ETV Bharat / state

Gold ATM in Hyderabad: గోల్డ్‌ ఏటీఎంలో బంగారం నాణ్యతని నమ్మొచ్చా?

author img

By

Published : Dec 12, 2022, 7:35 PM IST

Gold ATM in Hyderabad:వచ్చే నెలలో మా బావ కూతురి వివాహం ఉంది. అందుకు ఓ రెండు గ్రాముల బంగారం కొనాలనుకుంటున్నాను మామా.. అవునా.. నేనూ మా కూతురి కోసం ఓ మూడు గ్రాముల బంగారం కొనాలి. నా దగ్గర కూడా పది వేల రూపాయలు ఉన్నాయి అన్న.. వాటితో ఎంత బంగారం వస్తే అంత విక్రయిద్దాం అనుకుంటున్నాను.. కానీ పెద్దపెద్ద గోల్డ్‌ షాపుల్లోకెళ్లి.. తక్కువ మోతాదులో బంగారం కొనాలంటేనే మొహమాటమేస్తోంది.

Gold ATM in Hyderabad
గోల్డ్‌ ఏటీఎంలో బంగారం నాణ్యతని నమ్మొచ్చా?

గోల్డ్‌ ఏటీఎంలో బంగారం నాణ్యతని నమ్మొచ్చా?

Gold ATM in Hyderabad: అయ్యో ఎందుకు మొహమాటం.. మనలాంటి వాళ్ల కోసమే.. గోల్డ్‌ ఏటీఎం వచ్చింది. ఏంటి గోల్డ్‌ ఏటీఎమా .. వినడానికి వింతగా ఉన్నా.. ఎనీ టైమ్‌ గోల్డ్‌ అన్నది నిజమే. అన్ని రకాల పరిమాణాల్లో.. అందరికి అందుబాటులో ఉండటంతో పాటు అన్ని వేళల ఇది సేవలందిస్తోంది. ఇంతకీ ఆ గోల్డ్‌ ఏటీఎంఎక్కడ ఉంది.? అందులోంచి బంగారాన్ని ఎలా తీసుకోవచ్చు.? బంగారాన్ని కొన్నా దాని నాణ్యతని నమ్మవచ్చా. ఇంతకీ ఎక్కడ ఉంది ఆ గోల్డ్‌ ఏటీఎం.. ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవితం ఎంతవేగంగా పరుగులు పెడుతుందో.. అంతే వేగంగా నూతన ఆవిష్కరణలు పురుడుపోసుకుంటున్నాయి.

ఇదే తరహాలో నాడు ఏటీఎం-ఎనీ టైమ్‌ మనీ పరిచయమయ్యింది. దీనివల్ల బ్యాంకుల్లోకి వెళ్లి క్యూలో నిల్చొని సొమ్ము తీసుకునే కష్టాలు తప్పాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎంత కావాలంటే అంత డబ్బును సునాయాసంగా తీసుకుంటున్నాం. ఇదే పోలికతో రైస్‌ ఏటీఎం, ఐదు రూపాయలు వేస్తే మాస్క్‌ అందించే ఏటీఎం. లడ్డుల ఏటీఎం. వాటర్‌ ఏటీఎం. చాయ్‌ ఏటీఎం. ఐస్‌క్రీం ఏటీఎం లాంటివి వచ్చాయి. కానీ, వాటన్నింటిని వినూత్నంగా.. బంగారం ప్రియులను ఆకట్టుకునేందుకు నూతనంగా వచ్చిందే ఈ గోల్డ్‌ ఏటీఎం. దేశంలోనే మొట్టమొదటి సారిగా గోల్డ్‌ ఏటీఎంను హైదరాబాద్‌లోని బేగంపేటలో ఏర్పాటు చేశారు. డిసెంబరు 3న గోల్డ్ జువెల్లరీ తయారు చేసే గోల్డ్ సిక్కా అనే సంస్థ, ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ అనే మరో సంస్థతో కలిసి రియల్‌ టైమ్‌ గోల్డ్‌ ఏటీఎంను ప్రారంభించింది.

నాటి నుంచి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది ఈ నయా గోల్డ్‌ ఏటీఎం సాధారణంగా బంగారం కొనుగోలు చేయాలంటే పెద్దపెద్ద ఆభరణాల దుకాణాలకు వెళ్తుంటాం. అందుకు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది గోల్డ్‌ ఏటీఎం. ఇందులో ఆఫ్ గ్రామ్‌.. మొదలుకొని. వంద గ్రాముల బంగారాన్ని సునాయాసంగా విక్రయించే ఏర్పాట్లు చేసింది గోల్డ్‌ సిక్కా సంస్థ. దీంతో పాటు ఏ రోజు కా రోజు మారే బంగారం ధరలకు అనుగుణంగానే విక్రయాలు జరిగేలా రూపొందించారు. బంగారం కొనాలనుకునే వారు నాటి ధరను బట్టి 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు 24 క్యారెట్ల బంగారాన్ని వారి కొనుగోలు శక్తికి తగినట్లుగా డ్రా చేసుకోవచ్చు.

