ETV Bharat / state

అప్పు పుట్టేదెలా..? అయిదో తేదీ వచ్చినా చాలా మందికి చేరని జీతాలు, పెన్షన్లు

author img

By

Published : Dec 5, 2022, 7:53 AM IST

Updated : Dec 5, 2022, 8:35 AM IST

చాలా మందికి చేరని జీతాలు, పింఛను
చాలా మందికి చేరని జీతాలు, పింఛను

అయిదో తేదీ వచ్చినా ఇంకా రాష్ట్రంలో చాలామంది ఉద్యోగులకు జీతాలు అందలేదు. పెన్షనర్లకు కొందరికి ఇంకా పింఛను జమ కాలేదు. అనేకమంది టీచర్లు జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ఖజానా వెలవెలబోతోంది. అప్పు పుట్టే పరిస్థితీ కనిపించడం లేదు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన పరిమితి మేరకు అప్పులు చేసింది. దీంతో కొత్తగా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణం పుట్టించే పరిస్థితీ కనిపించడం లేదు.

ఈ మంగళవారం ఆర్‌బీఐ సెక్యూరిటీల వేలంలో అయిదు రాష్ట్రాలు పాల్గొననున్నాయి. 9వేల 250 కోట్ల రుణం కోసం వేలం ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాష్ట్రానికి రుణ అనుమతులు లేకపోవడంతో అప్పు తీసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. ఖజానా నుంచి చెల్లింపులు చేయాలంటే ఓవర్‌ డ్రాఫ్ట్‌లోకి వెళ్లవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ వెసులుబాటుకు పరిమితి ఉంటుంది. ఇప్పుడు ఏ రకంగా నిధులు సమీకరిస్తారనేది చూడాలి.ఏపీ ఇప్పటికే రుణ పరిమితిని దాటేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 44 వేల 574 కోట్ల మేర బహిరంగ మార్కెట్‌ రుణానికి కేంద్రం అనుమతులు ఇవ్వగా.... రాష్ట్రం 45 వేల 503 కోట్ల మేర రుణం స్వీకరించింది. రాష్ట్ర ఆర్థిక పెద్దలు దిల్లీ పెద్దలను కలిసిన వేళ... విద్యుత్తు సంస్కరణలు అమలు చేయడం వల్ల అదనంగా ఇచ్చే రుణ పరిమితి నుంచి రెండు వారాల కిందట కొంత అనుమతి లభించింది. అందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 వేల 300 కోట్లు రుణం ఆ రూపేణా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అమలు చేసిన సంస్కరణల ఆధారంగానే ఈ అనుమతులు లభిస్తాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో 5 వేల 300 కోట్ల మేర ఇలా రుణం పొందే ఆస్కారం ఉన్నా..... ఏపీకి 3వేల200 కోట్ల మేర మాత్రమే అనుమతులు లభించాయి.

నెల ప్రారంభంలో జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి రాష్ట్రం కష్టాలు పడవలసి వస్తోంది. రాష్ట్రంలో పెన్షన్లు, జీతాల కోసం 5 వేల 500 కోట్లు అవసరం కాగా.... సగం మొత్తాలే చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. అక్టోబరు నుంచి డిసెంబరు నెలాఖరు వరకు 10 వేల కోట్ల రుణం అవసరమని రిజర్వు బ్యాంకుకు ఇండికేటివ్‌ క్యాలండర్‌ కోసం ఏపీ సమాచారం పంపింది. ఆ ప్రకారం అక్టోబరు నుంచి ఇంతవరకు 7 వేల 000 కోట్ల రుణం అవసరమవుతుందని రాష్ట్ర అధికారులు అంచనా వేశారు. పరిమితులకు మించి రుణం వాడేయ్యడంతో ప్రస్తుతం 4 వేల 913 కోట్ల రుణం తీసుకుంది. ఇప్పటికే రుణాల పరిమితి దాటిపోవడంతో ప్రస్తుతం నిధుల సమీకరణకు ఇబ్బందులు పడవలసి వస్తోందని సమాచారం. పైగా ఇప్పటికే కార్పొరేషన్ల ద్వారా సమీకరించిన రుణాలు దాదాపు 20 వేల కోట్లు దాటిపోయాయి.

చాలా మందికి చేరని జీతాలు, పింఛను

ఇవి చదవండి:

Last Updated :Dec 5, 2022, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.