ETV Bharat / state

తుంగభద్ర నదిపై అప్పటి ప్రేమ.. ఇప్పుడేమైంది?

author img

By

Published : Dec 19, 2020, 4:52 PM IST

తుంగభద్ర నదిపై అప్పటి ప్రేమ.. ఇప్పుడేమైంది?
తుంగభద్ర నదిపై అప్పటి ప్రేమ.. ఇప్పుడేమైంది?

పుష్కరాల సందర్భంగా ఆ నదిపై ఎంతో ప్రేమ ఒలకబోశారు. ఆగమేఘాల మీద ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తాత్కాలిక ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. 12 రోజుల పండుగ పూర్తైంది. వెంటనే నదిని వదిలేశారు. మళ్లీ.. కాలుష్య కోరల్లో ఆ నది చిక్కుకుంది.

తుంగభద్ర నదిపై అప్పటి ప్రేమ.. ఇప్పుడేమైంది?

పుష్కరాల సమయంలో స్వచ్ఛంగా కనిపించిన తుంగభద్ర నది.. ఇప్పుడు మునకేస్తే మలినాలు అంటుకునేంత మురికిగా తయారవుతోంది. 12 రోజులూ.. కర్నూలు నగరం నుంచి వచ్చే మురుగునీరు.. నదిలో కలవకుండా చూసిన ప్రభుత్వం.. పుష్కరుడితోపాటే.. తుంగభద్ర స్వచ్ఛతకూ వీడ్కోలు పలికింది.

కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ప్రవహిస్తోంది. 12 ఏళ్లకోసారి పుష్కరాలు నిర్వహిస్తారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. పుష్కరాల సందర్భంగా... నదిలో మురుగునీరు కలువకుండా... ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అందులో భాగంగా... కర్నూలు నగరంలోని రోజా వీధి నుంచి రాంబొట్ల దేవాలయం వరకు నదిలో మురుగునీరు కలవకుండా.. 5 కోట్ల రూపాయలతో కర్నూలు నగరపాలక సంస్థ 9 చోట్ల సంపులు ఏర్పాటు చేసింది. 18.5 కిలోమీటర్ల మేర పైపులైను వేసి.. మురుగునీటిని నగరం దాటించి... జోహరాపురం వద్ద కలిసేలా చేశారు. పుష్కరాల సమయంలో... భక్తులకు ఇబ్బంది లేకుండా పుష్కర ఘాట్లలో స్నానాలు ఆచరించారు.

డిసెంబర్ ఒకటో తేదీన పుష్కరాలు ముగిశాయి. రెండో తేదీ నుంచి నదిలోకి యథావిధిగా మురుగునీటిని కలపటం ప్రారంభించారు. గుత్తేదారు తమ పని అయిపోయిందని చేతులు దులిపేసుకున్నారు. పుష్కరాలు అయిపోయాయని... మున్సిపాలిటీ అధికారులు... నదిని పట్టించుకోవటం మానేశారు. ప్రస్తుతం రోజావీధి, సంకల్ బాగ్, నగరేశ్వరం ఆలయం, సాయిబాబా గుడి, రాఘవేంద్రమఠం, ఓల్డ్ సిటీల నుంచి యథేచ్ఛగా.. మురుగునీరు నదిలో కలుస్తోంది. ప్రతి రోజూ 60 ఎంఎల్ డీల మురుగునీరు నదిలో కలుస్తోంది. నీటి శుద్ధికి మూడు ప్లాంట్లు ఉన్నా... ఒక్కో కేంద్రం నుంచి 0.80 ఎంఎల్ డీల చొప్పున శుద్ధి చేస్తున్నారు. అంటే 2.4 ఎంఎల్​డీల మురుగునీరు మాత్రమే శుద్ధి అవుతోంది. మిగిలినదంతా... ఏకంగా నదిలోనే కలిసిపోతుండటం గమనార్హం.

ప్రభుత్వం తుంగభద్ర నదిని ప్రక్షాళన చేయాలని... మురుగునీరు నదిలో కలవకుండా... శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: కదనరంగాన్ని తలపించిన యుద్ధవిమాన విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.