ETV Bharat / state

Tanuku Hospital : వైద్య సేవల్లో భేష్.. తణుకు ప్రభుత్వాస్పత్రికి కేంద్రం గుర్తింపు

author img

By

Published : Apr 17, 2023, 9:57 PM IST

తణుకు ప్రభుత్వాస్పత్రి సేవలు భేష్
తణుకు ప్రభుత్వాస్పత్రి సేవలు భేష్

Tanuku District Central Hospital : తణుకు పట్టణంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి ఉన్నత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందింది. 15 విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తూ తనదైన గుర్తింపు సాధించింది. ఈ మేరకు మూడు కేంద్ర బృందాలు మూడు రోజుల పాటు ఆస్పత్రిలో పరిశీలించి ఎన్​క్యూఏఎస్, లక్ష్య ధ్రువీకరణ అందించాయి. దీంతో ప్రతి సంవత్సరం 15లక్షల చొప్పున మూడు సంవత్సరాలు 45 లక్షలు మంజూరు కానున్నాయి.​

Tanuku District Central Hospital : కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా సేవలందిస్తూ రాష్ట్రంలోనే అగ్రగామి ఆసుపత్రిగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని జిల్లా కేంద్ర ఆసుపత్రి నిలిచింది. రాష్ట్రంలో ఎన్నో అత్యుత్తమ సదుపాయాలు కలిగిన ఆసుపత్రులను సైతం వెనక్కి నెట్టి కేంద్ర ప్రభుత్వ అవార్డులను సొంతం చేసుకుంది. 150 పడకలు గలిగిన ఈ ఆసుపత్రికి ఏటా 15 లక్షల రూపాయల చొప్పున మూడు సంవత్సరాల పాటు 45 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.

తణుకు ప్రభుత్వాస్పత్రి సేవలు భేష్

రోజూ 300మందికి పైగా ఓపీ.. రాష్ట్రంలోనే అత్యుత్తమ సేవలకు కేరాఫ్ అడ్రస్ గా తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రి నిలుస్తోంది. తణుకు పట్టణం చుట్టుపక్కల ఏడు మండలాల్లోని 110 గ్రామాలకు కూడలి ప్రాంతం. ప్రతిరోజు సుమారు 300 మంది పైగా రోగులు వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి తరలి వస్తారు. మహిళలకు అందించే ప్రసూతి వైద్య సేవల విషయంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా మెటర్నిటీ వార్డులను ఆధునికీకరించి సేవలందించడం విశేషం. పిల్లలకు అవసరమైన ఇంక్యుబేటరీ బాక్స్​ల సదుపాయం కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం మరో విశేషం.

సేవలపై ఆరా... ఇటీవల... జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన నాణ్యతా ప్రమాణాల సంస్థకు చెందిన ప్రతినిధులు ఢిల్లీ, అగర్తల, తమిళనాడు నుంచి తరలివచ్చి మూడు రోజులపాటు ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని 15 విభాగాలలో పనితీరు పరిశీలించడంతోపాటు ఆసుపత్రి పరిపాలన, ఆసుపత్రి నిర్వహణ, పారిశుధ్య పరిస్థితులు తదితర అంశాల మీద క్షుణ్ణంగా పరిశీలించి ఉత్తమ ఆస్పత్రిగా గుర్తింపు ఇచ్చారు. 150 పడకలు గలిగిన ఈ ఆసుపత్రికి ఏటా 15 లక్షల రూపాయల చొప్పున మూడు సంవత్సరాల పాటు 45 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నిధులను ఆసుపత్రిలో రోగులకు సదుపాయాలు కల్పించడానికి ఆస్పత్రి అభివృద్ధికి వినియోగించే అవకాశం ఉంది.

గతంలోనూ పలు అవార్డులు.. ఈ ఆస్పత్రి గతంలోనూ ఉత్తమ సేవలందించే ఆసుపత్రిగా రాష్ట్ర స్థాయిలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది. కాయకల్ప అవార్డును సొంతం చేసుకుంది. ఆసుపత్రిలో అందుతున్న సేవల పట్ల రోగులు, వారి సహాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టవలసిన వైద్యాన్ని సైతం ఉచితంగా అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యుల సిబ్బంది సహకారం వల్లే తాము కేంద్ర ప్రభుత్వ అవార్డులు పొందగలిగామని ఆసుపత్రి పర్యవేక్షణాధికారి డాక్టర్ శివప్రసాద్ వెల్లడించారు. స్థానిక మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సహాయ సహకారాలు కూడా తమ ఆసుపత్రి అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని ఆయన వివరించారు.

ఆస్పత్రిలో సేవలు, సౌకర్యాలపై మూడు ప్రత్యేక బృందాలు ఆరా తీశాయి. 15 విభాగాలకు సంబంధించి అందుతున్న సేవల గురించి మూడు రోజుల పాటు స్వయంగా పరిశీలించగా మంచి మార్కులు వచ్చాయి. 60శాతం మార్కులు క్వాలిఫై స్కోరు కాగా, మన ఆస్పత్రికి 90శాతం మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు దక్కడానికి కృషి చేసిన వైద్య సిబ్బందికి అభినందనలు. - డాక్టర్ కే శివప్రసాద్, జిల్లా కేంద్ర ఆస్పత్రి పర్యవేక్షణాధికారి, తణుకు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.