ETV Bharat / state

ఏటా వేసవిలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు

author img

By

Published : Mar 8, 2021, 9:39 AM IST

వేసవి కాలంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్లు పేలడం, ఇంజిన్‌ వేడెక్కడం తదితర లోపాలు ఎక్కువ ఉంటాయని.. దీంతో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఏటా జరిగే ప్రమాదాల్లో 25-28 శాతం వరకూ మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లోనే నమోదవుతుంటాయని తెలిపారు.

road accidents
ఏటా వేసవిలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదలు

వేసవి వచ్చిందంటే చాలు.. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతాయి. ఏటా జరిగే ప్రమాదాల్లో 25-28 శాతం వరకూ మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లోనే నమోదవుతుంటాయి. 2014 నుంచి 2019 మధ్య రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 1,45,780 రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే.. వాటిల్లో 38,653 (26.51 శాతం) వేసవిగా పరిగణించే 3నెలల వ్యవధిలోనే చోటుచేసుకున్నాయి. ఈ 3నెలలు ప్రయాణాల సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రహదారి భద్రత నిపుణులు సూచిస్తున్నారు.

ప్రధాన కారణాలివీ..


* వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్లు పేలడం, ఇంజిన్‌ వేడెక్కడం తదితర లోపాలు ఎక్కువ. ఫలితంగా వాహనాన్ని నియంత్రించలేక ముప్పు పెరుగుతుంది.
* ద్విచక్రవాహనదారులు ఎక్కువ సేపు అధిక ఉష్ణోగ్రతల మధ్య ప్రయాణిస్తారు. త్వరగా వెళ్లాలని వ్యతిరేక దిశలో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతారు.
* డ్రైవర్లు అధిక వేడిమి వల్ల త్వరగా అలసిపోతారు. వాహనం నడపటంలో ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాలు సంభవిస్తాయి.
* వేసవి సెలవుల్లో చాలా మంది కుటుంబాలతో విహారయాత్రలకు, ఆధ్మాత్మిక పర్యటనలకు వెళ్తుంటారు. దూర ప్రాంతాలకు వాహనాల్లో వెళ్లటం, సరైన నిద్ర లేకపోవటం, అలసట ప్రమాదాలకు కారణం.

ఇలాంటి జాగ్రత్తలతో మేలు...
* వాహనాల్లోని ఏసీలు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? కూలింగ్‌ సామర్థ్యం సరిగ్గా ఉందా? లేదా? చూసుకోవాలి.
* వాహనాల టైర్లు సరిగ్గా ఉన్నాయా? లేదా? అనేది పరీక్షించుకోవాలి.
* ఇంజిన్లు వేడెక్కిపోకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఎదురుగా ఉన్న రోడ్డు సరిగ్గా కనిపించకపోవటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకే వాహనాలకు ఉండే వైపర్‌ బ్లేడ్‌లను మార్చుకోవాలి.
* ప్రయాణంలో ప్రతి రెండు, మూడు గంటలకోసారి విశ్రాంతి తీసుకోవాలి.
* డీహైడ్రేషన్‌కు గురికాకుండా తాగునీటిని నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలి.

ఇదీ చదవండి: ఏటా వేసవిలోనే ఎక్కువ దుర్ఘటనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.