ETV Bharat / state

power cuts: కరెంట్ కోతలు...ఇబ్బందులు ఎదుర్కొంటున్నఉద్యోగులు

author img

By

Published : Apr 13, 2022, 4:42 AM IST

రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్తు కోతలతో వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆయా షిఫ్టు సమయాల్లో విద్యుత్తు ఉండకపోవడంతో అదనపు సమయం పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు. అలాగే అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేయలేకపోతుండటంతో ఒత్తిడి పెరుగుతోంది.

power cuts
power cuts

రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్తు కోతలతో అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు గంటల తరబడి కరెంట్‌ తీసివేస్తుండటంతో ఇళ్ల నుంచి పని (వర్క్‌ ఫ్రం హోం) చేస్తున్న పలువురు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఆయా షిఫ్టు సమయాల్లో విద్యుత్తు ఉండకపోవడంతో అదనపు సమయం పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు. అలాగే అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేయలేకపోతుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు కరెంటు కోతల కారణంగా ఉదయం కూడా పనిచేయాల్సి వస్తోంది. పల్లెటూళ్ళలో ఉండి పనిచేస్తున్న వారు ఇన్వర్టర్లు ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది.

కొత్త ల్యాప్‌టాప్‌ కొనాల్సి వచ్చింది..

ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌ మూడు, నాలుగు గంటలకు మించి రావడం లేదు. కరెంట్‌ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీంతో కొత్త ల్యాప్‌టాప్‌ కొనాల్సి వచ్చింది. కె.రాంబాబు, ఉద్యోగి, మన్యంపార్వతీపురం జిల్లా

మీకే ఇబ్బంది ఎందుకు అని అడుగుతున్నారు

కరెంటు కోతల కారణంగా పూర్తి స్థాయిలో ఆఫీసు పని చేయలేకపోతున్నాం. ఒకసారి అయితే పై అధికారులు వింటారు. ప్రతిసారీ కరెంటు లేదనే సాకు చెబుతుంటే.. తెలంగాణలో లేని ఇబ్బంది మీకే ఎందుకు ఉందని అడుగుతున్నారు.-నాలాది సుధీర్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, గురజాల, పల్నాడు జిల్లా

కనీసం పది గంటలకు తక్కువ కాకుండా విద్యుత్తు కోతలున్నాయి..

కరోనా కారణంగా రెండున్నరేళ్లుగా ఇంటి నుంచే పనిచేస్తున్నాను. శ్రీకాకుళం పక్కన చిన్న గ్రామం మాది. ప్రస్తుతం మా గ్రామంలో రోజుకు మూడు సార్లు కరెంటు తీసేస్తున్నారు. కనీసం పది గంటలు విద్యుత్తు ఉండడం లేదు. ఈ కోతలు కూడా వేళాపాళా లేకుండా ఉంటున్నాయి. ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌ రెండు, మూడు గంటలే వస్తోంది. వైఫై కూడా ఉండటం లేదు. దీంతో పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నాం. ఇలాగైతే కష్టం.. అవసరమైతే ఇన్వర్టర్‌ కొనుక్కోండి.. విద్యుత్‌ సరఫరా ఉండే ప్రాంతాలకు వెళ్లి పనిచేయండి అంటూపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. - నక్కా వెంకటరమణ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, శ్రీకాకుళం

రాత్రి వేళల్లో కరెంటు కోతలు

మా దగ్గర విద్యుత్తు కోతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు, తెల్లవారుజామున 2 నుంచి 6 వరకు కరెంటు తీసేస్తున్నారు. దీంతో ఆఫీసు పని చేసుకోవడం కష్టమవుతోంది. -కోటేశ్వరరావు, కురిచేడు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, ప్రకాశం జిల్లా -

ఇదీ చదవండి: భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు, కంపార్టుమెంట్లు.. తోపులాటపై ప్రతిపక్షాలు ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.