ETV Bharat / state

Botsa Meeting With Teachers Unions: నేడు ఉపాధ్యాయ సంఘాలతో బొత్స సమావేశం.. బదిలీలపై స్పష్టత ఇస్తారా ?..లేదా ?

author img

By

Published : May 17, 2023, 8:13 AM IST

Etv Bharat
Etv Bharat

Minister Botsa Meeting With Teachers Unions In Vijayawada: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై అస్పష్టత కొనసాగుతోంది. గతేడాది బదిలీల ఉత్తర్వులను మధ్యలోనే నిలిపేసిన ప్రభుత్వం, ఈ సారి ఎప్పుడు చేపడుతుందనే అంశంపై సందిగ్ధత నెలకొంది. నేడు ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించే సమావేశంలో ఎంతవరకు స్పష్టత వస్తుందో అంతుచిక్కడం లేదు.

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై కొనసాగుతున్న అస్పష్టత

Minister Botsa Meeting With Teachers Unions In Vijayawada : ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం పిల్లిమొగ్గలేస్తోంది. సాఫీగా సాగాల్సిన ప్రక్రియను ప్రహసనంగా మార్చేస్తోంది. గత విద్యా సంవత్సరంలో బదిలీల షెడ్యూల్‌ ఇచ్చిన ప్రభుత్వం కోర్టు కేసులతో ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. బదిలీల మారదర్శకాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ ఉపాధ్యాయులు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చాలా మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చివరికి ప్రభుత్వం ఉత్తర్వులను రద్దు చేసింది. మొదట బదిలీలు నిర్వహించాలా.. వద్దా? అనే మీమాంసతోనే కాలయాపన చేసింది. చివరికి ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో బదిలీలకు ఆమోదం తెలిపినా ఈ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది.

ఉపాధ్యాయులు 8ఏళ్లు, ప్రధానోపాధ్యాయులకు 5ఏళ్ల సర్వీసు పూర్తైతే తప్పనిసరి బదిలీ నిబంధన గతం నుంచి ఉంది. గతేడాది ఉపాధ్యాయులకు 5 ఏళ్ల సర్వీసు పెట్టాలని మొదట భావించినా సంఘాల ఒత్తిడితో మళ్లీ మార్పు చేశారు. బదిలీల్లో 5ఏళ్లు, 8ఏళ్ల నిబంధన ఇప్పుడు ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2020 అక్టోబరులో బదిలీలు చేపట్టి 2021 జనవరి వరకు కొనసాగించింది. అప్పట్లో 4 నెలలపాటు బదిలీలు కొనసాగించారు. 2023-24 ఏడాదికి సంబంధించిన బదిలీలు ఎప్పుడు చేపడతారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. గత విద్యా సంవత్సరం పదోన్నతులను పూర్తి చేయలేక వాటిని సర్దుబాటుగా మార్చేశారు. ఎస్​జీటీలను స్కూల్‌ అసిస్టెంట్లుగా స్కూల్‌ అసిస్టెంట్లను ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించి, వారికి సర్దుబాటు కింద పోస్టింగులు ఇచ్చారు. పదోన్నతులు పొందిన వారికి అదనంగా నెలకు 2 వేల 500 భత్యం ఇస్తామని ప్రకటించినా ఇంత వరకు దీన్ని అమలు పరచలేదు. 4 నెలలకు సంబంధించిన భత్యం ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

గత విద్యా సంవత్సరంలోనూ పాఠశాలలు పునఃప్రారంభం నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని మొదట విద్యాశాఖ ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టులో నిర్వహిస్తామని చెప్పి చివరకు డిసెంబరులో బదిలీల షెడ్యూల్‌ ఇచ్చారు. 2023 -24 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల్లోనే బదిలీలు నిర్వహిస్తామని ప్రకటించినా ఇంతవరకూ విధివిధానాలు ఖరారు కాలేదు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చలు నిర్వహించడమే తప్ప బదిలీలకు సంబంధించిన చర్యలు తీసుకోవడం లేదు. బదిలీల ప్రక్రియ చేపడితే వాటిని పూర్తి చేసేందుకు 30 నుంచి 4 0రోజులు పడుతుంది. ప్రస్తుతం మే నెల సగం రోజులు పూర్తయ్యాయి.

జూన్‌ 12నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఉత్తర్వులిచ్చినా బడులు తెరిచే సమయానికి బదిలీలు పూర్తికావు. ఈ ప్రక్రియపై ఇప్పటికీ విద్యాశాఖకు స్పష్టత రాలేదు. కొంతమంది ఉపాధ్యాయులు 8ఏళ్ల సర్వీసు పూర్తికాకపోయినా తరగతుల విలీనం, పోస్టుల హేతుబద్ధీకరణ వల్ల మరో పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటి వారు తమకు పాత స్టేషన్‌ పాయింట్లు ఇవ్వాలని కోరుతున్నారు. స్పౌజ్‌ దరఖాస్తుతో దంపతులిద్దరూ దగ్గరలో ఉండే పాఠశాలకు బదిలీ కావడానికి అవకాశముంది. ఒకసారి ఉపయోగించిన తర్వాత 8ఏళ్ల వరకు స్పౌజ్‌ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండదు. పాఠశాలల విలీనంతో కొన్నిచోట్ల పోస్టులు కుదించారు. ఇలాంటి సమస్యలు అనేకం. ఇంతవరకు ఈ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వలేదు.

ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సమావేశం : నేడు విజయవాడలోని సమగ్ర శిక్ష ప్రధాన కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలను ప్రస్తావించడంతో పాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల బదిలీలు, స్కూల్ అసిస్టెంట్, హెడ్‌మాస్టర్‌ , ప్లస్ టూ కాలేజీలు పదోన్నతుల గురించి చర్చించే అవకాశం ఉంది. సంఘాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.