సీఎం సారూ.. గుంట తిప్ప కాలువ వాసన ఇంకా పోలేదు..!
Published: Mar 17, 2023, 10:54 AM


సీఎం సారూ.. గుంట తిప్ప కాలువ వాసన ఇంకా పోలేదు..!
Published: Mar 17, 2023, 10:54 AM
Auto Nagar Guntatippa Canal: ఆ రహదారి గుండా నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ నగరంలోకి వెళ్లేందుకు దగ్గర దారి అని ఈ మార్గంలో వచ్చిన వారంతా గుంటతిప్ప కాలువ దుర్వాసనకు బెంబేలెత్తిపోతున్నారు. ఏకంగా సీఎం జగనే వాసన భరించలేక కాలువ శుభ్రం చేయాలని ఆదేశాలిచ్చినా నేటికి సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు వాపోతున్నారు.
Auto Nagar Guntatippa Canal : కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వస్తుండగా మార్గం మధ్యలో ఎనికేపాడు, ప్రసాదంపాడు ప్రాంతాల్లో గుంటతిప్ప కాలువ నుంచి విపరీతమైన దుర్వాసన రావడాన్ని గమనించారు. వెంటనే ఈ కాలువను శుద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత అధికారులు తూతూ మంత్రంగా ఈ కాలువను శుద్ధి చేశారు.
పక్కా కాలువ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రచించి పనులు ప్రారంభించారు. నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఆటో నగర్ ప్రాంతంలో కాల్వలోకి చెత్తా చెదారం చేరడంతో చాలా చోట్ల కాలువ మూసుకుపోయింది. చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుంచి మురుగు నీరు కలువలోకి చేరడంతో పాటు చెత్తచెదారం చేరి దోమలు, ఈగలకు నిలయంగా మారింది. దీంతో ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు, ఈ రహదారి గుండ ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దుర్వాసనతో ప్రజలు తీవ్ర అవస్థలు : విజయవాడ నుంచి గన్నవరం వంటి ప్రాంతాలకు వెళ్లడానికి ఆటో నగర్ మీదుగా దగ్గర కావడంతో ఈ రహదారి గుండ చాలామంది రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం, ఉదయం సమయాల్లో నగరంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ రహదారిలోనే ప్రయాణం సాగిస్తుంటారు. వీరితో పాటు ఆటో నగర్లో వివిధ పరిశ్రమల్లో సుమారు 60 వేల మంది కార్మికులు పని చేస్తుంటారు. వారిలో చాలా మంది ఈ రహదారిలోనే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారికి ఆనుకుని ఉన్న గుంటతిప్ప కాలువ నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
చెత్త సేకరణ.. డంపింగ్ యార్డుకి తరలించడం లేదు : విజయవాడ ఆటో నగర్లో సుమారు 3 వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ కాలుష్యంతో ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సతమతమవుతుంటే ఈ రహదారికి ఆనుకుని నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చెత్త సేకరణ వాహనాల ద్వారా సేకరించిన చెత్త డంప్ చేస్తున్నారు. ఈ చెత్తని కొన్ని వారాలు గడిస్తే గాని డంపింగ్ యార్డుకి తరలించడం లేదు. దీంతో ఈ రహదారి గుండ రాకపోకలు సాగిస్తున్న ప్రజలు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి పని చేస్తున్న కార్మికుల పరిస్థితి వేరే చెప్పాల్సిన పని లేదు.
సీఎం ఆదేశాలను పట్టించుకోని అధికారులు : నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుంచి మురుగు ప్రవహించే గుంట తిప్ప కాలువ రెండుగా చీలి ఒకటి ఆటో నగర్ మీదుగా, మరోకటి కరెన్సీనగర్ మీదుగా ప్రవహిస్తోంది. రెండూ బల్లెం వారి వీధి వద్ద మరలా కలుస్తాయి. అక్కడ నుంచి ప్రసాదంపాడు మీదుగా జాతీయ రహదారి కింద నుంచి వేరే కాలువలో కలుస్తుంది. ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించినా గుంటతిప్ప కాలువ పనులు నేటికీ పూర్తి కాలేదు. కాలువ పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు.
80 అడుగుల నుంచి 20 అడుగులకు రహదారి : దీన్నే కొంత మంది వ్యాపారులు అదునుగా చూసుకొని ఆటో నగర్లోని పలు ప్రాంతాల్లో ఈ గుంటతిప్ప కాలువను ఆక్రమిస్తున్నారు. మట్టి వేసి కాలువను వారి అవసరాలకు అనుగుణంగా వ్యాపారులు మార్చుకుంటున్నారు. 80 అడుగులున్న ఈ రహదారి ప్రస్తుతం సుమారు 20 అడుగులకు చేరుకుంది. ఈ కాలువకు ఓ వైపు ఆటో నగర్ మరో వైపు కానూరు పంచాయితీ కావడంతో ఇండస్ట్రీయల్ ఏరియ లోకల్ అధారిటీ అధికారులు, కానూరు పంచాయితీ అధికారులు అనేక కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు. కాలువపై ఉన్న ఆక్రమణలు తొలగించి గుంటతిప్ప కాలువ నిర్మాణ పనులు త్వరగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి
