ETV Bharat / state

కొక్కొరోకో.. సమరానికి సిద్ధమైన పందెం కోళ్లు

author img

By

Published : Jan 14, 2023, 8:25 AM IST

Updated : Jan 14, 2023, 9:31 AM IST

Kodi Pandalu : సంక్రాంతి పండగ వేళ వందల కోట్ల రూపాయల జూదానికి తెర తీసే సమయం రానే వచ్చేసింది. కోడి పందేలకు జోరుగా ఏర్పాట్లు చేశారు. బరుల వద్ద పందెరాయుళ్ల కోసం అత్యాధునిక సౌకర్యాలను సైతం ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈ తతంగం అంతా జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి.

Kodi Pandalu
కోడి పందేం బరులు

సంక్రాంతి పండగ వేళ కోడి పందేలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసిన నిర్వహకులు

Cock Fights : సాధారణ రోజుల్లో కొక్కొరోకో అని ప్రజల్ని కోడి నిద్ర లేపుతుంది.. కానీ ఇప్పుడు పందేనికి రమ్మంటోంది. కాలికి కత్తి కట్టుకుని, రెక్కలు చాచిపెట్టి సమరానికి సిద్ధమంటోంది. పందేలు కాసేవాళ్లను కవ్వించి.. వందల కోట్ల రూపాయల జూదానికి తెర తీసేందుకు పందేంరాయుళ్లకు వేళయింది. అధికార పార్టీ నాయకుల అండదండలతో సాగే ఈ తతంగాన్ని చూస్తూ యంత్రాంగం మిన్నకుండిపోతోంది.

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఊరూరా కోడిపందేల బరులను ఏర్పాటు చేశారు. దీంతోపాటు గుండాట, కోతముక్క లాంటి జూదాల కోసం నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ ప్రాంతాల్లో గోదావరి జిల్లాలకు మించి పందేలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాపట్ల జిల్లా ఈపూరులో శుక్రవారం నుంచే ఫ్లడ్‌లైట్లు పెట్టి మరీ పందేలు వేస్తున్నారు. కోడి కాళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించడం చట్టవిరుద్ధమని న్యాయస్థానాలు, పోలీసుశాఖ హెచ్చరిస్తునే ఉన్నాయి. అది పట్టించుకోకుండా.. అధికారపార్టీ అండదండాలతో బరులు వేసిన నిర్వాహకులు ససేమిరా అంటున్నారు.

రాష్ట్ర స్థాయి కోడి పందేలకు ఏర్పాట్లు : కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేటలో రాష్ట్రస్థాయిలో కోడి పందేల కోసం బరి ఏర్పాటు చేశారు. కాకినాడ నగరం, గ్రామీణం, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, గోపాలపురం వంటి మండలాల్లోనూ పందేలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో 500 కోట్ల రూపాయలకు పైనే జూదం రూపంలో ప్రతి సంవత్సరం చేతులు మారుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, పాలకొల్లు, వీరవాసరం, యలమంచిలి, నరసాపురం, ఆచంట తదితర మండలాల్లో.. ఏలూరు జిల్లాలో చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పెదవేగి, దెందులూరు, కైకలూరు తదితర మండలాల్లోనూ కోడిపందేలు, ఇతర జూదక్రీడలకు సర్వం సిద్ధం చేశారు. ఈ రెండు జిల్లాల్లో 500 నుంచి 700 కోట్ల రూపాయల వరకూ చేతులు మారే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో పందేలు ఆడాటానికి, వీక్షించటానికి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికే చాలామంది చేరుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పంచాయతీ కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలను కోడి పందెంతో (కత్తి కట్టకుండా) చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ప్రారంభించారు.

జూదాలకు సిద్ధమైన గుడివాడ, రేపల్లెలు : బాపట్ల జిల్లాలోని రేపల్లె తీరప్రాంతంలో పందేల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచే పందేలు మొదలుపెట్టారు. రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణరావు ఇలాకా కావడంతో.. అటుగా వెళ్లడానికీ పోలీసులు సాహసించడం లేదని విమర్శలు వస్తున్నాయి. కోడిపందేలు మాత్రమే కాకుండా పేకాట, గుండాట, చిత్తులాట, కోత ముక్క తదితర జూదాలను ఆడేందుకు.. గుడివాడలోని కే కన్వెన్షన్‌ ప్రాంతంలో ఏర్పాట్లను సిద్ధం చేశారు. మూడు రోజులు ఇక్కడ పందేలను నిర్వహించటానికి ఏర్పాట్లను పూర్తి చేశారు.

క్యాసినో కూడా తగ్గేదే లే : కోడిపందేలతో పాటు ఇతర పోటీలకు నిర్వహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సంవత్సరం భీమవరం ప్రాంతంలో క్యాసినో స్థాయిలో ఏర్పాట్లను చేస్తున్నారు. కోడి పందేలను రసవత్తరంగా మార్చేందుకు కొన్నిచోట్ల సింథటిక్‌ బరులు, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు.

కొన్ని ప్రాంతాలలో బరుల వద్ద చేసిన ప్రత్యేక ఏర్పాట్లు

  • భీమవరం, ఉండి ప్రాంతాల్లో మహిళల కోసం కొన్ని బరుల వద్ద ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు
  • ఇతర రాష్ట్రాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చే అతిథులు, వీక్షకులు బస చేసేందుకు తాత్కాలికంగా వసతులను సైతం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా క్యారవాన్లను కూడా అందుబాటులో ఉంచారు.
  • బరులకు సమీపంలోని భవనాల్లో కొన్ని గదులకు మూడు రోజులకు 20నుంచి 25 వేల రూపాయలతో అద్దె చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారు.
  • కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం, వేమవరం బరుల్లో పందెంరాయుళ్లను ఆకర్షించేందుకు ఏర్పాట్లు చేశారు. గెలుపొందిన వారికి బహుమతులుగా ఇచ్చేందుకు బుల్లెట్లు, స్కూటీలను బరుల వద్ద రెడీగా ఉంచారు.

    ఇవీ చదవండి :
  • ఈ సంక్రాంతికి కుందనపు బొమ్మలా తయారవుతున్నారా..
  • అన్నదాతల సంబరం.. మన సంక్రాంతి పర్వం..
  • Sankranti holidays: సంక్రాంతి సెలవుల్లో ఎంజాయ్​ చేయండిలా!
Last Updated :Jan 14, 2023, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.