ETV Bharat / state

అధికారం కోసమేనా వైసీపీ పాట్లు.. రైతుల గోడు వినే తీరక లేదు వాళ్లకి...

author img

By

Published : Dec 19, 2022, 9:53 AM IST

Updated : Dec 19, 2022, 11:51 AM IST

YCP Government
వైసీపీ ప్రభుత్వం

YCP Govt Not Care Farmers: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలుచుకోవాలని తపిస్తున్న సీఎం జగన్‌కు.. మాండస్‌ తుపాను బాధితుల గోడు వినిపించడం లేదు. గడప గడపకూ తిరుగుతున్నారా? లేదా? అని నిలదీస్తున్న జగన్‌కు.. తుపాను బాధిత రైతుల్ని పరామర్శించారా అని అడుగుదామనే ఆలోచనే లేకపోయింది. వచ్చే వంద రోజులూ కీలకమని పార్టీ నేతలకు చెప్పారు గానీ.. వారం రోజులుగా రాయలసీమతో పాటు పల్నాడు, ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అన్నదాతల పరిస్థితి ఎలా ఉందని ఒక్కమాటా అడగలేకపోయారు..

YCP Govt Not Care Farmers: ఇటీవల మాండౌస్‌ తుపాను కారణంగా సుమారు 5 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. తుపాను కారణంగా అన్నదాత నిండా మునిగాడు.. ఇదే సమయంలో సీఎం జగన్‌ మంత్రులు, ఎమ్మెల్యేలతో పార్టీ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ సాధించాలని.. దీని కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. అయితే.. కష్టాల్లో మునిగిన రైతుకు అండగా నిలవాలని, ఓదార్పు ఇవ్వాలనే సూచనలు సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు చేయలేకపోయారు. ముఖ్యమంత్రి సహా అధికశాతం మంత్రులు, ఎమ్మెల్యేలంతా దెబ్బతిన్న పొలాల పరిశీలనకు వెళ్లాలని యోచించలేకపోయారు. కొందరు పొలాల్లోకి వెళ్లినా.. అదీ తమ సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. తూతూ మంత్రంగా పంట నష్టం గణన సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలోని 35 మండలాల్లోని 510 గ్రామాల్లో 67 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. పొగాకు రైతులు ఎకరానికి రూ.25వేలకు పైగా పెట్టుబడుల్ని కోల్పోయారు. మినుము, ఇతర పంటలూ దెబ్బతిన్నా.. అక్కడి మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఎక్కడా కన్పించలేదు. పొలాలెలా ఉన్నాయో.. రైతుల ఇబ్బందులేమిటో తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. తర్లుపాడు మండలంలో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తన నియోజకవర్గ పరిధిలో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రతిపక్ష టీడీపీకు చెందిన కొందరు నాయకులు రైతుల్ని పరామర్శించి అండగా నిలుస్తున్నారు.

అధికారం కోసమేనా వైసీపీ పాట్లు.. రైతుల గోడు వినే తీరక లేదు వాళ్లకి...

చిత్తూరు జిల్లాపైనా తుపాను ప్రభావం అధికంగా ఉంది. వరితో పాటు ఉద్యాన పంటలకు భారీ నష్టం జరిగింది. కుప్పం, పుంగనూరు, నగరి నియోజకవర్గాల్లో రైతులు దెబ్బతిన్నారు. అయినా ఆ జిల్లాకు చెందిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా ఎక్కడా పరామర్శించిన దాఖలాలే లేవు. సొంత జిల్లాలో రైతులు అల్లాడుతున్నా.. మంత్రి పెద్దిరెడ్డి మాత్రం తాను ఇన్‌ఛార్జిగా ఉన్న అనంతపురం జిల్లాలో సమీక్షలే ముఖ్యం అన్నట్లుగా ఉన్నారు. కొందరు జిల్లాస్థాయి నాయకులు, అధికారులు మాత్రమే పొలాలను పరిశీలించారు.

తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయి. అయినా అన్నదాతలను ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోలేదు. అనంతపురం జిల్లాలో 10 మండలాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 17 మండలాల పరిధిలో పంటలు దెబ్బతిన్నా.. ఎక్కడా ప్రజాప్రతినిధులు పరిశీలించిన దాఖలాల్లేవు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోనూ పంటలను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించలేదు. వైయస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లో సుమారు 44 మండలాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయినా ముఖ్యమంత్రి సహా ఒక్క నేత కూడా పంటలను పరిశీలించలేదు.

తుపాను తాకిడికి ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలోని 30 మండలాల్లో సుమారు 15వేల ఎకరాలకు పైనే పంటనష్టం ఉంటుందని అంచనా. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాత్రమే సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలులో పంటలను పరిశీలించారు. జిల్లాలో మరెక్కడా ప్రజాప్రతినిధులు గట్టు తొక్కిన గుర్తులే లేవు. బాపట్ల జిల్లాలో వరి, మినుము, పత్తి రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అయినా అధికశాతం మండలాల్లో నేతల పరామర్శలే లేవు.

ఎంపీ సురేష్‌ రైతులను ఓదార్చిన దాఖలాలు లేవు. మంత్రి మేరుగ నాగార్జున తన సొంత నియోజకవర్గమైన వేమూరులో పంటనష్టాన్ని పరిశీలించారు. రేపల్లె నియోజకవర్గంలో ఎంపీ మోపిదేవి వెంకట రమణరావు, ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల నియోజకవర్గంలో పంటలను పరిశీలించారు. మిగిలిన నియోజకవర్గాల్లో పరామర్శలే కరవయ్యాయి.

ఇవీ చదవండి:

Last Updated :Dec 19, 2022, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.