారని ప్రజలు చెబుతున్నారు. మార్పిడి బదులు బ్యాంక్​ ఖాతాలో డిపాజిట్​ చేయమని కోరినట్లు తెలిపారు. అయితే 2016లో పెద్దనోట్ల రద్దు సమయంలో ప్రజలు బ్యాంక్​ల గంటల తరబడి వేచి చూసిన పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు.

'నల్లధనం దాచుకున్న వారికి కేంద్రం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది'
రూ.2వేల నోట్లను ఉపసంహరించుకునే చర్యతో నల్లధనాన్ని దాచుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. స్వతంత్ర భారతదేశంలో జరిగిన ఈ అతిపెద్ద దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఆరున్నర సంవత్సరాల విరామం తర్వాత అనేక మంది ప్రజలు మరోసారి ఒత్తిడికి లోనవుతున్నారని ఆరోపించింది. రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు 11 కోట్ల మంది రైతులు క్యూలో నిలబడాల్సి వస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మంగళవారం ఆరోపించారు.

"ఆర్​బీఐ చెప్పిన రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లలో ఎక్కువ భాగం నల్లధనం దాచుకునేవారి వద్దే ఉంది. ఇప్పుడు రూ.2000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు ఎలాంటి గుర్తింపు కార్డులు సమర్పించాల్సిన అవసరం లేదు. ఫారాలు కూడా నింపాల్సిన అవసరం లేదు. కాబట్టి నల్లధనం దాచుకున్న వారికి మోదీ సర్కార్​ రాచరిక స్వాగతం పలుకుతోంది. కరోనా తర్వాత కోలుకున్నదేశ ఆర్థిక వ్యవస్థపై రూ.2వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. అసలు రూ.2000 నోట్లను ఎందుకు ప్రవేశపెట్టారు? మళ్లీ వెనక్కి తీసుకునే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?"

- గౌరవ్ వల్లభ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

2000 Notes Withdrawal India : రూ. 2వేల నోట్ల ఉపసంహరించుకుంటున్నట్లు ఈనెల 19వ తేదీన ఆర్​బీఐ సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని.. ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. రూ.2వేల నోట్లు ఉన్నవారు సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని తెలిపింది. ఇకపై ఎవరికీ రూ.2000 నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు సూచించింది. 'క్లీన్‌ నోట్‌ పాలసీ' కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.