ETV Bharat / state

'పన్నులు కడుతున్నా.. హక్కులు సాధించలేకపోతున్నాం'

author img

By

Published : Aug 18, 2021, 2:10 PM IST

Markapuram temple lands
Markapuram temple lands

ఎన్నో ఏళ్లుగా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. అయినా ఆ ఇళ్లపై వారు పూర్తి హక్కు పొందలేకపోతున్నారు. ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలైతే కల్పిస్తున్నాయి కానీ.. ఆ భూమిపై వారికి శాశ్వత హక్కు కల్పించలేకపోతున్నాయి. వంశపారంపర్యంగా హక్కులు ఉన్న తమకు.. పట్టాలు ఇచ్చి, తమ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించాలని దేవుని మన్యంలోని జీవిస్తున్న వారు కోరుతున్నారు.

'పన్నులు కడుతున్న ... హక్కు సాధించలేకపోతున్నాం'

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి చెందిన భూముల్లో దాదాపు 4 దశాబ్దాలుగా వేల మంది ప్రజలు నివాసముంటున్నారు. ఈ ఆలయానికి ఉన్న వందల ఎకరాల్లోని కొంత భాగం.. ఆలయంలో పనిచేసేవారికి అప్పట్లో సాగు చేసుకోవాలని ఇచ్చారు. కాలక్రమంలో ఆ కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసపోవడంతో సాగుకు పనికిరాకుండా పోయాయి. ఆ భూముల్లో ఇతరులు ఇళ్లు నిర్మించుకోవడం ప్రారంభించారు. అప్పట్లో వీటికి అంత విలువ లేదు.

పైగా.. పట్టణానికి శివారు ప్రాంతం కావడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారూ ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు. ఇలా సుమారు 3 వేల కుటుంబాలు వరకూ ఇళ్లు నిర్మించుకున్నాయి. కాలక్రమేణ ఈ ప్రాంతంలో అనధికారిక క్రయవిక్రయాలు సాగుతున్నా.. దేనికీ చట్టబద్ధత లేదు. దీంతో ఈ ఇళ్లల్లో నివాసం ఉంటున్నామే తప్ప వాటిపై హక్కు పొందలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు.

మార్కాపురంలో శ్రీనివాస థియేటర్‌, విజయ టాకీస్‌, నాగవరం రోడ్డు, శివాజీ నగర్‌, మంగళ మాన్యాలు తదితర ప్రాంతాల్లో ఇలా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వేలాది మంది జీవిస్తున్నారు. పురపాలక సంఘం వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రభుత్వానికి వీరు పన్నులు సైతం కడుతున్నారు కానీ... ఇళ్ల మీద హక్కు సాధించుకోలేకపోతున్నారు. 1991లో కోర్టుకు వెళ్లగా నామమాత్రపు ధరతో రిజిష్ట్రేషన్‌ చేయాలని సూచించింది. కొన్ని కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేయిస్తే, దేవాలయానికి ఆదాయంతో పాటు, రిజిస్ట్రేషన్‌ ఫీజుతో ప్రభుత్వానికి ఆదాయమూ సమకూరనుంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న తమ సమస్యను ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కరించాలని బాధుతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

పెన్‌కాక్‌ సిలాట్ క్రీడలో రాణిస్తున్న ఒంగోలు యువత.. ఆసియా యూత్‌ గేమ్సే లక్ష్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.