ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్లపై రేపే తీర్పు.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

author img

By

Published : Mar 16, 2023, 10:56 PM IST

avinash petition

EX minister, YS Vivekananda Reddy murder case Updates: మాజీమంత్రి, వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై రేపు తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. సీఆర్‌పీసీ 160 సెక్షన్ ప్రకారం.. తనపై కఠిన చర్యలు తీసుకోవద్దన్న అవినాష్ రెడ్డి అభ్యర్థనపై కూడా రేపు న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

YS Viveka Murder case Updates: మాజీ మంత్రి, వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై రేపు తెలంగాణ హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. సీఆర్‌పీసీ 160 సెక్షన్ ప్రకారం..తనపై కఠిన చర్యలు తీసుకోవద్దన్న అవినాష్ రెడ్డి అభ్యర్థనపై కూడా న్యాయస్థానం రేపు ఉత్తర్వులు ఇవ్వనుంది. అదేవిధంగా పిటిషన్‌‌పై పూర్తి విచారణ ముగిసే వరకూ తనను సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద తదుపరి విచారణ జరపకుండా.. స్టే ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర అభ్యర్థనపై కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వనుంది.

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని, తనకు న్యాయవాదిని అనుమతించాలని, తన వాంగ్మూలం ప్రతికి తనకు ఇవ్వాలని.. అవినాష్‌ రెడ్డి ఇటీవలే కోర్టును కోరారు. అంతేకాకుండా, విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగును కూడా చేయాలని ఆయన న్యాయస్థానాన్ని వేడకున్నారు. అవినాష్‌ రెడ్డి అభ్యర్థనపై స్పందించిన సీబీఐ అధికారులు.. ఆడియో, వీడియో రికార్డులు కూడా ఉన్నాయని హైకోర్టుకు తెలిపారు. మధ్యంతర పిటిషన్లపై ఈ నెల 13న వాదనలు విన్న హైకోర్టు.. శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు తీర్పును వెల్లడించనుంది. ఈ తీర్పు వెల్లడించే వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐ అధికారులను ఇటీవలే హైకోర్టు ఆదేశించింది.

మరోపక్క వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరిని అప్రూవర్‌గా అనుమతించడం చట్టవిరుద్ధమంటూ.. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎంవీ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకే వివేకా హత్యపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే, తీవ్రమైన ఆరోపణలు, స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ దస్తగిరిని అప్రూవర్‌గా మారుస్తూ.. కడప కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం చట్ట విరుద్దమని కృష్ణారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ కుట్రపూరితంగా దర్యాప్తు చేస్తోందన్నారు. దస్తగిరి ముందస్తు బెయిల్‌కు సీబీఐ అభ్యంతరం చెప్పలేదని.. ఆ తర్వాత అప్రూవర్‌గా మారారని.. ఇదంతా ముందస్తు పథకం ప్రకారం జరిగిందన్నారు.

దస్తగిరిని అప్రూవర్‌గా మారుస్తూ.. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేయాలని హైకోర్టును కోరారు. కృష్ణారెడ్డి పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం తెలిపింది. ఇదే విషయంపై గతంలో దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసిందని సీబీఐ తెలిపింది. కాబట్టి దస్తగిరి అప్రూవర్ అంశంపై కృష్ణారెడ్డికి పిటిషన్‌ వేసే అర్హత లేదని దర్యాప్తు సంస్థ వాదించింది. పిటిషన్ విచారణార్హతపై సోమవారం పూర్తిస్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.

ఈ నేపథ్యంలో వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తనను అరెస్ట్‌ చేయకుండా చూడాలంటూ తాజాగా తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. అవినాశ్‌రెడ్డి పిటిషన్‌పై వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. తీర్పును 17వ తేదీకి (రేపు) రిజర్వ్ చేసింది. దీంతో రేపు హైకోర్టులో తీర్పు ఎలా ఉండబోతుందోనని అవినాశ్‌రెడ్డితో పాటు, పార్టీ కార్యకర్తల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.