గోల్డ్‌ ఏటీఎం బంగారం కొనాలనుకునే వారు మొత్తం 8 రకాల పరిమాణాల్లో అంటే 0.5, 1, 2, 5,10, 20, 50, 100 గ్రాములు ఉన్న ఆప్షన్ల నుంచి అవసరమైన మేరకు కొనుగోలు చేయచ్చు. దీనికి క్రెడిట్‌, డెబిట్‌, యూ పే ద్వారా నగదు చెల్లించేలా రూపకల్పన చేశారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న నగదు ఏటీఎంల్లో.. ఎలా ఆపరేట్‌ చేసి సొమ్మును తీసుకుంటామో అదే తరహాలో బంగారు నాణాలు డ్రా చేసుకోవచ్చన్న మాట. ఆ విధానాన్ని మీరూ ఓ సారి చూడండి. గోల్డ్ ఏటీఎంలోని బంగారం నాణ్యత విషయానికొస్తే.. బీఐఎస్ 999 హాల్ మార్క్‌తో కూడిన 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్‌ లభిస్తుంది.

అందులో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా నాణెం అందించే కార్డుపై పూర్తి వివరాలను పొందుర్చారు. దీంతో పాటు ఇన్‌వాయిస్‌ స్లిప్‌ కూడా వస్తుంది. టాక్స్ విషయంలోనూ ఎలాంటి హెచ్చు, తగ్గులకు ఆస్కారం లేకుండా ఈ గోల్డ్ ఏటీఎం మెషిన్ పక్కా క్లారిటీతో వ్యవహరించి ఏటీఎంస్క్రీన్ పై వివరాలు చూపిస్తుంది. ఒక వేళ లావాదేవీలు జరిగిన తర్వాత బంగారం కాయిన్‌ రాకపోతే 24 గంటల్లో మీ డబ్బు రీఫండ్‌ చేస్తారు. అలాగే కస్టమర్‌ కేర్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. మేడ్‌ ఇండియా.. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదంతో ఏర్పాటు చేసిన ఏటీఎంను పూర్తి స్వదేశీ పరికరాలతోనే రూపొందించినట్లు గోల్డ్‌సిక్కా సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రతాప్‌ తెలిపారు.నగదు విత్‌డ్రా చేసుకునే ఏటీఎంలాగే సేవలందించే గోల్డ్‌ ఏటీఎం24 గంటల పాటు సేవలందిస్తోంది.

కాగా ఇందుకు సంబంధించిన అన్నిరకాల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు గోల్డ్‌ సిక్కా సంస్థ అధికారులు పేర్కొన్నారు. డిసెంబరు 3న ప్రారంభమైన బంగారం ఏటీఎంకు నగర వాసుల నుంచి ఆదరణ లభిస్తున్నట్లు చెబుతున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటైన గోల్డ్‌ ఏటీఎంకు విశేష స్పందన లభించడంతో ఇలాంటి యంత్రాలను రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో మరో నాలుగు చోట్ల స్థాపించాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు గోల్డ్ సిక్కా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ తెలిపారు. అందులో ఒకటి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కాగా, మరొకటి ఓల్డ్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు.

మరో రెండింటిలో ఒక ఏటీఎం అమీర్‌పేటలో కాగా మరొకటి కూకట్‌పల్లిలో ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు కరీంనగర్, వరంగల్ నుంచి ఆర్డర్లు వచ్చినట్లు చెబుతున్నారు. ఆ తరువాత తమ తొలి ప్రాధాన్యత దక్షిణ భారతదేశానికే ఉంటుందని... దేశవ్యాప్తంగా మొత్తం 3 వేల గోల్డ్ ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రతాప్ చెబుతున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్‌లో ఐతే గోల్డ్‌ ఏటీఎం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే వందల్లో ప్రజలు వచ్చి బంగారు టోకెన్లను విత్‌ డ్రా చేసుకుంటున్నారు.

బయట దుకాణాల్లో చిన్న మెుత్తంలో బంగారం కొనాలంటే ఇబ్బందిగా ఉందని....ఇక్కడ సులువుగా 0.5 గ్రాములు కూడా కొనుగోలు చేయవచ్చని వినియోగదారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు డబ్బు మాత్రమే విత్‌ డ్రా చేసుకున్నామని... ఇప్పుడు బంగారం విత్‌ డ్రా చేసుకోవటం ఒక కొత్త అనుభవం అని వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి ఈ గోల్డ్‌ ఏటీఎం లే నిదర్శనమని చెప్పుకోవచ్చు. పెద్దమొత్తంలో బంగారం కొనుగోలు చేయలేని వారికి గోల్డ్ ఏటీఎం ఉపయోగపడుతోంది. తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతో నచ్చినంత బంగారం కొనుక్కొని దాచుకోనే వెసులుబాటు ఉన్నట్లు బంగారు ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.