ETV Bharat / state

నిషేధం అనంతరం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు

author img

By

Published : Jun 1, 2020, 6:11 PM IST

fishing starting in vizag harbour
నిషేధం అనంతరం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు

చేపల వేటపై నిషేధం ముగియటంతో మత్స్యకారులు వేటకు బయలుదేరారు. గత 3 సంవత్సరాల నుంచి నిరాశాజనకంగా ఉన్న చేపల వేట ఈసారైనా తమకు మేలు చేస్తుందేమోనని గంపెడు ఆశతో ముందుకు సాగుతున్నారు. అయితే ఈ ఏడాది కరోనా లాక్ డౌన్ వల్ల బోటు మరమ్మతులు చేసుకోకుండానే వేటకు సిద్ధం అయ్యారు గంగపుత్రులు.

గంగపుత్రులు ఈ ఏడాది చేపల వేట మొదలు పెడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా 15 రోజుల ముందే నిషేధం తొలగించారు. గడువుకు ముందుగానే చేపల వేటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

లక్షమందికి ఆధారం

ఏటా ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 వరకు చేపల ప్రత్యుత్పత్తి సమయం. అందుకే దేశ వ్యాప్తంగా ఏ మత్స్యకారుడు వేటకు వెళ్లకుండా నిషేధం ఉంటుంది. ప్రత్యుత్పత్తి సమయం అవ్వగానే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. అనుమతి రాగానే సంప్రదాయంగా విశాఖ ఫిషింగ్ జెట్టిలో ఉన్న గంగమ్మకు పూజలు చేసి మొదట కొన్ని బోట్లను ట్రయిల్​గా పంపుతారు. చేపలు, రొయ్యలు పడిన పరిస్థితి పరిశీలించి అప్పుడు మిగిలిన అన్ని బోట్లు వేటకు వెళ్తాయి. విశాఖలో ఫిషింగ్ హార్బర్​లో ప్రత్యక్షంగా 10వేల మంది కార్మికులు, వారిపై ఆధారపడి దాదాపు లక్ష మందిదాకా జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మత్స్యకార భరోసా వల్ల గంగపుత్రులకు కొంత మేలు జరిగిదని అంటున్నారు. డీజిల్​పై ఇచ్చే రాయితీ సొమ్ము సకాలంలో ఇస్తే అసరా అవుతుందని అంటున్నారు.

తగ్గుతున్న చేపల సంఖ్య

ఈసారి మత్స్యకారులకు అన్నివైపుల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓవైపు లాక్ డౌన్ వలన ముందుగానే నిషేధం విధించారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ మత్స్యకారులు ఇప్పుడే వేట మొదలు పెడుతున్నారు. మత్స్యసంపద మొత్తం వారికే దక్కకుండా ఉండాలంటే మన రాష్ట్ర మత్స్య కారులు ఇప్పుడే వేటకు వెళ్లాలి. లాక్ డౌన్ వల్ల బోటు మరమ్మతులు, ఇతర నిర్వహణ పనులు చేసుకోలేకపోయారు. కోస్తా తీరం వెంబడి పెరిగిన పారిశ్రామిక సంస్థలు వల్లవ్యర్ధాలు సముద్రంలో చేరటంతో చేపల సంఖ్య తగ్గుతోంది. ఇక చెరువులో రొయ్యలకు ఉన్న డిమాండ్ సముద్రంలో రొయ్యలకు ఉండడంలేదని మత్స్యకారులు అంటున్నారు. అందువల్ల రొయ్యల ఎగుమతి జరుగుతున్నా లాభాలు ఉండడంలేదు.

ఈసారి లాభాలు రాకపోతే ఆపరేటర్లు బోట్లు అమ్ముకుని వెళ్లిపోయే పరిస్థితి ఉందని చెప్తున్నారు. కళాసీలకు ప్రభుత్వం ఇచ్చిన మత్స్యకార భరోసా సొమ్ములైనా దక్కుతున్నాయని... బోట్ యాజమానులకు అవి కూడా రావడంలేదని వాపోతున్నారు. ఈ ఏడాది గంగమ్మ తల్లి కరుణించి గంగపుత్రుల కష్టం తీరుస్తుందని.. గంపెడాశతో విశాఖ మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి.

ఇవీ చదవండి... మానవ తప్పిదం వల్లే ఎల్జీ పాలిమర్స్​ ఘటన..ఎన్జీటీకి కమిటీ నివేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.