ETV Bharat / state

CPS: సీపీఎస్‌ విధానానికి చట్టం చేయలేదు..ఈ అంశంపై కోర్టుకెళ్తాం: సూర్యనారాయణ

author img

By

Published : Apr 27, 2023, 2:08 PM IST

Surya Narayana on CPS
Surya Narayana on CPS

Surya Narayana on CPS: రాష్ట్రంలో అమలుచేస్తున్న సీపీఎస్‌ విధానానికి చట్టబద్ధత లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభిప్రాయపడింది. సీపీఎస్‌కు సంబంధించి ఎలాంటి చట్టం కానీ గవర్నర్‌ అనుమతి కానీ తీసుకోలేదని.. కేవలం జీవో మాత్రమే జారీ చేశారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.

సీపీఎస్‌ విధానానికి చట్టం చేయలేదు..ఈ అంశంపై కోర్టుకెళ్తాం

Surya Narayana on CPS: రాజ్యాంగ బద్ధత, చట్ట బద్దత లేని సీపీఎస్ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. చట్టబద్ధం కానీ సీపీఎస్​ను ఏపీలో అమలు విషయంపై ఏపీ హైకోర్టులో సవాలు చేస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. చట్టబద్ధం కానీ సీపీ ఎస్​ను ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తుందో లేక చట్టబద్ధం చేసి కేంద్రం నిబంధనలు యథాతథంగా అమలు చేస్తుందో చూస్తామన్నారు.

2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. అవగాహన లేకుండా సీపీఎస్ రద్దుకు హామీ ఇచ్చారని భావించడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పిందని, ఇప్పటి వరకూ ఆ మాటే ఎత్తటం లేదని సూర్యనారాయణ విమర్శించారు. చాలా ఉద్యోగ సంఘాలు సీపీఎస్​పై ఆందోళన చేస్తున్నాయన్నారు.

ఏపీలో సీపీఎస్ అమలుకు జారీ చేసిన ఉత్తర్వులకు రాజ్యాంగ బద్ధత, చట్ట బద్ధత లేవని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యాయనంలో వెల్లడైందన్నారు. ఏపీలో అమలు చేస్తున్న సీపీఎస్​కు సంబంధించి రాష్ట్రలో చట్టం చేయలేదని, గవర్నర్ అనుమతి కూడా లేదని అన్నారు. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మాత్రమే అమలు చేస్తున్నారని.. అందుకే ఏపీలో సీపీఎస్ అమలు అనేది చెల్లదని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసే సమయానికి కేంద్రం కూడా దీనిని నోటిఫై చేయలేదన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఏ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో చెప్పలేదన్నారు. కేంద్రం చేసిన సీపీఎస్ చట్టాన్ని ఏపీలోనూ ఆమోదం తెలియజేయాలి.. కానీ అలా జరగలేదని సూర్యనారాయణ అన్నారు. ఏపీలో అమలు చేస్తున్న సీపీఎస్​కు రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధత లేదని అన్నారు. కేవలం జీవో మాత్రమే జారీ చేశారన్నారు.

"ఈ సీపీఎస్.. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ​2004లో 653,654,655 అనే మూడు జీవోల ద్వారా సీపీఎస్​ అమలు ప్రారంభించిందో.. దానికి రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత లేదని మా అధ్యయనంలో వెల్డడైంది. భారత రాజ్యాంగంలోని 309ఆర్టికల్​ ప్రకారం.. ఉద్యోగుల నియామకాలు, జీతాభత్యాలను ఇతర అంశాలు ఏవైనా సరే.. సంబంధిత శాసన వ్యవస్థ చేసే చట్టం ద్వారా కానీ.. లేదా చట్టం చేసేవరకు గవర్నర్​ పేరు మీద నిబంధనలు నోటీఫై ద్వారా మాత్రమే అమలు చేయాలి. కానీ ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న సీపీఎస్​ను ఈ రాష్ట్ర శాసన సభ ఒక చట్టం చేయలేదు.. గవర్నర్​ పేరు మీద ఈరోజు వరకు కూడా రూల్స్​ చేయలేదు"-సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఈ విషయాన్ని ఏపీ సీఎస్​కు కూడా తెలియజేశామన్నారు. జీవో ప్రకారం కేంద్రం చేసిన చట్టాన్ని అమలు చేస్తున్నట్టు చెబితే అందులో ఉన్న అంశాలను యథాతథంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. కానీ కేంద్రం ప్రకటించిన చట్టానికి.. ఏపీలో ప్రస్తుతం అమలు అవుతున్న దానికి 18 అంశాల్లో వ్యత్యాసం ఉందని అన్నారు. కేంద్రం 14 శాతానికి కాంట్రిబ్యూషన్ పెంచిందని.. కానీ ఏపీ లో దానిని 10 శాతంగా మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. అలా చూస్తే సీపీఎస్ ఉద్యోగులకు 1500 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ బకాయి ఉన్నట్టేనన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానానికి వెళ్లాయని తెలిపారు.

ఏపీలో అమలు చేస్తున్న సీపీఎస్ చట్టబద్ధం కాలేదు కాబట్టి దానిని రద్దు చేయాలని సీఎస్​ను కోరామన్నారు. దీనిపై ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని కూడా సంప్రదించామని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖలోని కొందరు అధికారులతో సీపీఎస్ అమలు అంశంపై చర్చించామన్నారు. అప్పటి విపక్ష నేతగా సీఎం జగన్​కు సీపీఎస్ పై పూర్తి అవగాహన ఉందని తాము విశ్వసిస్తున్నామన్నారు. చట్ట బద్ధత లేదని తెలిస్తే సీఎం జగన్ సీపీఎస్​ను రద్దు చేస్తారేమోనన్నారు.

సీపీఎస్ రద్దు వల్ల వచ్చే 15ఏళ్ల పాటు అంటే 2037 వరకూ రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని అన్నారు. కేంద్రం జారీ చేసిన సీపీఎస్ చట్టాన్ని అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం జీవో నెంబర్ 653 మాత్రమే జారీ చేసిందన్నారు. ఏపీలో దీన్ని చట్టం చేయలేదని తెలిపారు. 2004 నుంచి సీపీ ఎస్ ఉద్యోగులకు సంబంధించిన వేల కోట్ల రూపాయలు ట్రస్టు వద్ద ఉన్నాయని సూర్యనారాయణ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.