ETV Bharat / state

విశాఖలో ఐటీ రంగం వెలవెల.. భవనాలు ఖాళీ

author img

By

Published : Apr 7, 2023, 7:26 AM IST

IT Sector in Visakhapatnam: విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరవై.. సాగర తీర నగరంలో ఐటీ రంగం వెలవెలబోతోంది. కార్యాలయ భవనాలు ఖాళీగా దర్శనిమిస్తున్నాయి. ఉన్న కంపెనీలు మూతపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఐటీ రంగ అభివృద్ధికి సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలుకావడం లేదు.

IT Companies in Visakhapatnam
విశాఖలో ఐటీ కంపెనీలు

విశాఖలో మూతపడుతున్న కంపెనీలు.. ఐటీ హబ్ కల నెరవేరేది ఎలా?

IT Sector in Visakhapatnam: దస్త్రాల్లో చూస్తే రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ - ఐటీ విధానం అద్భుతం.. క్షేత్రస్థాయిలో అమలు మాత్రం శూన్యం. విశాఖలో ఐటీ రంగానికి రాయితీలు, ప్రోత్సాహకాలు కరవయ్యాయి. 100 స్టార్టప్స్‌ మూతపడ్డాయి. డీటీపీ పాలసీ రద్దుతో మరికొన్ని కంపెనీలను మూసేశారు. ఐబీఎమ్, హెచ్ఎస్​బీసీ వంటి భారీ సంస్థలు వెనుదిరిగాయి. కొత్త కంపెనీల జాడ లేదు. నాన్‌ సెజ్‌లో 20 నుంచి 25లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాలు కట్టినా అవన్నీ ఖాళీగానే ఉన్నాయి. నౌకాదళ నిబంధనలతో జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు విశాఖకు తగ్గాయి. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు లేనే లేవు. ఇక్కడ చదువుకున్న యువత హైదరాబాద్, బెంగళూరు బాట పట్టాల్సిందే. ఇదీ మొత్తంగా విశాఖపట్నం ఐటీ ప్రస్తుత పరిస్థితి.

రుషికొండ వద్ద ఉన్న హిల్‌-1పై మెరికల్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్, ఫ్లూయింట్‌ గ్రిడ్‌ వంటి కంపెనీలు 7 ఎకరాల్లో ఉండగా.. రామానాయుడు స్టూడియో 40 ఎకరాల్లో ఉంది. హిల్‌-2లో సింబయాసిస్‌ టెక్నాలజీ, నవయుగ వంటి 10 సంస్థలకు 25 ఎకరాలు కేటాయించారు. హిల్‌-3లో 90 ఎకరాల భూములు సెజ్ కింద ఉన్నాయి. ఈ సెజ్‌ చివరిలో ఉన్న 25 ఎకరాల స్థలాన్ని కనెక్సా అనే సంస్థకి గతంలో కేటాయించారు. ఆ తర్వాత అదే భూమి ఐబీఎమ్​కి బదలాయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఐబీఎం విశాఖను వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత మరో సంస్థకి అందులో 3.84 ఎకరాల స్థలాన్ని కేటాయించి మిగిలిన భూమిని ఏపీఐఐసీ వెనక్కి తీసుకుంది. ఇప్పటి వరకు ఆ భూమిని అభివృద్ధి చేయలేదు. ఇక్కడే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని పలువురు ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఐబీఎమ్ వంటి పెద్ద సంస్థ విశాఖ నుంచి వెళ్లిపోగా, అదే బాటలో హెచ్ఎస్​బీసీ పయనించింది. సిరిపురంలోని హెచ్ఎస్​బీసీ కార్యాలయం, కాల్‌సెంటర్లలో ఒకప్పుడు 3 వేల 500 మంది పని చేసేవారు. హెచ్ఎస్​బీసీ సైతం ఖాళీ చేసి వెళ్లిపోగా WNS అనే చిన్న సంస్థ ప్రస్తుతం అదే భవనాన్ని లీజుకు తీసుకుంది. హిల్‌-3 ప్రారంభంలో స్టార్టప్‌ విలేజ్‌ అని 50వేల చదరపు అడుగుల్లో భవనం నిర్మించారు. ఇక్కడ టీడీపీ ప్రభుత్వ హయాంలో వంద స్టార్టప్స్‌ ఉండేవి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అవన్నీ మూతపడ్డాయి. ఉన్నవి మూతపడినా పట్టించుకోకుండా.. గత మూడు, నాలుగు నెలలుగా ప్రభుత్వం స్టార్టప్స్‌కు పెద్దపీట అంటూ హడావుడి చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హిల్‌-3లో మిలీనియం టవర్‌-1 తెలుగుదేశం హయాంలో ప్రారంభించారు. ఇందులో కాండ్యుయెంట్‌ అనే అంతర్జాతీయ కంపెనీ ఉంది. ఆ టవర్‌లో ఖాళీగా ఉన్న ఫ్లోర్లు తమకు ఇస్తే కంపెనీని విస్తరిస్తామని కాండ్యుయెంట్‌ చెప్పినా ప్రభుత్వం కేటాయించలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫేజ్‌-2 కింద మిలీనియం టవర్‌ 1.50 లక్షల చదరపు అడుగులతో కొత్తగా నిర్మించింది. ప్రభుత్వం వద్ద ఇప్పటికిప్పుడు ఇచ్చేందుకు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల బిల్డింగ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఒక్క కంపెనీకి కూడా వీటిని ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. హిల్‌-1, 2, 3 మాత్రమే కాకుండా నాన్‌ సెజ్ ప్రాంతం కూడా ఉంది. చాలా కంపెనీలు 25 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు నిర్మించినా అవి ఉద్యోగులు లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

చంద్రబాబు హయాంలో డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్కు విధానం ఉండేది. అందువలన ఏ సంస్థ దరఖాస్తు చేసుకున్నా సగం అద్దెకే ఇవ్వడంతోపాటు, ఇంటర్నెట్, విద్యుత్‌ సౌకర్యం కల్పించేవారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఈ విధానం ఎత్తేశారు. దీంతో చిన్న, మధ్యతరహా కంపెనీలు వంద వరకు మూతబడ్డాయి. వెళ్లిపోయిన కంపెనీలకు ఇవ్వాల్సిన అద్దెలు కూడా నాలుగేళ్లుగా ఇవ్వలేదు. ఒకరికి ఏడాదిపాటు ఉద్యోగం కల్పిస్తే ప్రోత్సాహకంగా లక్ష రూపాయల ఇచ్చేవారు. గత నాలుగేళ్లుగా ఇలాంటివి నిలిచిపోయాయి. ఐటీ కంపెనీలకు ఇవ్వాల్సిన 25 కోట్ల రూపాయల రాయితీలు పెండింగ్‌లో ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో కంపెనీలకు విద్యుత్‌ ఎండీ ఛార్జీ, ప్రాపర్టీ ఛార్జీలు రద్దు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించినా ఇంత వరకు అమలు చేయలేదు.

ఐటీ పార్కుకు ఎవరైనా రావాలంటే ప్రజారవాణా సదుపాయం లేదు. హిల్‌-1, 2, 3కి వెళ్లడానికి ఎటువంటి బస్సు సౌకర్యం కల్పించలేదు. ఐటీ కంపెనీల్లో పనిచేసే పరోక్ష సిబ్బందికి ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొండలకు వెళ్లే రహదారులు అక్కడక్కడా గుంతలతో ఉండటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పలువురు ఉద్యోగులు ప్రమాదాల బారిన పడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.