ETV Bharat / state

Illegal Mining Mafia: కర్నూలులో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

author img

By

Published : Jun 6, 2023, 3:10 PM IST

Etv Bharat
Etv Bharat

Illegal Mining Mafia: వైసీపీ పాలనలో మాకు అడ్డేముంది అన్నట్లు.. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. రైల్వే పనుల పేరిట తాత్కాలిక అనుమతులు తీసుకుని.. ఏడాదిగా వెంచర్ల కోసం ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. కొండలు, గుట్టల్నీ కొల్లగొడుతున్న అక్రమార్కులు.. పొలాలను కూడా గుల్లచేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని దేవమాడ శివారులో అనుమతులు ముగిసినా ఎర్రమట్టి తవ్వేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు.

కర్నూలులో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు

Illegal Mining Mafia: రైల్వే అవసరాల కోసం మట్టి తవ్వకాలకు తాత్కాలిక అనుమతులు కావాలంటూ.. గతేడాది జూటూరు శైలజ అనే మహిళ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పెట్టుకున్నారు. ఈ మేరకు కర్నూలు మండలం దేవమాడ పరిధిలో సర్వే నంబర్ 84లో 10.20 హెక్టార్లలో మట్టిని తవ్వుకోవడానికి గనులశాఖ, రెవెన్యూశాఖ అనుమతి ఇచ్చాయి. దరఖాస్తులో పేర్కొట్లే కొంతకాలం రైల్వే పనుల కోసం మట్టిని తరలించారు. సంబంధిత అనుమతుల గడువు ముగిసింది. అలా నెలలు గడిచిపోతున్నాయి. అయినా మట్టి తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. ప్రైవేటు అవసరాల కోసం ప్రతి రోజూ కొన్ని వందల టిప్పర్ల మట్టిని తరలించేస్తున్నారు. ఇప్పటికే సుమారు వంద అడుగుల లోతు వరకు తవ్వేశారు.

2009 లో తుంగభద్రకు వరదలు వచ్చినప్పుడు దేవమాడ ప్రజలు గ్రామ శివారులోని గట్టుపైకి వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ భూమిని గ్రామంలోని పేద రైతులకు ప్రభుత్వం వ్యవసాయం చేసుకోవటానికి తాత్కాలిక పట్టాలు ఇచ్చింది. ఈ భూమిపై కన్నేసిన మాఫియా.. గట్ల వద్ద భారీగా తవ్వేస్తున్నారు. ఈ గట్లను తవ్వేస్తే పక్కనే ప్రవహించే వంక నీరు ఊరిపై పడి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు పశువులు కూడా ఇదే ప్రాంతంలో మేతకు వస్తాయని.. ఈ తవ్వకాల వల్ల వాటికి కూడా ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మట్టిని తవ్వేందుకు వీలులేదని స్థానికులు అడ్డుకున్నారు.

చుట్టుపక్కల ప్రాంతాలకే కాకుండా.. తెలంగాణ, కర్ణాటకకు కూడా మట్టి తరలిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రోజూ సరాసరిన వంద టిప్పర్లు మట్టి తరలించి.. 15 లక్షల రూపాయల వరకు ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా నెలకు 4.5 కోట్లు ఆర్జిస్తున్నారు. వెంచర్ల కోసం మట్టి తవ్వుతున్నట్లు మైనింగ్‌ సూపర్‌వైజర్‌ కూడా అంగీకరిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలు వెంటనే ఆపకపోతే ప్రజాపోరాటం తప్పదని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

"ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపుగా 70 అడుగుల లోతుకు పైగా మట్టిని తవ్వేశారు. ఇదే రీతిలో ఇంకా మట్టిని తవ్వేస్తే.. చాలా ప్రమాదమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా అడ్డగోలుగా గట్లు తవ్వేయటంతో పక్కనే ఉన్న వంకలోని నీరు గ్రామంలోకి వచ్చి.. ముంచేసే ప్రమాదం ఉంది. అంతేకాక చుట్టు పక్కల ఉన్న గొర్రెలు, మేకలు, పశువులు ఇక్కడికే మేతకు వస్తాయి. ప్రమాదవశాత్తూ అవి ఈ గుంతల్లో పడిపోయే అవకాశాలున్నాయి. దీనిపై అధికారులు స్పందించి మట్టి తవ్వకాలను అదుపు చేయాలని కోరుతున్నాం" - స్థానికులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.