ETV Bharat / state

New Collectorate: కొత్త పాలనకు చకచకా ఏర్పాట్లు

author img

By

Published : Mar 30, 2022, 7:41 AM IST

New Collectorates: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనలో సరికొత్త మార్పులను సర్కారు తీసుకురాబోతోంది. దీనికోసం ఉన్నతాధికారులను సమాయత్తం చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచే కొత్త జిల్లాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ రోజున జిల్లా కేంద్రాల్లో కొలువు తీరనున్న కొత్త కలెక్టర్లు, ఎస్పీలు తమ కార్యాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడనున్నారు. ఆయా జిల్లాల పరిధిలో ఎమ్మెల్యేలు కూడా కొత్త కలెక్టరేట్లలోని వీడియో సమావేశంలో పాల్గొంటారు.

New Collectorate
కొత్త ‘కళ’క్టరేట్‌

New Collectorates: నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కొత్త కలెక్టరేట్‌ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రైవేట్‌ భవనాన్ని అద్దెకు తీసుకొని..రంగులు వేసి జిల్లా పరిపాలనా కేంద్రంగా సిద్ధం చేస్తున్నారు. అవసరమైన వసతులు సమకూరుస్తున్నారు. అనకాపల్లి, పాడేరులలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కలెక్టరేట్‌ భవనాల్లో ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు.

విశాఖలోని ఎస్పీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ గదిలో శీతల యంత్రాలు, టీవీలు, ప్రొజెక్టర్లు అన్నీ తొలగించి అనకాపల్లిలో ఏర్పాటు చేయనున్న కొత్త కార్యాలయానికి తరలిస్తున్నారు. ఎస్పీ ఛాంబర్‌, వీడియో సమావేశ మందిరంలో పనులను ముందుగా చేపడుతున్నారు. అలాగే కొత్త కలెక్టరేట్‌ కోసం గుర్తించి ఇండో అమెరికన్‌ స్కూల్‌లోని పూర్ణా మహల్‌కు రంగులు వేయడంతో ఆ భవనం కొత్తశోభను సంతరించుకుంది. కలెక్టర్‌ ఛాంబర్‌లో విద్యుదీకరణ పనులు చేస్తున్నారు. భవనం లోపలి భాగంలో ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు మొదలుపెట్టారు. ఈ భవనంలో 69 గదులున్నాయి. వీటిలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఛాంబర్లతో పాటు వారీ పేషీలు, వివిధ సెక్షన్లకు కేటాయించగా మిగిలిన గదులను ఇతర శాఖలకు ఇవ్వనున్నారు. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులు రెండు గదులను రిజర్వ్‌ చేసుకుని ఉంచుకున్నారు. మరికొన్ని శాఖలకు అదే భవనంలో గదులు కేటాయించే అవకాశం ఉంది. పాడేరులోని కొత్త కలెక్టరేట్‌ భవనంలో జరుగుతున్న పనులను కలెక్టర్‌ మల్లికార్జున, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ పరిశీలించారు. ఉగాది నాటికి సిద్ధం చేయాలని స్థానిక అధికారులను సూచించారు. ఎస్పీ కార్యాలయం కోసం ప్రైవేటు భవనాన్ని తీసుకుని ముస్తాబు చేస్తున్నారు.

ముహూర్తం మంచిదేగా..: కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలతో పాటే మిగతా ప్రభుత్వశాఖలు ఉగాది రోజునే తమ కార్యాలయాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులను ఈ ప్రారంభోత్సవాలకు ఆహ్వానించాలని ఆయా శాఖల అధికారులు భావిస్తున్నారు. దీనికోసం ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నారు. కొత్త కార్యాలయం కాబట్టి పనులు, పరిపాలన సజావుగా సాగాలంటే మంచి చూసుకుని కొలువుదీరితే బాగుంటుందని కొంతమంది జిల్లా అధికారులంటున్నారు. కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులను కూడా తమ కార్యాలయాల ప్రారంభోత్సవానికి రావాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: new districts: కొత్త జిల్లాలపై ఉత్కంఠ.. నేడు ఉన్నతస్థాయి సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.