ETV Bharat / state

జగన్​ పాలనలో 'గంజాయి క్యాపిటల్​ ఆఫ్​ ఇండియాగా ఏపీ': లోకేశ్​

author img

By

Published : Mar 1, 2023, 9:42 PM IST

Lokesh Yuvagalam : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ చేపట్టిన యువగళం పాదయాత్ర 31వ రోజుకు చేరింది. ఇప్పటికి 400కిలో మీటర్ల యాత్ర పూర్తి కాగా, చంద్రగిరి నియోజకవర్గంలో శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇర్రంగారిపల్లిలో నిరుద్యోగ యువత, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. చంద్రబాబు పాలనలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. జగన్ పాలనలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని ఆరోపించారు.

యువగళం పాదయాత్ర
యువగళం పాదయాత్ర

యువగళం పాదయాత్ర

Lokesh Yuvagalam : గంజాయి, డ్రగ్స్ సరఫరా నియంత్రించాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ కేంద్రప్రభుత్వానికి ఉత్తరాలు రాశారు. పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం ఇర్రంగారిపల్లెలో నిర్వహించిన హలో లోకేశ్‍ కార్యక్రమంలో యువతకు ఇచ్చిన హామీ మేరకు లేఖలు రాశారు. 31వ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర సాగింది. పాదయాత్ర నేండ్రగుంట చేరగానే 400 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆధునిక వ‌స‌తుల‌తో కూడిన ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గడిచిన మూడున్నర సంవత్సరాల్లో ప్రైవేటు రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కోల్పోయామని లోకేశ్‍ తెలిపారు.

విద్యార్థులతో సరదాగా.. 31వ రోజు గాదంకి టోల్ గేట్ విడిది కేంద్రం నుంచి ప్రారంభించిన పాదయాత్ర.. నేండ్రగుంట, ఇర్రంగారిపల్లి, పాకాల, పాకాల బస్టాండు మీదుగా పూలమార్కెట్, మసీదు మీదుగా గుమ్మడివారి ఇండ్లు విడిది కేంద్రం వరకు 13 కిలోమీటర్లు సాగింది. పాదయాత్రలో గాదంకి వద్ద బలిజ సామాజికవర్గీయులు, కావలివారిపల్లిలో గ్రామస్తులు, ఇర్రంగారిపల్లిలో నిరుద్యోగ యువత, విద్యార్థులు లోకేశ్‍ ను కలిశారు. పాదయాత్రలో భాగంగా పాకాల జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో లోకేశ్‍ సరదాగా కొద్దిసేపు వాలీ బాల్ ఆడి, పిల్లలతో సరదాగా గడిపారు. అనంతరం పాదయాత్ర కొనసాగించిన లోకేశ్‍.. పాకాల మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మతపెద్దల ఆశీర్వచనం తీసుకున్నారు. యువ‌గ‌ళం 400 కిలో మీటర్లు చేరుకున్న సంద‌ర్భంగా.. పాకాల మండ‌లం నేండ్రగుంట మ‌జిలీలో ఆధునిక వ‌స‌తుల‌తో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

యువతతో ముఖాముఖి.. ఇర్రంగారిపల్లిలో నిర్వహించిన హలో లోకేశ్‍ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుద్యోగ యువత, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. జాబ్‍ క్యాలెండర్‍ మొదలు రాష్ట్రంలో పెరిగిపోయిన మత్తుపదార్థాల విక్రయాల వరకు పలు అంశాలను యువత లోకేశ్‍ దృష్టికి తెచ్చారు. జగన్‍ రెడ్డి పాలనతో పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయాయని లోకేశ్‍ ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కువ పన్ను చెల్లించిన పరిశ్రమగా గుర్తింపు పొందిన అమరరాజా పరిశ్రమను తెలంగాణకు వెళ్లేలా చేశారని విమర్శించారు. టీడీపీ నుంచి మారడానికి గల్లా జయదేవ్‍ నిరాకరించడంతో అమరరాజా పరిశ్రమను వేధించారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. జగన్ పాలనలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని ఆరోపించారు.

హామీలపై మౌనమెందుకు.. చంద్రగిరి నియోజకవర్గం పాకాల గ్రామంలో ప్రజలనుద్దేశించి నారా లోకేశ్​ మాట్లాడారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు, రైతులు, ఉద్యోగులు, యువత ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్, యువతకు 2.30 లక్షల ఉద్యోగాలిస్తానన్న జగన్ హామీలపై ప్రశ్నిస్తే నేటికీ సమాధానం చెప్పలేదంటే మౌనమే అర్ధాంగీకారమా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒప్పుకోకపోయినా సరే తాను మాత్రం వైఎస్సార్సీపీ నేతల అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు. చెవిరెడ్డి.. రెండు సార్లు గెలిపించిన చంద్రగిరి ప్రజలకు స్వీట్ బాక్స్, చీర తప్ప ఇంకేమిచ్చారని ప్రశ్నించారు. చంద్రగిరి అభివృద్ధికి ఏమీ చేయని ఎమ్మెల్యే మనకు అవసరమా..? అని అన్నారు. చంద్రగిరి ప్రజలు మరోసారి నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

గంజాయి మాఫియా బారి నుంచి కాపాడాలని.. రాష్ట్రంలో గంజాయి మాఫియాతో చిన్న పిల్లల నుంచి పెద్దల జీవితాలు బలవుతున్నాయని పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టడం ద్వారా రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ నారా లోకేశ్‍ కేంద్రానికి ఉత్తరాలు రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నార్కోటిక్‍ కంట్రోల్‍ బ్యూరో డైరెక్టర్‍ జనరల్‍ కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల భాగస్వామ్యంతో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి రవాణా విచ్చలవిడిగా సాగుతోందని తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండ పైకి గంజాయి, డ్రగ్స్ సరఫరా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు.

గుమ్మడివారి ఇండ్లు విడిది కేంద్రం వరకు 31వ రోజు పాదయాత్ర సాగింది. రాత్రికి లోకేశ్‍ అక్కడే బస చేశారు. 32వ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభం కానున్న పాదయాత్ర పుంగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.