Canal Works: పూడిపోయిన కాలువలు.. శిథిలావస్థలో షెట్టర్లు.. ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఇదీ..!

author img

By

Published : May 28, 2023, 3:09 PM IST

Nagarjuna Sagar Canal Maintenance Works

Sagar Canal Maintenance Works: నిర్వహణ లేమితో ప్రకాశం జిల్లాలోని కాలువలు నిర్వీర్యంగా మారాయి. నాగార్జున సాగర్‌ నుంచి వచ్చిన జలాలను కాలువల ద్వారా చెరువుల్లో నింపి దాహార్తిని తీరుస్తారు. అంతేకాక.. ఖరీఫ్ సీజన్‌లో సాగుకు కూడా ఈ సాగర్ నీళ్లే రైతులను ఆదుకుంటున్నాయి. అలాంటి కాలువల నిర్వహణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

పూడిపోతున్న కాలువలు.. శిథిలావస్థలో షెట్టర్లు.. ఇదీ ప్రకాశం జిల్లాలోని కాలువల పరిస్థితి

Sagar Canal Maintenance Works: ఎటుచూసినా చిల్లచెట్లు, శిథిలావస్థకు చేరుకున్న షెట్టర్లు, తెగిపోతున్న గట్లు.. ఇది ప్రకాశం జిల్లాలో సాగర్‌ కాలువల పరిస్థితి. కృష్ణా జలాలతో పలు మండలాలకు తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే ఈ కాలువల నిర్వహణ సరిగా లేక ఎక్కడికక్కడే ఆటంకం కలుగుతోంది. సాగు తాగునీటి అవసరాల కోసం జిల్లాలోని సాగర్‌ కాలవలే ప్రధాన నీటి వనరులు.. అనేక గ్రామాలు, పట్టణాలకు సాగర్‌ నుంచి వచ్చిన జలాలను చెరువుల్లో నింపి ప్రజలు అవసరాలు తీరుస్తారు.. ఖరీఫ్‌లో కూడా సాగర్‌ నీళ్లే సాగుకు ఆధారం.. ఇలాంటి సాగర్‌ కాలువల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. దాదాపు నాలుగేళ్ల నుంచి కాల్వల నిర్వహణే పట్టించుకోలేదన్న విమర్శులు ఉన్నాయి.

నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు.. నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాలో పలు మండలాల ప్రజలకు తాగునీటిని అందివ్వాలి.. అదే విధంగా వేలాది ఎకరాలకు సాగునీటిని పంపిణీ చేయాలి.. నాగార్జున సాగర్​లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే ఆ నీటిని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లలో నింపుతారు.. ప్రకాశం జిల్లాలో పొదిలి, చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు తదితర మండలాల్లో గ్రామాలకు రామతీర్థం జలాశయం నుంచి నీటిని మళ్ళిస్తారు.. ఈ జలాశయం దిగువున చీమకుర్తి గ్రానైట్‌ క్వారీలు ఉండటం వల్ల కాలువల నిర్వహణకు తీవ్ర విఘాతం ఏర్పాడుతుంది.. గ్రానైట్‌ వ్యర్థాలు ప్రధానకాలువల్లో చేరి కాలువలు పూడిక పట్టిపోతున్నాయి.. కాలువలకు అటూ ఇటూ ఉన్న గట్లపై క్వారీ లారీలు తిరగడం వల్ల గట్లు, కాలవలు ధ్వంసం అవుతున్నాయి. కాలువల నిర్వహణ లేకపోవడంతో మారుమూల గ్రామాలకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు సరిగా రాకుంటే సాగు ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

మారిపోతున్న కాలువల రూపురేఖలు.. నీటిపారుదల శాఖ విషయానికి వస్తే సాగర్ నిర్వహణ మాటే మరిచిపోయింది.. చిల్లచెట్లు పెరిగిపోవడం, ట్రాపులు శిధిలమవ్వడం, షెట్టర్లు విరిగిపోవడంతో కాలువల రూపురేఖలు మారిపోతున్నాయి. నాలుగేళ్లుగా కనీసం చిల్ల చెట్ల కూడా తొలగించిన పాపాన పోలేదని రైతులు అంటున్నారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల పొలాల్లోకి నీటి ప్రవాహం ఉండటం లేదు.. ప్రధాన కాల్వలే కాకుండా, పిల్లకాలువలు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కారుమంచి కెనాల్‌లో క్వారీ తవ్వకాలు కారణంగా పూర్తిగా గంటి పడినా, ఇంతవరకూ కొత్త కాలువ నిర్మాణాన్ని ప్రారంభించలేదు.. అధికారులు, ప్రజా ప్రతినిధులు కాలువల విషయంలో ఏ మాత్రం దృష్టిపెట్టడంలేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం గడచిన ఈ నాలుగేళ్లలో కాలవల నిర్వహణ చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ.. అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.